Sorry: ఇన్నిసార్లు ‘Sorry’లు ఎవరి కోసమో.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ దగ్గర ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-25T22:32:19+05:30 IST

హీరోయిన్ వెంటపడి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకునేందుకు హీరో వేసే పిచ్చి వేషాలు, ఆ లోపు హీరోయిన్ హీరోను తిట్టి, చెంపదెబ్బ కొట్టి సిగ్గులేదా..

Sorry: ఇన్నిసార్లు ‘Sorry’లు ఎవరి కోసమో.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ దగ్గర ఏం జరిగిందంటే..

బెంగళూరు: హీరోయిన్ వెంటపడి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకునేందుకు హీరో వేసే పిచ్చి వేషాలు, ఆ లోపు హీరోయిన్ హీరోను తిట్టి, చెంపదెబ్బ కొట్టి సిగ్గులేదా అని చీవాట్లు పెట్టిన సినిమాలు చాలానే చూసుంటారు. ఆ తర్వాత.. తన ప్రవర్తన వల్ల హీరోయిన్ ఇబ్బంది పడిందని తెలుసుకున్న హీరో ఆమెను క్షమించమని నేరుగా అడగకుండా ‘Sorry’ అని కాలేజ్ గోడలపైన రాసి హీరోయిన్ మనసు గెలుచుకుంటాడు. ‘పోన్లే ఇంతగా ప్రాధేయపడుతున్నాడు కదా.. ప్రేమించేద్దాం’ అని హీరోయిన్ కూడా మనసు మార్చుకుని హీరో గారి ప్రేమకు ఓకే చెబుతుంది. చాలా తెలుగు సినిమాల్లో కొన్ని సంవత్సరాల పాటు కామన్‌గా కనిపించిన సినిమా కథ ఇదే. మరి ఇలాంటి సినిమాలు చూసి స్పూర్తి పొందాడో, ఏంటో తెలియదు గానీ బెంగళూరులో ఓ ఆకతాయి సరిగ్గా ఇదే పని చేశాడు. బెంగళూరులోని సుంకదకట్టె‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లే వీధిలో, ఆ స్కూల్ గోడలపై, మెట్లపై ‘Sorry’ అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది.



రోడ్లపై, గోడలపై పదుల సార్లు ‘Sorry’ అని రాసి ఉండటాన్ని చూసి స్థానికులు, స్కూల్ యాజమాన్యం అవాక్కయింది. ఆ స్కూల్‌లో చదివే ఓ బాలికతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న అబ్బాయే ఈ పని చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. స్కూల్ చుట్టుముట్టు ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి ఈ పని చేసినట్లుగా సీసీ ఫుటేజీలను పరిశీలించగా తేలింది. పోలీసులు బైక్ మీద వచ్చిన ఆ ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల ప్రభావంతోనే ఈ అతి పనికి ఆ యువకులు పూనుకుని ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో ఇలా ఆకతాయిల్లా ప్రవర్తిస్తూ ఇలా ‘Sorry’ అని గోడలపై రాయడమే హీరోయిజంగా సినిమాల్లో చూపించడం ఇకనైనా మానుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

Updated Date - 2022-05-25T22:32:19+05:30 IST