ముందుచూపుతో..

ABN , First Publish Date - 2021-06-17T05:02:35+05:30 IST

కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతిని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ... థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలతో అప్రమత్తమవుతోంది. భవిష్యత్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండాఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు చెబుతోంది. ఈసారి చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చునన్న వైద్య నిపుణుల అంచనాతో వీరి సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా 200 పడకలు కేటాయిస్తోంది.

ముందుచూపుతో..
ఎస్‌.కోట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో చిన్న పిల్లల వార్డు

థర్డ్‌వేవ్‌పై వైద్యశాఖ అప్రమత్తం

చిన్నపిల్లల రక్షణకు ఆక్సిజన్‌ బెడ్‌లు సిద్ధం

ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు చురుగ్గా వ్యాక్సినేషన్‌

శృంగవరపుకోట, జూన్‌ 16:

కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతిని పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ... థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలతో అప్రమత్తమవుతోంది. భవిష్యత్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండాఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు చెబుతోంది. ఈసారి చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చునన్న వైద్య నిపుణుల అంచనాతో వీరి సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా 200 పడకలు కేటాయిస్తోంది. ఇందులో 71 ఐసీయూ, 129 నాన్‌ ఐసీయూ పడకలు ఉన్నాయి. సెకెండ్‌ వేవ్‌లో చాలా మందిలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోయాయి. ప్రాణ వాయవు అందక నరకయాతన అనుభవించారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితి చిన్నారులకు రాకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసే ప్రయత్నం చేస్తోంది. అన్ని ప్రభుత్వ కరోనా ఆసుపత్రుల్లోనూ కేంద్ర ఆసుపత్రిలో ఉన్నట్లే పైపులైన్‌ ద్వారా బెడ్‌లకు ఆక్సిజన్‌ సరఫరా చేసే విధానాన్ని తేవాలనుకుంటోంది. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రితో పాటు ఇటీవల ఏరియా ఆసుపత్రులుగా మారిన శృంగవరపుకోట, గజపతినగరం, సాలూరులో కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పైపులైన్లు ఏర్పాటు చేసే పనిని ఏపీఎంఐడీసీకి అప్పగించింది. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులకు 20 సిలిండర్ల వరకు పంపించారు. ఇంకా సమకూర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐదేళ్ల వయసులోపు పిల్లలున్న తల్లులకు కరోనా టీకాలను వేయిస్తోంది. ఆక్సిజన్‌ సదుపాయాల కల్పనతో పాటు నైపుణ్యం కలిగిన వైద్యులు, సిబ్బందిని నియమించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

ఆక్సిజన్‌ సిలిండర్లు వచ్చాయి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అవసరమైన మేర ఆక్సిజన్‌ సిలిండర్‌లు వచ్చాయి. పైపులైన్‌ ద్వారా బెడ్‌లకు ఆక్సిజన్‌ సరఫరా చేసే విధానాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఈ పనులను ఏపీఎంఐడీసీ చేపట్టనుంది.

                                     - డాక్టర్‌ ఆర్‌.త్రినాథరావు, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, శృంగవరపుకోట 



Updated Date - 2021-06-17T05:02:35+05:30 IST