కర్ఫ్యూ వేళ.. ‘ప్రైవేటు’ దూకుడు!

ABN , First Publish Date - 2021-06-04T04:51:05+05:30 IST

కర్ఫ్యూ నిబంధనలను కొన్ని ప్రైవేటు బస్సుల నిర్వాహకులు గాలికొదిలేస్తున్నారు. రాత్రిపూట యథావిధిగా ప్రయాణికులతో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం గత నెల 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వ్యాపార లావాదేవీలతో పాటు రవాణా, ఇతర కార్యకలాపాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12వరకే అనుమతి ఉంది. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అధికారుల అనుమతి లేకుండా రోడ్లపై వాహనాలు తిరగరాదు. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, టెంపోట్యాక్సీలు, టాటామ్యాజిక్‌ వాహనాలను మధ్యాహ్నం నుంచి నిలిపేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కొన్ని ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు.

కర్ఫ్యూ వేళ.. ‘ప్రైవేటు’ దూకుడు!
విజయవాడ వెళ్లేందుకు హైవేపై సిద్ధంగా ఉన్న ప్రైవేటు బస్సు

 నిబంధనలకు విరుద్ధంగా రోడ్డెక్కుతున్న బస్సులు

 ప్రయాణికులతో రాత్రి పూట హైవేపై రాకపోకలు

 చోద్యం చూస్తున్న అధికారులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కర్ఫ్యూ నిబంధనలను కొన్ని ప్రైవేటు బస్సుల నిర్వాహకులు గాలికొదిలేస్తున్నారు. రాత్రిపూట యథావిధిగా ప్రయాణికులతో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం గత నెల 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వ్యాపార లావాదేవీలతో పాటు రవాణా, ఇతర కార్యకలాపాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12వరకే అనుమతి ఉంది. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు అధికారుల అనుమతి లేకుండా రోడ్లపై  వాహనాలు తిరగరాదు. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, టెంపోట్యాక్సీలు, టాటామ్యాజిక్‌ వాహనాలను మధ్యాహ్నం నుంచి నిలిపేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కొన్ని ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కర్ఫ్యూ అమలవుతున్న సమయంలోనూ యథేచ్ఛగా వాహనాలు నడుపుతున్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం, పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం నుంచి ప్రతిరోజూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. కర్ఫ్యూ వేళ.. రవాణా ఇబ్బందులను సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే ప్రయాణికుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.  పలాస-కాశీబుగ్గ నుంచి నిత్యం రాత్రిపూట విజయవాడకు ఐదు బస్సులు వెళుతున్నాయి. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతంలోని కొన్ని ప్రైవేటు బస్సులు కూడా రాత్రివేళ గుట్టుగా విజయవాడకు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం నుంచి కూడా ప్రైవేటు బస్సులు రాత్రి వేళల్లో ప్రయాణికులతో జిల్లాకు చేరుకుంటున్నాయి. కొన్ని ట్రావెల్స్‌ యజమానులు దర్జాగా ఆన్‌లైన్‌ టిక్కెట్లు అమ్ముకొని మరీ ప్రయాణికులను చేరవేస్తున్నారు.  ఈ విషయం తెలిసినా పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. 


 చిన్న అవసరాల కోసం బయటకు వస్తే...

మందులు, ఇతరత్రా చిన్నచిన్న అవసరాల కోసం సొంత కార్లు, జీపులు, ద్విచక్ర వాహనాలపై కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటకు వస్తే, కొవిడ్‌ నిబంధనలంటూ పోలీసులు, అధికారులు హడావుడి చేస్తున్నారు. మందులు, ఆస్పత్రుల పనిమీద అని చెప్పినా.. రకరకాల ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతున్నారు. కనీసం రూ.200 నుంచి రూ.1000 వరకు అపరాధ రుసుం వసూలు చేస్తున్నారు. ఆటోలో గ్రామీణ ప్రాంతాల నుంచి శ్రీకాకుళం నగరానికి రోగులను తీసుకొచ్చినా ఆసుపత్రి చీటీలు, స్కానింగ్‌ రిపోర్టులు పరిశీలిస్తున్నారు. రాత్రిపూట నడుపుతున్న ప్రైవేటు బస్సులను మాత్రం పోలీసులు, రవాణా శాఖ అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రిపూట ఆర్టీసీ బస్సు సర్వీసులను సైతం రద్దు చేసిన అధికారులు ప్రైవేటు వాహనాలకు ఎలా అనుమతిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-04T04:51:05+05:30 IST