డీఎస్సీ-1998 నియామకాల్లో అయోమయం

ABN , First Publish Date - 2022-06-27T05:15:32+05:30 IST

డీఎస్సీ-1998 అర్హులైన అభ్యర్థుల ఉద్యోగ నియామకాల విషయంలో అయోమయం నెలకొంది. అర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎవరు అర్హులు, ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారన్న విషయంలో స్పష్టత కరువైంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు జారీకాకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.

డీఎస్సీ-1998 నియామకాల్లో   అయోమయం

ఎంతమందికి ఉద్యోగాలిస్తారో తెలియని పరిస్థితి

ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు 

అభ్యర్థుల్లో టెన్షన్‌ 

డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు 

ఒంగోలు (విద్య) జూన్‌ 26 : డీఎస్సీ-1998 అర్హులైన అభ్యర్థుల ఉద్యోగ నియామకాల విషయంలో అయోమయం నెలకొంది. అర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎవరు అర్హులు, ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారన్న విషయంలో స్పష్టత కరువైంది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు జారీకాకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది.  

నిరుద్యోగుల్లో చిగురించిన ఆశలు

డీఎస్సీ-1998 అభ్యర్థుల సుదీర్ఘ పోరాట ఫలితంగా 25 సంవత్సరాల తర్వాత వీరికి ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులకు అడ్‌హక్‌ పద్ధతిలో మినిమమ్‌ టైం స్కేలు విధానంలో నియమించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో వారు వివరాల కోసం డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగాలకు అర్హులైన వారి జాబితాలో తమ పేరు ఉందో, లేదో తెలుసుకొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం నిరుద్యోగులు డీఈవో కార్యాలయానికి వస్తున్నారు. అక్కడ సరైన సమాచారం తెలియకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. 

అందరికీ ఉద్యోగాలు దక్కేనా

డీఎస్సీ-1998లో అర్హులందరికీ ఉద్యోగాలు దక్కుతాయా అన్న విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4500 మందిని మినిమం టైం స్కేలుతో ఉద్యోగాల్లో నియమించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అయితే ఒక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపిక కాని వారు 1487 మంది ఉన్నారు. అప్పట్లో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పునమెరిట్‌ ప్రాతిపదికన ఇంటర్వ్యూకు పిలిచారు. అభ్యర్థులు సాధించిన మార్కుల అవరోహణ క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టారు. సర్టిఫికెట్ల పరిశీలనకు, ఇంటర్వ్యూలకు హాజరై ఎంపిక కాని వారు 614 మంది ఉన్నారు. తాజాగా ఉద్యోగాల ఎంపికలో వీరిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారా లేక గంపగుత్తగా అర్హులైన అందరికీ ప్రాధాన్యం ఇస్తారా అన్న విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఇంటర్వ్యూలకు హాజరైన వారిని మాత్రమే ఉద్యోగాల ఎంపికకు పరిగణలోకి తీసుకుంటే సుమారు 873 మందికి చాన్స్‌లేనట్లే. దీంతో డీఎస్సీ అభ్యర్థులు టెన్షన్‌ పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి ఎంపికలో విధాన నిర్ణయం ప్రకటించి ఉత్కంఠకు తెరదించాలని  వారు  కోరుతున్నారు. 


Updated Date - 2022-06-27T05:15:32+05:30 IST