టీచర్‌ను దారుణంగా వేధించిన కర్ణాటక విద్యార్థులు

ABN , First Publish Date - 2021-12-11T19:27:21+05:30 IST

టీచర్‌ను దారుణంగా వేధించారు. చెత్త బుట్టను ఆయన

టీచర్‌ను దారుణంగా వేధించిన కర్ణాటక విద్యార్థులు

బెంగళూరు : కర్ణాటకలోని దావణగెరేలో కొందరు విద్యార్థులు తమ టీచర్‌ను దారుణంగా వేధించారు. చెత్త బుట్టను ఆయన తలపై పెట్టి నానా అల్లరి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో విద్యా మంత్రిత్వ శాఖ ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. 


స్థానిక మీడియా కథనం ప్రకారం, దావణగెరే జిల్లా, చన్నగిరి టౌన్‌లోని నల్లూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిసెంబరు 3న ఈ సంఘటన జరిగింది. టీచర్ పాఠం చెప్పడం ప్రారంభించినపుడు కొందరు విద్యార్థులు ఆయన వద్దకు వెళ్ళి, ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఓ విద్యార్థి ఆయన తలపై చెత్తబుట్టను పెట్టాడు. 


ఈ నేపథ్యంలో కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నాగేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. దావణగెరే జిల్లా, చన్నగిరి తాలూకాలోని పాఠశాల విద్యార్థులు తమ టీచర్‌పై దాడి చేయడం సహించరానిదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై విద్యా శాఖ, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తాము ఎల్లప్పుడూ టీచర్లకు మద్దతుగా ఉంటామన్నారు. 


బాధిత టీచర్ మీడియాతో మాట్లాడుతూ, తాను తరగతి గదిలో ప్రవేశించినపుడు గుట్కా ప్యాకెట్ల చెత్త నేలపై ఉండటాన్ని చూశానని, క్రమశిక్షణ పాటించాలని విద్యార్థులకు చెప్పానని తెలిపారు. అనంతరం కొందరు విద్యార్థులు వచ్చి న్యూసెన్స్ చేశారని తెలిపారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 



Updated Date - 2021-12-11T19:27:21+05:30 IST