Advertisement

మంజీరాలో.. ఇసుక జాతర !

Mar 5 2021 @ 23:32PM

బిచ్కుంద, మద్నూర్‌, కుర్ల, పుల్కల్‌, శెట్లూర్‌, బీర్కూర్‌ పరిసర ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా
అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుక తరలింపు
ఒక్కో ట్రాక్టర్‌కు సరిహద్దు గ్రామాల్లో రూ.7వేల నుంచి రూ.8వేలకు విక్రయాలు
ట్రాక్టర్లకు నెంబర్లు తొలగించి మరీ యథేచ్ఛగా ఇసుక దందా
రాత్రివేళల్లో పక్క రాష్ర్టాలు.. జిల్లాలకు తరలుతున్న వైనం
కన్నెత్తి చూడని రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు
 బాన్సువాడ, మార్చి 5: మంజీరా పరిసర ప్రాంతాలు రోజు రోజుకూ ఇసుక ట్రాక్టర్లతో జాతర ను తలపిస్తున్నాయి.  మంజీరాలో ఎక్కడ చూసినా ఇసుక కుప్పలు.. అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం టీఎస్‌ఎండీసీ ద్వారా మంజీరాలో అనుమతులిచ్చినప్పటికీ అక్రమార్కులు లాభార్జనే ధ్యేయంగా అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా ఇసుకను ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. అంతేకాకుండా సంబంధిత అధికా రులతో మిలాఖత్‌ అయి ఇసుకను అక్రమంగా తరలిస్తూ దందాను మూడు పువ్వులు, ఆరు కాయలుగా చేసుకుంటున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన  మద్నూర్‌, జుక్కల్‌, పిట్లం, మండల శివారుల్లోని కంగ్టి, సంగారెడ్డి, కల్హేర్‌, నారాయణఖేడ్‌తో పాటు కర్ణాటక సరి హద్దుల్లోని గ్రామాలకు కూడా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒకవైపు ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఇసుకను ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేందుకు టీఎస్‌ఎండీసీ ద్వారా బిచ్కుంద మండలం ఖత్‌గాం, బీర్కూర్‌ మండలాల్లోని మంజీరా పరివాహక ప్రాంతాల్లో అనుమతులివ్వడం జరిగింది. అయితే, దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఇసుక మాఫియాగా ఏర్పడి రాత్రివేళలో మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్లకు నెంబర్లు సైతం తొలగించి మరీ ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇంత అక్రమ రవాణా జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతే కాకుండా బాన్సువాడ డివిజన్‌లోని బిచ్కుంద మండలం పుల్కల్‌, మద్నూర్‌ మండలం కుర్ల, శెట్లూర్‌, బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌, దామరంచ గ్రామాలు మంజీరాకు ఆనుకుని ఉండటంతో అక్కడి నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా రాత్రివేళలో అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మద్నూర్‌ మండలం కుర్ల మంజీరా పరివాహక ప్రాంతంలో ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా తరలించేందుకు వందల ట్రాక్టర్లు వచ్చి ఉండటంతో మంజీరాలో ఇసుక జాతర కొనసాగుతుందా అన్నట్లు దృశ్యాలు కనిపించాయి. ఎటు చూసినా మంజీరా పరివాహక ప్రాంతాన్ని తవ్వుతూ లక్షల రూపాయల డబ్బులను దండుకుంటున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినా తూతూ మంత్రంగానే పని చేస్తున్నాయనే దానికి నిదర్శనం. ఇదిలా ఉంటే మద్నూర్‌ మండలం కుర్ల మంజీరా నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తూ మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాలకు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.7వేల నుంచి రూ.8వేల వర కు విక్రయిస్తూ అక్రమ లాభార్జనే ధ్యేయంగా అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. అంతేకా కుండా మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకుని వచ్చి మద్నూర్‌, బిచ్కుంద, పిట్లం, జుక్కల్‌ మండల శివారుల్లో ఇసుక డంప్‌లు చేపడుతున్నారు. ఉదయం ఇంటి పనుల నిమిత్తం అంటూ ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నాయి. పెద్దఎత్తున రెవెన్యూ, పోలీసు, ఇసుక మాఫియా మిలాఖత్‌ అయి ఈ దందాను కొనసాగిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నా రు. ఇప్పటికైనా ఈ ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ప్రభుత్వ ఆదాయాని కి గండి పడకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎక్కడెక్కడ ఇసుక కుప్పల నిల్వలున్నాయో వాటిని గుర్తించి పేద ప్రజలకు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Follow Us on:
Advertisement