Prakasam: భర్త ఇచ్చిన మాట తప్పాడని.. భార్యకు ఒట్టు వేసి మరీ ఏం చెప్పాడంటే..

ABN , First Publish Date - 2022-10-07T19:08:26+05:30 IST

ఫేస్‌బుక్‌ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి మధ్య సుమారు ఏడాదికిపైగా ఈ వ్యవహారం నడిచింది. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో..

Prakasam: భర్త ఇచ్చిన మాట తప్పాడని.. భార్యకు ఒట్టు వేసి మరీ ఏం చెప్పాడంటే..

భర్త మాట తప్పాడని.. భార్య ఆత్మహత్య

మందు తాగాడని కలత చెందిన యువతి..

తొలుత ఫేస్‌బుక్‌లో పరిచయం, ఆ తర్వాత ప్రేమ

పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆర్యసమాజ్‌లో వివాహం

ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య


ఫేస్‌బుక్‌ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి మధ్య సుమారు ఏడాదికిపైగా ఈ వ్యవహారం నడిచింది. పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో హైదరాబాదు వెళ్లి ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ యువకుడు స్వంత గ్రామానికి వచ్చారు. అన్యోన్యంగా సాగుతున్న ఆ యువజంట కాపురంలో మద్యం చిచ్చు పెట్టింది. ఇచ్చిన మాటను తప్పాడన్న ఆవేదనలో ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని లింగన్నపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది.


పీసీపల్లి ఏస్సై బి.ప్రేమ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు... మండలంలోని లింగన్నపాలేనికి చెందిన బొమ్ము శివకుమార్‌రెడి, కందుకూరుకు చెందిన పడిదపు శశికళ(19)లకు ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. శివకుమార్‌రెడ్డి తన సోదరి నిర్వహిస్తున్న ఫ్యాన్సీ దుకాణానికి కావలసిన వస్తువులను తెచ్చేందుకు తరచూ కందుకూరు వెళ్లివస్తుండేవాడు. ఆ క్రమంలో వారి ఫేస్‌బుక్‌ పలకరింపులు కాస్తా నేరుగా కలుసుకోవడంతోపాటు చివరకు ప్రేమగా మారింది. సుమారు ఏడాదికిపైగా ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి ఇరువురు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో హైదరాబాదు వెళ్లి ఈ ఏడాది ఆగస్టు 16న ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత లింగన్నపాలేనికి వచ్చారు. కొద్దిరోజుల పాటు వారి కాపురం అన్యోన్యంగా సాగింది. ఇంతలో శివకుమార్‌రెడ్డికి మద్యం సేవించే అలవాటు ఉందని గుర్తించింది. ఆ విషయం తనకు చెప్పకుండా ఎందుకు దాచావని భర్తను నిలదీసింది. ఇంకెప్పుడూ మద్యం సేవించబోనని భార్యకు ఒట్టు వేసి చెప్పాడు.



వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే శివకుమార్‌రెడ్డి ఈ నెల 4న ట్రాక్టర్‌తో పొలం పనులు చేసుకుంటున్నాడు. భర్త పనిచేస్తున్న పొలం వద్ద కు శశికళ వెళ్లింది. అక్కడ అతను మద్యం సేవించి ఉండడాన్ని గుర్తించింది. మాట తప్పి మద్యం సేవిస్తావా అంటూ నిలదీసింది. భర్త ప్రవర్తనతో కలత చెంది ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె వెనకాలే ఇంటికి వచ్చిన శివకుమార్‌రెడ్డి శశికళ ఫ్యానుకు వేలాడుతుండడం గమినించి ఇరుగుపొరుగు వారి సాయంతో కిందకు దించి చికిత్స కోసం కనిగిరి వైద్యశాలకు అక్కడి నుంచి ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శశికళ బుధవారం ఉదయం మృతి చెందింది. పీసీపల్లి తహసీల్దార్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రేమ్‌కుమార్‌లు మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతురాలు తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బి.ప్రేమ్‌కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-10-07T19:08:26+05:30 IST