కనుచూపు మేర.. బీళ్లే...

ABN , First Publish Date - 2022-06-27T05:43:34+05:30 IST

సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ చివరి వారానికి ఎక్కడ చూసినా.. పొలాలు సాగై.. పచ్చగా కనిపించాలి. అయితే అన్నమయ్య జిల్లాలో ఈ ఏడాది కనుచూపు మేర ఎక్కడ చూసినా.. వ్యవసాయ పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.

కనుచూపు మేర.. బీళ్లే...
రైల్వేకోడూరులో చుక్క నీళ్లు లేని వ్యవసాయ భూమి

చుక్కనీరు లేని చెరువులు..

విత్తుపడని పొలాలు

ఆందోళనలో అన్నదాతలు


సాధారణంగా ప్రతి ఏడాది జూన్‌ చివరి వారానికి ఎక్కడ చూసినా.. పొలాలు సాగై.. పచ్చగా కనిపించాలి. అయితే అన్నమయ్య జిల్లాలో ఈ ఏడాది కనుచూపు మేర ఎక్కడ చూసినా.. వ్యవసాయ పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే దశలో ఉన్నప్పటికీ ఏ పల్లెలోనూ.. ఏరువాక హడావుడి కనిపించడం లేదు. ఏరువాకకు కళ తెచ్చే వేరుశనగ సాగు కూడా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఈసారి జిల్లా రైతాంగానికి నిరాశే మిగిలేటట్టుగా ఉంది. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాయచోటి, పీలేరు, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలలో పలు చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు. చెరువులు నీరు లేక నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. చెరువుల గతే ఇట్లుంటే.. బావుల పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం తిమ్మిరెడ్డికుంటలో నీళ్లు లేకపోవడంతో ఆయకట్టు కింద సాగుకు నోచుకోలేదు. రామాపురం మండలంలో పలు చెరువుల్లో చుక్క నీరు కూడా లేదు. గాలివీడు మండలంలో వెలిగల్లు ప్రాజెక్టులో నిండుగా నీళ్లు ఉన్నాయి. 24 వేల వరకు ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు కాలువల్లో పూడిక తీయలేదు. దీంతో ఎకరా కూడా ఆయకట్టు సాగుకు నోచుకోలేదు. పొలాల్లో పిచ్చిమొక్కలు మొలిచాయి. సుండుపల్లె మండలంలో పెద్ద బలిజపల్లెలో రైతులు ఇంకా దుక్కులు కూడా చేయలేదు. వీర బల్లి మండలంలో పలువురు రైతులు వేరుశనగ కోసం దుక్కులు చేశారు. ఇంకా విత్తనాలు భూమిలో వేయలేదు. రైల్వేకోడూరులో చెరువులు, పూర్తిగా ఎండిపోయాయి. బావుల్లో చుక్కనీరు లేదు. వ్యవసాయ భూములు సాగు చేయకపోవడంతో.. ఆ బీళ్లల్లో గొర్రెలు మేపుతున్నారు. రాయచోటి మండలం శిబ్యాల పెద్ద చెరువుకు గత ఏడాది కురిసిన వర్షాలకు గండిపడింది. ఇప్పటి వరకు ఆ గండికి మరమ్మతులు పూర్తి కాలేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు అరకొర నీళ్లు మాత్రమే నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు చాలా చెరువుల్లో నీళ్లు లేక.. ఆయకట్టు కింద సాగు కాలేదు. 


20 శాతం లోపు సాగు..: 

జిల్లాలో ఖరీ్‌ఫలో ప్రాంతంలో ప్రధానమైనది వేరుశనగ పంట. ఇప్పటి వరకు 20 శాతం కూడా సాగు కాలేదు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో ఖరీఫ్‌ సీజను సాదారణ సాగు.. 30,857 హెక్టార్లు కాగా.. ఇప్పటి వరకు 855 హెక్టార్లు మాత్రమే సాగైనట్లు వ్యవసాయ గణాంకాలు చెబుతున్నాయి. జూన్‌తో ప్రారంభమైన సీజన్‌ జూలై 15వ తేదీ వరకు వేరుశనగ సాగు చేసే అవకాశం ఉంది.  కానీ ఈ రోజుకు భూమిలో పడిన విత్తన శాతాన్ని పరిశీలిస్తే.. వ్యవసాయశాఖ గణాంకాలు తలకిందులయ్యాయి. సీజన్‌ ముగియడానికి ఇంకా 20 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అదేవిధంగా చిన్నమండెం మండలంలో ఎక్కువమంది రైతులు ఈసారి వేరుశనగకు బదులుగా టమోటాను సాగు చేయడానికి మక్కువ చూపుతున్నారు. రాయచోటి, సంబేపల్లె, వీరబల్లి, గాలివీడు, రామాపురం మండలాల్లో పలువురు రైతులు వేరుశనగ కోసం దుక్కులు అయితే చేశారు.. కానీ ఇప్పటికీ విత్తనాలు వేయలేదు. ఇటీవల వర్షాలు కురిసిన్పటికీ ప్రస్తుతం విత్తనాలు వేయడానికి అనువైన తేమ భూమిలో లేదని రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో 33,622 క్వింటాళ్ల వేరుశనగ విత్తనకాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. కానీ ఆ స్థాయిలో రైతులు పంట సాగు చేసేట్టు కనిపించడం లేదు. ఈ వారంలోపు వానలు వస్తే.. సాగు పెరిగే అవకాశం ఉంది. వేరుశగన సాగు తగ్గడానికి ప్రధానంగా.. కింది కారణాలు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగానే.. సమయానికి వర్షాలు పడకపోవడం, పంట సాగుకు పెట్టుబడులు ఎక్కువ కావడం.. ప్రభుత్వం అందించే సాయం.. అంతంత మాత్రంగా ఉండడం.. బ్యాంకులు రుణాలను రెన్యువల్‌తో సరిపెట్టుకోవడం.. కారణాల వల్ల వేరుశనగ సాధారణ సాగు తగ్గిందని పలువురు పేర్కొంటున్నారు. ఒకవైపు విత్తనాలు విత్తే సమయం ముగిసిపోతోంది.. ఇంకా పూర్తి స్థాయిలో వర్షాలు పడలేదు. ఒకవేళ సాగు చేసినా... దిగుబడులు బాగా వచ్చి లాభాలు వచ్చే అవకాశాలూ తక్కువే.. ఎటుచూసినా రైతు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది.



Updated Date - 2022-06-27T05:43:34+05:30 IST