ప్రతీకాత్మక చిత్రం
అప్పటివరకూ ఒకరికొకరు తెలీనివారు.. తాళి అనే రెండక్షరాలతో దంపతులుగా మారి, కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం.. ఆదిలోనే విషాద ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు చేసిన తప్పులు.. చివరికి వారి జీవితాలనే సర్వనాశనం చేస్తుంటాయి. తమిళనాడులో ఓ కుటుంబంలో తలెత్తిన సమస్య.. చివరికి విషాదాంతమైంది. ప్రాణంగా చూసుకోవాల్సిన భార్యను.. సోదరుడు, బాలుడితో కలిసి పొలాల్లోకి తీసుకెళ్లాడు. భార్య బతికుండగానే భర్త చేసిన నిర్వాకం.. స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో భర్తను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కేవీ కుప్పం పరిధి వడుగంతంగల్ గ్రామానికి చెందిన వినాయకం, సుప్రజ(23) దంపతులు. వీరు రెండేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి, కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా వేలూరు పరిధిలోని కాట్పాడిలో నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లు వీరి సంసారం అన్యోన్యంగానే సాగింది. అయితే ఈ క్రమంలో వినాయకానికి వేరే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల తర్వాత ఈ విషయం సుప్రజకు తెలిసింది. అప్పటి నుంచి ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. రోజురోజుకూ భార్య ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉండడంతో ఆమెపై వినాయకం కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తన సోదరుడు విజయ్ (21), మరో 17ఏళ్ల బాలుడితో కలిసి కుట్ర పన్నారు. ప్లాన్ ప్రకారం మూడు నెలల క్రితం ఓ రోజు భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు నటించాడు. ఈ క్రమంలో ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఇద్దరితో కలిసి భార్యను నోరు మూసేసి, బలవంతంగా ప్రాణాలతో ఉండగానే గోతిలో వేసి పూడ్చేశారు. తర్వాత సుప్రజ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘‘ సడన్గా మీ కూతురు కనిపించకుండా పోయింది’’.. అని చెప్పాడు. కంగారుపడిన వారు తమకు తెలిసిన ప్రాంతాల్లో ఆమె కోసం వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో భర్త మీదే అనుమానం వ్యక్తమయింది. అతడి వివాహేతర సంబంధం గురించి కూడా చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి అనుమానం బలపడింది. దీంతో వినాయకంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించాడు. దీంతో మంగళవారం వినాయకంతో పాటూ అతడి సోదరుడు, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
ఇవి కూడా చదవండి