గుడిలో..!

ABN , First Publish Date - 2021-02-26T05:18:05+05:30 IST

బద్వేలు పట్టణంలోని 33వ వార్డు బంకపాలెం మండల పరిషత ప్రాథమిక పాఠశాలలో బంకపాలెం, ఎగువపాలెం, దిగువపాలెం విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు 34 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల ప్రధాన భవనాన్ని 1982లో నిర్మించారు. 1999లో మరో తరగతి గదిని కూడా ఈ పాఠశాలకు అనుబంధంగా నిర్మించారు.

గుడిలో..!
ఆలయంలో విద్యాబోధన చేస్తున్న దృశ్యం

కొత్త నిర్మాణం కోసం బడి కూల్చివేత

రెండేళ్లైనా పట్టించుకోని అధికారులు


ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి ‘నాడు - నేడు’ పేరిట వందల కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వ బడులను సుందరీకరణ చేస్తామంటున్నారు. కానీ రెండేళ్లుగా గుడిలో బడి నడుస్తున్నా పట్టించుకునే వారే లేరు. 


బదే ్వలు రూరల్‌, ఫిబ్రవరి 25: బద్వేలు పట్టణంలోని 33వ వార్డు బంకపాలెం మండల పరిషత ప్రాథమిక పాఠశాలలో బంకపాలెం, ఎగువపాలెం, దిగువపాలెం విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు 34 మంది విద్యార్థులున్న ఈ పాఠశాల ప్రధాన భవనాన్ని 1982లో నిర్మించారు. 1999లో మరో తరగతి గదిని కూడా ఈ పాఠశాలకు అనుబంధంగా నిర్మించారు. పాఠశాల ప్రధాన భవనం పైకప్పు శిఽథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతుండడం, వర్షాకాలంలో ఉరుస్తుండడంతో ఇక్కడ కొత్త భవన నిర్మాణం చేపట్టేందుకు పాత భవనాన్ని 2019లో కూల్చివేశారు. రెండేళ్లు గడుస్తున్నా కొత్త భవన నిర్మాణం చేపట్టలేదు. ఉన్న ఒక గది అన్ని తరగతులకు సరిపోకపోవడంతో పక్కనే ఉన్న రామాలయంలో ఉపాధ్యాయులు కొన్ని తరగతుల విద్యార్థులకు విద్యాబోధన మొదలుపెట్టారు. 

దళితవాడలైన ఈ మూడు కాలనీలకు సంబంధించి విద్యార్థులు ఇక్కడే విద్యనభ్యసిస్తుంటారు. వీరు మరో చోటికి పోవాలంటే దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరం వెళ్లాలి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అదే పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్నారు. దళితవాడలోని పాఠశాల సమస్యల్లో ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ పాఠశాలలో తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు పాఠశాల కొత్త భవన నిర్మాణం చేపట్టి ఇక్కడ చదివే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


గుడిలో చదువు ఎన్నాళ్లు..?

- విజయలక్ష్మి, పాఠశాల విద్యార్థుల తల్లి, బంకపాలెం

మా పిల్లలు ఇద్దరినీ ఇదే పాఠశాలలో చదివిస్తున్నా.శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పడగొట్టి రెండు సంవత్సరాలు కావస్తున్నా కొత్త భవనం నిర్మించలేదు. దీంతో పిల్లలందరూ ఆలయంలోనే చదువుకుంటున్నారు. ఇలా గుడిలో ఎన్నాళ్లు చదువుకోవాలి? ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.


ప్రతిపాదనలు పంపాము

- కె.రామచంద్రయ్య, ఎంఈవో, బద్వేలు

మండలంలో శిథిలావస్థలో ఉన్న ఏడు పాఠశాలల భవనాలను 2019వ సంవత్సరంలో  కలెక్టర్‌ ఆదేశాల మేరకు కూల్చివేశాము. వీటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించేందుకు అదే ఏడాది సమగ్ర శిక్ష అభియానకు ప్రతిపాదనలు పంపాము. రెండు వాటికి మాత్రం అనుమతులు వచ్చాయి. మిగిలిన వాటికి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. అనుమతులు రాగానే నిర్మాణాలు చేపడతాం.


=================


చెట్ల కింద..

సంవత్సరాలు గడిచినా సమకూరని అదనపు గదులు

ఇదీ పిట్టిగుంట పాఠశాల దుస్థితి

కాశినాయన, ఫిబ్రవరి 25 : కాశినాయన మండలంలోని పిట్టిగుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలిస్తే పాలకుల మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదనిపిస్తుంది. ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉండడంతో మూతబడే స్థాయి నుంచి 100 మంది విద్యార్థుల స్థాయికి చేరిన ఈ పాఠశాలలో ప్రస్తుతం నల్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 100 మంది విద్యార్థులకు ఉన్నది ఒక్కటే గది. వంటగది ఊసేలేదు. ఉన్న ఒక్క గది కూడా రికార్డులు, పుస్తకాలు, టీవీ, ఇతర బోధనోపకరణాలు ఉంచుకోవడానికి సరిపోయింది. దీంతో గత్యంతరంలేక పక్కనే ఉన్న చింతచెట్లకింద మట్టినేలపై పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. మధ్యాహ్నభోజనం సైతం కటిక నేలపై మట్టిలో, నడిచేదారిలో కూర్చొని తింటున్నారు. 

ప్రస్తుతం ఎండలు ముదరడంతో చెట్లకింద తరగతులు నిర్వహించడం వీలుకావడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే బయట బురద, లోపల తడి అన్నట్లు మారిపోయి తరగతులు నిర్వహించుకోవడం ఇబ్బందిగా ఉందంటున్నారు. ఇటీవల పలుమార్లు అధికారులకు తెలిపినా ఎలాంటి స్పందన లేకపోవడంపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిట్టిగుంట పాఠశాలను ఆదర్శపాఠశాలగా ఎంపికచేశారని, ప్రతి తరగతికి ఒక గది నిర్మిస్తారని అంటున్నారేగాని ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు జరగలేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాదిపదికన పాఠశాలకు అవసరమైన అదనపు గదులు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుచున్నారు.


చదువులు ఎలాసాగుతాయి?

- రాజశేఖర్‌రెడ్డి, పిట్టిగుంట

ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తామంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఆ ఊసే కన్పించడంలేదు. కనీసం విద్యార్థులు కూర్చొని ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం లేదు. ఇలా ఉంటే సర్కారు బడుల్లో చదువులు ఎలా సాగుతాయి


అధికారులకు నివేదికలు పంపాను

- బాలఓబయ్య, ఎంఈవో, కాశినాయన

గదుల కొరత ఉన్నమాట వాస్తవమే. ఈవిషయంపై పలుమార్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలియజేశాను. ఇటీవల డీఈవో శైలజ పాఠశాలకు వచ్చిపోయారు. అదనపు గదులకు కృషిచేస్తామన్నారు. మరోమారు అధికారులతో మాట్లాడి సరిపడా గదుల మంజూరు, మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తాను. 



Updated Date - 2021-02-26T05:18:05+05:30 IST