ఈ ఊరికి ఏమైంది.. భర్తపై అలిగి తాళి తీసేస్తే...!

ABN , First Publish Date - 2022-05-28T06:35:23+05:30 IST

ఈ ఊరికి ఏమైంది.. భర్తపై అలిగి తాళి తీసేస్తే...!

ఈ ఊరికి ఏమైంది.. భర్తపై అలిగి తాళి తీసేస్తే...!
ఎర్రగుడి

  • అరిష్టం పట్టుకుందని జనంలో అపోహ
  • కొందరి మరణంతో ఆవహించిన భయం
  • పోలీసులను కలిసిన గ్రామ పెద్దలు
  • శాస్త్రీయత ఎంత పెరిగినా.. మూఢ నమ్మకం

గుత్తి మండల కేంద్రానికి సుమారు 15 కి.మీ. దూరంలో ఉండే ఆ మారుమూల పల్లె జనానికి ఓ భయం పట్టుకుంది. మూడు నెలలకు ఓ మారు ఎవరో ఒకరు అకారణంగా చనిపోతున్నారట. అదీ.. 23వ తేదీ మరణాలు సంభవిస్తున్నాయట. దీనికంతటికీ ఓ మహిళ అలక కారణమని వారు అనుకుంటున్నారు..! కుటుంబ ఆర్థిక వివాదాల కారణంగా.. ఆ ఊరిలోని ఓ మహిళ భర్తపై అలకబూనారు. ఆయన బతికుండగానే బొట్టు, గాజులు, తాళి తీసేశారు. ఈ కారణంగా ఊరికి అరిష్టం పట్టుకుందని అనుకున్నారు. ఈ మూఢ నమ్మకం, అపోహ.. ఏకంగా ఆ ఊరి జనాన్ని పోలీస్‌ స్టేషన తలుపు తట్టేలా చేసింది. విజ్ఞాన జ్యోతులు వినువీధుల్లోని చీకట్లను తొలగిస్తున్న ఈ రోజుల్లోనూ.. ఓ మహిళ అలక ఆ ఊరిని భయపెట్టడం చర్చనీయాంశమైంది.


గుత్తి రూరల్‌, మే 27: గుత్తి మండలంలోని ఆ ఊరి పేరు (Village) పులేటి ఎర్రగుడి. సుమారు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి. ఆ ఊరిలో గడిచిన తొమ్మిది నెలల్లో ఎనిమిది మంది మరణించారు. వీరిలో చాలామంది యువత. ఊరి జనం చెప్పే వివరాలనుబట్టి, కొందరి మరణాలకు కొవిడ్‌ (Covid), మరికొందరి మరణాలకు హార్ట్‌ స్ట్రోక్‌ (Heart Stroke) కారణంగా కనిపిస్తోంది. కానీ ఆ ఊరి జనం ఈ మరణాలను శాస్త్రీయ కోణంలో చూడలేదు. తమ సందేహాలను వైద్యుల వద్ద నివృత్తి చేసుకోలేదు. పూజలు చేసే ఓ పండితుడిని సంప్రదించారు. తమ ఊరికి ఏదో అరిష్టం పట్టుకుందని, ఉన్నఫలంగా కొందరు చనిపోతున్నారని ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకరి ప్రాణం పోతోందని, 23వ తేదీ వచ్చిందంటే ఎవరికి ఏమౌతుందో అని భయం పట్టుకుందని ఆయనకు వివరించారు. దీంతో ఆ ఊరి పరిస్థితుల గురించి ఆయన ఆరా తీశారు.


పెద్దలు చెప్పినా వినలేదు..

భర్త బతికుండగా అలా చేయడం మంచిది కాదని, సంప్రదాయాన్ని పాటించాలని గ్రామ పెద్దలు ఆమెకు పలుమార్లు సూచించారు. కానీ ఆమె వినుకోలేదు. పైగా, ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది. ఆమె అలా వ్యవహరించడానికి ఆర్థికపరమైన వివాదాలే కారణమని గ్రామస్థులు తెలిపారు. ఆర్థిక వ్యవహారాలలో భర్త తన మాట విననందుకు అలకబూని, ఏకంగా వైధవ్యాన్ని పాటిస్తోందని గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతమంది చెప్పినా వినడం లేదని, పైగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని, దిక్కుతోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించామని గ్రామస్థులు తెలిపారు.


ఆ ఊరికి పోలీసులు..

ఆమె కారణంగా తమ ఊరికి చెడు జరుగుతోందని గ్రామస్థులు గురువారం రాత్రి గుత్తి పోలీస్‌ స్టేషనకు వెళ్లారు. ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఆ లోగా ఆమె తాళి, మెట్టెలు ధరించి, బొట్టు పెట్టుకుని పోలీసులకు దర్శనమిచ్చింది. సమస్య ఏమిటని ఆమెను పోలీసులు ప్రశ్నించారు. ‘నా భర్తతో సమస్య ఉంది. అందుకే..’ అని ఆమె సమాధానమిచ్చింది. ఇకపై అలా చేయొద్దని, ఊరి జనం మాట వినాలని పోలీసులు ఆమెకు సూచించారు. అందుకు ఆమె అంగీకరించింది. ఊరి జనం కూడా సంయమనం పాటించాలని, ఈ విషయమై గొడవలకు దిగొద్దని పోలీసులు చెప్పి వచ్చారు.


అనుమానం.. పెనుభూతం..

గ్రామంలో దేవుడికి అర్పించిన ఓ గోవు ఉంది. ఇంటింటికీ వెళ్లి ధాన్యం, గ్రాసాన్ని ఆహారంగా తీసుకుంటుంది. ఆ ఆవు ఇటీవల ఊరంతా తిరుగుతూ గట్టిగా అరుస్తోందని, అదేమైనా చెడుకు సంకేతమా..? అని అనుమానం వ్యక్తం చేశారు. ఆవుతో ఏ సమస్యా లేదని పండితుడు అన్నారట. ఆ తరువాత అసలు సందేహాన్ని ఆయన ముందుంచారు. తమ ఊరిలో ఓ మహిళ భర్త ఉండగానే సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని, బొట్టు, గాజులు, తాళి తీసేసి తిరుగుతోందని ఆయనకు తెలిపారట. అంతే..! చెడు సంఘటనలకు అదే కారణమని ఆయన చెప్పారని అంటున్నారు.


మూఢ నమ్మకాలు వీడాలి..

ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలి. మూఢనమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. స్మార్ట్‌ ఫోన్ల రూపంలో ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. సైన్స అభివృద్ధి చెంది, చంద్ర మండలానికి మనుషులు వెళుతున్నారు. ఇంతటి ఆధునిక యుగంలోనూ ఎవరి కారణంగానో ఏదో జరుగుతోందని నమ్మడం సరికాదు. ఎవరి వల్లా ఎవరికీ అరిష్టం ఉండదు. మంత్ర తంత్రాల గురించి నమ్మొద్దు. ఏ సమస్య వచ్చినా అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలి. గ్రామాల్లో మూఢనమ్మకాలు పోగొట్టేందుకు మావంతు కృషి చేస్తాం. - వెంకటేశ్వర రెడ్డి, జాతీయ మానవహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి.

Updated Date - 2022-05-28T06:35:23+05:30 IST