మారువేషంతో కారులో..

ABN , First Publish Date - 2022-05-28T08:50:02+05:30 IST

మారువేషంతో కారులో..

మారువేషంతో కారులో..

మేనకాగాంధీకి కోపం ఎందుకు వచ్చింది? కేసీఆర్‌ కన్నీరు ఎందుకు పెట్టారు? ఎన్టీఆర్‌... మారువేషంలో రహస్యంగా ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది? బరిలో నిలిచిన తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రచారం ఎలా సాగింది?


1983 జనవరి 3 ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ. 1982 డిసెంబరు 31వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లాలి. ఆ సీటును సంజయ్‌ విచార్‌ మంచ్‌కు కేటాయించడంతో మేనకాగాంధీ కూడా ఎన్టీఆర్‌తో ప్రచారంలో పాల్గొనాలి. ఆదిలాబాద్‌ నుంచి చెన్నూరు చేరేందుకు గోదావరి దాటాలి. చిన్న నాటుపడవలో ఎన్టీఆర్‌, మేనకాగాంధీ కూర్చున్నారు. ఎన్టీఆర్‌ 16 గంటలు ఆలస్యంగా వచ్చారని మేనకాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అప్పటికే ఎన్టీఆర్‌ జ్వరంతో ఉన్నారు. అయినా... ప్రచారం ఆపలేదు. చెన్నూరులో సభ ముగిసిన తర్వాత  జగిత్యాల చేరుకున్నారు.  అప్పుడు ఎన్టీఆర్‌కు గుడివాడ గుర్తొచ్చింది. అక్కడ ఆయనే అభ్యర్థి. నామినేషన్‌ వేశాక ఒక్కసారైనా వెళ్లలేదు. అక్కడికి వెళ్లి మళ్లీ మూడో తేదీకి తిరుపతి వెళ్లి సభలో పాల్గొని ప్రచారం ముగించాలి. అక్కడా ఆయనే అభ్యర్థి. చైతన్యరథం మీద వెళ్తే గుడివాడ, తిరుపతి కాదు కదా, హైదరాబాద్‌కు కూడా పోలింగ్‌ రోజుకు వెళ్లలేమని అక్కడున్నవారన్నారు. దీంతో ఒక కారును, రహస్యాన్ని కడుపులో దాచుకోగల ఒక డ్రైవరును సిద్ధం చేయాలని జీవన్‌రెడ్డికి చెప్పారు. ఎవరికీ కనిపించకుండా గెస్ట్‌హౌస్‌ వెనుక తలుపు నుంచి బయటికొచ్చి కారు ఎక్కారు.  కారు సిద్ధిపేట సెంటర్‌కు చేరేసరికి తెల్లవారుజామున రెండున్నరైంది. ఎవరో కారును ఆపమని చేతులు ఊపారు. రోడ్డును ఆనుకుని ఒక వేదిక. 200 మంది గుంపుగా ఉన్నారు. కారు ఆపిన మనిషి ‘ఎన్టీఆర్‌ ఎక్కడున్నారో మీకేమైన ఎరుకనా?’ అని డ్రైవర్‌ని అడిగారు.  కారు ఆపిన మనిషి గొంతును ఎన్టీఆర్‌ గుర్తుపట్టారు. ‘చంద్రశేఖర్‌ రావ్‌!’ అని పిలిచారు. ఎన్టీఆర్‌ పిలుపును గుర్తుపట్టారు కేసీఆర్‌. ‘అన్నా మీరొస్తుండ్రని రాత్రి లచ్చమంది పోగైనారు. అయిదారు గంటల ముందుగాలొస్తే గ్యారంటీగా గెలిచేవాణ్ని. అంతా అయిపోయింది’ అని కన్నీళ్ల పర్యంతమయ్యారు. కేసీఆర్‌ను ఎలా ఓదార్చాలో ఎన్టీఆర్‌కు తెలియలేదు. అక్కడి నుంచి బయల్దేరిన ఆయన చివరకు గుడివాడ వెళ్లి...ఆ మర్నాడు విజయవాడ నుంచి తిరుపతికి విమానంలో చేరి, చివరి ప్రచార సభను ముగించారు. 



Updated Date - 2022-05-28T08:50:02+05:30 IST