ఆమంచిపై సీబీఐ కేసులో..మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

ABN , First Publish Date - 2022-07-01T09:01:38+05:30 IST

ఆమంచిపై సీబీఐ కేసులో..మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

ఆమంచిపై సీబీఐ కేసులో..మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

హైకోర్టు స్పష్టీకరణ

అమరావతి, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై దూషణల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయలని కోరుతూ వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. జూలై 20న తన ముందు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెబుతున్న నేపథ్యంలో ఆమంచి పిటిషన్‌పై విచారణను జూలై 15కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్య గురువారం ఆదేశాలిచ్చారు. వివిధ అంశాలకు సంబంధించి తీర్పుల వెల్లడి అనంతరం న్యాయవ్యవస్థ పట్ల, హైకోర్టు న్యాయమూర్తుల పట్ల సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని 2020 అక్టోబరు 12న సీబీఐని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల ఆధారంగా పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అందులో ఆమంచి కృష్ణమోహన్‌ను 21వ నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో విచారణకు రావాలని సీఆర్పీసీ సెక్షన్‌ 41ఏ కింద ఆయనకు ఇటీవల నోటీసులు జారీ చేసింది. అయితే ముందే నిర్ణయింకున్న కార్యక్రమాలు ఉన్నందున సమయం ఇవ్వాలని సీబీఐని కోరారు. దీంతో జూలై 20న రావాలని దర్యాప్తు సంస్థ తాజాగా నోటీసులు ఇచ్చింది. దీంతో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేయాలని కోరుతూ ఆమంచి  హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్‌ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను దూషించడం కిందకు రావని, కోర్టు ఇచ్చిన తీర్పులనే విమర్శించారని తెలిపారు. అయితే కేసు దర్యాప్తు సాగుతోందని.. సీబీఐ నోటీసులకు జవాబిస్తే తప్పేంటని హైకోర్టు తరఫు స్టాండింగ్‌ కౌన్సెల్‌ ఎన్‌. అశ్వనీకుమార్‌ ప్రశ్నించారు. ఈ దశలో స్టే ఇవ్వొద్దని కోరారు.



Updated Date - 2022-07-01T09:01:38+05:30 IST