ఆపన్న హస్తాలేవీ..?

ABN , First Publish Date - 2021-06-13T05:46:31+05:30 IST

గత ఏడాది కరోనా మహమ్మారి తొలిసారి దేశంలో ప్రవేశించింది. అప్పుడే దేశవ్యాప్తంగా లాక్‌డౌన విధించారు. ఆ సమయంలో సామాన్యులు తిండికి కూడా అవస్థలు పడ్డారు. అప్పట్లో కరోనా ప్రమాదమని తెలిసినా

ఆపన్న హస్తాలేవీ..?
కరోనా లాక్‌డౌన సమయంలో కడప నగరం అక్కాయపల్లెలో గత ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీన పేదలకు సరుకులు పంపిణీ చేస్తున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సురేష్‌బాబు తదితరులు (ఫైల్‌ఫొటో)

కరోనా తొలివేవ్‌లో వారియర్స్‌గా జనం మధ్యనే ప్రజాప్రతినిధులు

పేదలకు అన్నదానాలు.. నిత్యావసర వస్తువులు పంపిణీ

స్వచ్చంధంగా ముందుకు వచ్చిన పలువురు

రెండో దశలో మొక్కుబడి చర్యలు.. ఇబ్బంది పడ్డ సామాన్యులు

కడప, జూన 12 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది కరోనా మహమ్మారి తొలిసారి దేశంలో ప్రవేశించింది. అప్పుడే దేశవ్యాప్తంగా లాక్‌డౌన విధించారు. ఆ సమయంలో సామాన్యులు తిండికి కూడా అవస్థలు పడ్డారు. అప్పట్లో కరోనా ప్రమాదమని తెలిసినా ప్రజాప్రతినిధులు జనం మధ్య తిరుగుతూ మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. పోటీపడి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అప్పటికే మున్సిపల్‌, కార్పొరేషన, మండల పరిషత, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో బహుశా వాటిలో పోటీ చేసేందుకోసమేమో నేతలు పోటీలు పడి వారియర్స్‌లా పనిచేశారు. ఇక అధికారులు కూడా కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పాజిటివ్‌ వచ్చిన వెంటనే ఐసోలేషనలో చేర్చి చికిత్స చేయడం, వారి కాంటాక్టు కేసులు గుర్తించి క్వారంటైనలో ఉంచడం లాంటివి చేశారు. అందరికీ భోజన వసతి కల్పించారు. అప్పట్లో ప్రతి ఒక్కరూ కరోనా కట్టడిపైనే దృష్టి పెట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేశారు. ఇప్పుడు.. కరోనా సెకండ్‌వేవ్‌ జిల్లాపై తీవ్రంగా దాడి చేసింది. రోజుకు రెండువేలదాకా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పనుల్లేక సామాన్య జనం అల్లాడుతున్నారు. అయినా ఇప్పుడు గత ఏడాదిలా సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావడం లేదు. అధికారుల్లో సైతం అప్పటి ప్రణాళిక ఆ దూకుడు ఇప్పుడు లేదని విమర్శలున్నాయి.


నియోజకవర్గాల వారీగా తొలివేవ్‌, సెకండ్‌వేవ్‌లలో పరిశీలిస్తే..

- కడప కార్పొరేషనలో గత ఏడాది లాక్‌డౌన సమయంలో మేమున్నామంటూ పలువురు ముందుకువచ్చారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా సోదరుడు అహ్మద్‌, కార్పొరేషన ఆధ్వర్యంలో పేదలకు భోజనం అందించారు. ఇక డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ప్రస్తుత మేయరు సురే్‌షబాబు, డివిజన ఇనచార్జిలు ఒక్కో డివిజనలో 500 నుంచి 1000 మంది పేదలకు ఒక్కొక్కరికి 13 రకాల నిత్యావసర వస్తువులను అందించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీ నేతలు గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్‌, అమీర్‌బాబు కూడా పేదలు, పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. స్వచ్ఛంద సంస్థలు, బీసీ సంఘాలు, సంఘ సేవకులు, ఆర్యవైశ్య సంఘాలు కొందరికి నిత్యావసర వస్తువులు అందించగా, మరికొందరికి భోజన వసతి కల్పించారు. ఎస్పీ అన్బురాజన ఆధ్వర్యంలో లాక్‌డౌనలో నిలిచిన లారీ డ్రైవర్లు, నిరుద్యోగులకు సాయమందించారు. భోజనం అవసరమని ఫోను చేస్తే వారికి వెంటనే ఏర్పాటు చేశారు. పాత్రికేయులకు కలెక్టరు, ఎస్పీలు కూడా నిత్యావసర వస్తువులు అందించారు. బ్యాంకులు, పలు సంస్థలు సహాయం చేశాయి. సెకండ్‌వేవ్‌లో ఆ పరిస్థితి చాలా మటుకు కనిపించడంలేదు. అప్పట్లో సాయం చేసిన చాలా చేతులు ఇప్పుడు ముందుకు రావడంలేదు. కడప అసెంబ్లీ టీడీపీ ఇనచార్జి అమీర్‌బాబు 24రోజులుగా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి 20 రోజులుగా రిమ్స్‌లో అన్నదానం చేస్తున్నారు. కొన్ని సంస్థలు నిత్యావసర వస్త్తువులు అందించగా, మరికొన్ని భోజన ఏర్పాట్లు కల్పిస్తున్నాయి. ఎస్పీ ఈ పర్యాయం కూడా పాత్రికేయులు మెడికల్‌ కిట్లు అందజేశారు.

- కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి ఆధ్వర్యంలో అప్పట్లో అన్ని మండలాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించగా, బ్రాహ్మణ ఫ్రంట్‌ పర్యవేక్షణ సమితి అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్రకార్యదర్శి సాయినాధ్‌శర్మ 46 రోజుల పాటు కమలాపురం, వల్లూరు, పెండ్లిమర్రి, వీఎనపల్లెల్లో రోజూ కూలీలు, వలస కార్మికులు, పేదలకు ఆహార పొట్లాలు అందించారు. అయితే అధికారులు వత్తిడి చేయడంతో మధ్యలో నిలిపివేశారు. సెకండ్‌వేవ్‌లో ఇప్పటిదాకా 1,055 మందికి కరోనా పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన సిలిండర్లు అందించారు. 74 సిలిండర్లు, 4 కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచారు. ఆక్సిజన కోసం ఎవరైనా ఫోను చేస్తే వెంటనే సిలిండర్లు పంపిస్తున్నారు. పేద బ్రాహ్మణులు, పూజారులు, హిజ్రాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మిగతా వారు ఆ పరిస్థితి లేదు. 

- ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి గత ఏడాది పాత్రికేయులకు రూ.5వేలు నగదు, బియ్యం పంపిణీ చేశారు. ముస్లిం, క్రిష్టియన్లను కానుక అందించారు. వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేయనున్న వారు కూరగాయలు పంపణీ చేశారు. టీడీపీ నుంచి ముక్తియార్‌, నాగరాజు ఆయా డివిజన్లలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సారి ఆ పరిస్థితి లేదు. కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిన నరేంద్ర మాత్రం 22 రోజులుగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. 

- జమ్మలమడుగు నియోజకవర్గంలో అప్పట్లో ఎంపీ అవినా్‌షరెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ముద్దనూరులో వైసీపీ నాయకులు కోళ్లు పంపిణీ చేశారు. బీజేపీ నేత మధుసూధనరెడ్డి ఇంటింటికీ కోడిని, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సారి బీజేపీ నేతలు రంజానతోఫా, కూరగాయలు అందజేశారు. మైదుకూరులో గత ఏడాది ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సారి ఆ పరిస్థితి లేదు.

- రాయచోటిలో రోటరీ క్లబ్‌, లయన్స క్లబ్‌తో పాటు ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి, టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, రమే్‌షరెడ్డి, ప్రసాద్‌ పలువురు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వలస కార్మికులకు భోజనమందించారు. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీకాంతరెడ్డి, ప్రసాద్‌బాబు వేర్వేరుగా అన్నదానం చేస్తున్నారు.

- పులివెందులలో గత ఏడాది ఎంపీ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కోడిగుడ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సారిలేదు.

- రాజంపేటలో గత ఏడాది ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్‌నాధరెడ్డి, మురళి అన్నదానం చేశారు. ఈసారి ఎమ్మెల్యే మేడా రూ.50 లక్షలు వెచ్చించి తన కళ్యాణమండపాన్ని కోవిడ్‌ కేర్‌ సెంటరుగా మార్చారు. చనిపోయిన కుటుంబాలకు రూ.10వేలు ఆర్థికసాయం అందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అమర్‌నాధరెడ్డి కరోనాపై అవగాహన కల్పించేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. కేర్‌ సెంటరులో ఉన్న వారికి బకెట్‌, శానిటైజర్లు తదితరాలు అందించారు. ఆకేపాటి మురళి బియ్యం,  కూరగాయాలు అందించారు. 

- రైల్వేకోడూరులో గ్రేసీ హ్యాండ్స్‌, హెల్పింగ్‌ హ్యాండ్స్‌ మరికొన్ని సంస్థలు గతంలో యాచకులకు, కార్మికులకు భోజనం అందించాయి. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులు, శానిటైజర్లు అందించారు. జనసేన, కాంగ్రెస్‌ నేతలు సహాయం అందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాపు కార్పొరేషన డైరెక్టరు నాగేంద్ర, వైసీపీ పట్టణ కన్వీనరు మహేంద్ర కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

- బద్వేలులో టీడీపీ నేత నరసింహనాయుడు, పలువురు నిత్యాసవర వస్తువులు పంపిణీ చేశారు. పోరుమామిళ్లలో చిత్తా విజయప్రతా్‌పరెడ్డి, యనమల సుధాకర్‌ నిత్యావసర వస్తువులు అందించారు. ఇప్పుడు కూడా పోరుమామిళ్లలో వీరిద్దరూ మాస్కులు, శానిటైజర్లు పంపిణీచేశారు.



Updated Date - 2021-06-13T05:46:31+05:30 IST