కరకరలాడే స్నాక్స్‌

ABN , First Publish Date - 2021-02-27T09:12:16+05:30 IST

సాయంత్రం వేళ జిహ్యచాపల్యాన్ని తీర్చే స్నాక్స్‌ తినాలనిపించడం సాధారణమే. అలాంటప్పుడు పోహా కట్‌లెట్స్‌, మూంగ్‌ దాల్‌ ఛాట్‌, కొత్తిమీర వడలు, రైస్‌ బాల్స్‌ను రుచి

కరకరలాడే స్నాక్స్‌

సాయంత్రం వేళ జిహ్యచాపల్యాన్ని తీర్చే స్నాక్స్‌ తినాలనిపించడం సాధారణమే. 

అలాంటప్పుడు  పోహా కట్‌లెట్స్‌, మూంగ్‌ దాల్‌ ఛాట్‌, కొత్తిమీర వడలు, రైస్‌ బాల్స్‌ను రుచి చూడండి.  క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ స్నాక్స్‌ తయారీ విధానం ఇది...


కొత్తిమీర వడలు

కావలసినవి

కొత్తిమీర - మూడు కట్టలు, సెనగపిండి - ఒకకప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - ఒకటి, ధనియాల పొడి - అర టీస్పూన్‌, జీలకర్రపొడి - అర టీస్పూన్‌, నువ్వులు - ఒక టీస్పూన్‌, గరంమసాలా - పావు టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, నీళ్లు - పావు కప్పు, నూనె - సరిపడా.


తయారీ విధానం

ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి తరిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. 

తరువాత అందులో సెనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, నువ్వులు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి, అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపాలి.

మెత్తటి మిశ్రమంగా తయారుకావడం కోసం అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. 

ఇప్పుడు అర చేతుల్లో కొద్దిగా నూనె రాసుకుని ప్లేట్‌లో సమంగా పరిచి 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

చల్లారిన తరువాత స్లైస్‌లుగా కట్‌ చేసుకోవాలి. 

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక వాటిని వేసి వేగించాలి. 

అంతే... కరకరలాడే కొత్తిమీర వడలు రెడీ.


రైస్‌ బాల్స్‌

కావలసినవి

అన్నం - ఒక కప్పు, ఉల్లిపాయ - ఒకటి, కొబ్బరి తురుము - అరకప్పు, పాలకూర - ఒక కట్ట, బియ్యప్పిండి - అరకప్పు, అల్లం పేస్టు - ఒక టీస్పూన్‌, పచ్చిమిర్చి పేస్టు - ఒక టీస్పూన్‌, పంచదార - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం

ఒక పాత్రలో అన్నం తీసుకుని అందులో తరిగిన ఉల్లిపాయ, పాలకూర, కొబ్బరి తురుము, బియ్యప్పిండి, అల్లంపేస్టు, పచ్చిమిర్చి పేస్టు, పంచదార, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. 

ఇప్పుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్‌లా చేసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు డీప్‌ ఫ్రై చేసుకోవాలి. 

 కెచ్‌పతో తింటే ఈ రైస్‌ బాల్స్‌ రుచిగా ఉంటాయి.


పోహా కట్‌లెట్స్‌

కావలసినవి

అటుకులు - ఒకకప్పు, బంగాళదుంపలు - రెండు, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, మామిడికాయ పొడి - పావు టీస్పూన్‌, ఛాట్‌ మసాల - అర టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్టు - అర టీస్పూన్‌, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, బ్రెడ్‌క్రంబ్స్‌ - ఒకకప్పు, మైదా - ఒక టేబుల్‌స్పూన్‌.


తయారీ విధానం

బంగాళదుంపలను ఉడికించి, మెత్తటి గుజ్జుగా చేసి పెట్టుకోవాలి.

అటుకులను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో బంగాళదుంపల గుజ్జు వేయాలి. 

తరువాత పసుపు, కారం, గరంమసాలా, మామిడికాయ పొడి, ఛాట్‌మసాలా, అల్లంవెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్‌, కొత్తిమీర వేసి, తగినంత ఉప్పు వేసి మెత్తటి మిశ్రమంలా కలపాలి.

మరొక పాత్రలో మైదా పిండి తీసుకుని అందులో కొద్దిగా కార్న్‌ఫ్లోర్‌ వేసి తగినన్ని నీళ్లు పోసి పలుచగా కలపాలి. 

చేతులకు నూనె రాసుకుని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ వడల్లా ఒత్తుకుంటూ మైదా మిశ్రమంలో ముంచి, బ్రెడ్‌క్రంబ్స్‌ అద్దాలి. 

స్టవ్‌పై పాన్‌పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.

టొమాటో సాస్‌తో పోహా కట్‌లెట్స్‌ను వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.



మూంగ్‌ దాల్‌ ఛాట్‌

కావలసినవి

పెసరపప్పు - అరకప్పు, క్యారెట్‌ తురుము - అరకప్పు, దానిమ్మ గింజలు - అరకప్పు, ఉల్లిపాయలు తరిగినవి - అరకప్పు, పుదీనా - ఒకకట్ట, కొత్తిమీర - ఒకకట్ట, పచ్చిమిర్చి - రెండు, ఛాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - నాలుగు టీస్పూన్లు. 


తయారీ విధానం

పెసరపప్పును శుభ్రంగా కడిగి మూడు కప్పుల నీళ్లు పోసి, కాస్త ఉప్పు వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. 

బాగా మెత్తగా కాకుండా కాస్త ఉడికిన తరువాత నీళ్లను వంపేసి పప్పును ఒక పాత్రలోకి తీసుకోవాలి. 

అందులో క్యారెట్‌ తురుము, దానిమ్మ గింజలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఛాట్‌ మసాలా, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.

సాయంత్రం వేళ స్నాక్స్‌గా ఈ ఛాట్‌ బాగుంటుంది.


ఓట్స్‌ చిల్లా

కావలసినవి

ఓట్స్‌ - ఒకకప్పు, బొంబాయి రవ్వ - రెండు టేబుల్‌స్పూన్లు, పెరుగు - పావు కప్పు, నీళ్లు - ఒక కప్పు, పసుపు - పావు టీస్పూన్‌, అల్లం పేస్టు - అర టీస్పూన్‌, పచ్చిమిర్చి - రెండు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, టొమాటో - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ విధానం

ముందుగా ఒట్స్‌ను క్రిస్ప్‌గా అయ్యే వరకు వేగించాలి. అవి చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. 

ఈ పొడిని ఒక పాత్రలోకి తీసుకుని అందులో రవ్వ, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి.

తరువాత పసుపు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి చిక్కటి మిశ్రమంలా ఉండేలా కలపాలి.

ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త మందంగా దోశలా పోయాలి.

మూతపెట్టి నిమిషం పాటు ఉంచుకోవాలి. తరువాత చిల్లాను తిప్పి మరికాసేపు వేగించాలి.

గ్రీన్‌ చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-02-27T09:12:16+05:30 IST