
- 2026 నాటికి 1.2 కోట్ల ఉద్యోగాలు
- టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: వచ్చే నాలుగేళ్లలో దేశంలో ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు రంగాల్లో 2026 నాటికి ఎంత లేదన్నా కొత్తగా 1.2 కోట్ల ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ మూడు రంగాల్లో 4.2 కోట్ల మంది పని చేస్తున్నారు. ఈ మూడు రంగాలకు చెందిన దాదాపు 750 కంపెనీల ప్రముఖులతో మాట్లాడి టీమ్‌లీజ్ ఈ నివేదిక విడుదల చేసింది. డిజిటైజేషన్‌తో పాటు సరికొత్త సాంకేతిక మార్పులు, ఆర్థిక వ్యవస్థ గాడినపడడం ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక పేర్కొంది. వచ్చే నాలుగేళ్లలో ఈ మూడు రంగాల్లో ఏర్పడే మొత్తం ఉద్యోగాల్లో 17 శాతం ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన వృత్తి నిపుణులకు చెందినవని తెలిపింది.
వినూత్న మార్పులు: ఇటీవల ఇంజనీరంగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల్లో చోటు చేసుకుంటున్న వినూత్న మార్పులనూ టీమ్‌లీజ్ నివేదిక ప్రస్తావించింది. ఈ మూడు రంగాల్లో ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)తో పాటు పీఎల్ఐ పథకంతో ఈ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ మూడు రంగాల్లో 45.65 లక్షల మంది ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల అవసరం ఉంటే.. 2026 నాటికి ఇది 90 లక్షలకు చేరుతుందని టీమ్‌లీజ్ అంచనా వేసింది.
పెరగనున్న కాంట్రాక్టు కొలువులు: ఈ మూడు రంగాల్లో ఉద్యోగాలతో పాటు ఉద్యోగాల స్వరూపమూ మారిపోతోంది. ప్రస్తుతం ఈ రంగాల్లో పని చేసే ఉద్యోగుల్లో 16 శాతం మంది కాంట్రాక్టు ఉద్యోగులు. 2026 నాటికి వీరి సంఖ్య 24 శాతానికి చేరుతుందని టీమ్‌లీజ్ అంచనా వేసింది. కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఒకేసారి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కంపెనీల్లో పని చేసే గిగ్ ఉద్యోగుల శాతమూ 2026 నాటికి 17 శాతానికి చేరుతుందని టీమ్‌లీజ్ అంచనా.