తండ్రి పేరు మీద రూ.40 లక్షల ఇన్సూరెన్స్.. చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరణ.. కానీ ఒకే ఒక్క తప్పుతో సీన్ రివర్స్..!

ABN , First Publish Date - 2021-12-27T18:15:03+05:30 IST

అతడు తన తండ్రి పేరు మీద నాలుగు నెలల క్రితం నాలుగు బ్యాంకుల్లో రూ.40 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు..

తండ్రి పేరు మీద రూ.40 లక్షల ఇన్సూరెన్స్.. చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరణ.. కానీ ఒకే ఒక్క తప్పుతో సీన్ రివర్స్..!

అతడు తన తండ్రి పేరు మీద నాలుగు నెలల క్రితం నాలుగు బ్యాంకుల్లో రూ.40 లక్షలకు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు.. అనంతరం తండ్రిని చంపేందుకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడుకున్నాడు.. ఈ నెల 24న తన తండ్రిని బయటకు తీసుకెళ్లి చంపించాడు.. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశాడు.. అయితే ఆ మృతదేహం కంటే ముందే వీరు ముగ్గురూ పోలీసులకు దొరికిపోయారు.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


భరత్‌పూర్‌కు చెందిన రాజేష్ నాలుగు నెలల క్రితం తన తండ్రి మోకా సింగ్ పేరిట నాలుగు బ్యాంకుల్లో రూ.40 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ డబ్బు కోసం తన తండ్రిని అంతమొందించాలనుకున్నాడు. ఈ నెల 24 సాయంత్రం తన తండ్రిని తీసుకుని బయటకు వెళ్లాడు. అప్పటికే అతను హత్య కోసం ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడుకున్నాడు. వారు రూ.500 పెట్టి ఓ సుత్తి కొన్నారు. మోకా సింగ్‌ తలపై దానితో మోది చంపేశారు. అనంతరం అతని మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్టు చిత్రీకరించారు. 


సుత్తి పట్టుకుని అర్ధరాత్రి సమయంలో ముగ్గురూ నడుచుకుంటూ వెళ్లడాన్ని కొందరు వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి వీరు హత్య చేసినట్టు పోలీసులకు తెలియదు. తర్వాతి రోజు ఉదయం మోకా సింగ్ మృతదేహం బయటపడింది. అతని కొడుకు రాజేష్ తమ అదుపులోనే ఉన్నట్టు పోలీసులకు తెలియడంతో చిక్కుముడి వీడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని హత్య చేసినట్టు రాజేష్ అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురినీ జైలుకు తరలించారు.   

Updated Date - 2021-12-27T18:15:03+05:30 IST