బాలికలు భేష్‌

ABN , First Publish Date - 2022-06-29T16:09:22+05:30 IST

ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. వరుసగా రెండో ఏడాది మెరుగైన ఉత్తీర్ణత సాధించి విజయకేతనం ఎగురవేశారు.

బాలికలు భేష్‌

 ఇంటర్‌ ఫలితాల్లో పైచేయి..  

 రాష్ట్రంలో మేడ్చల్‌ ముందంజ

 వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో..

 పదో స్థానంలో హైదరాబాద్‌ 


హైదరాబాద్‌ సిటీ: ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల్లో అమ్మాయిలు సత్తాచాటారు. వరుసగా రెండో ఏడాది మెరుగైన ఉత్తీర్ణత సాధించి విజయకేతనం ఎగురవేశారు. కరోనా తర్వాత జరిగిన పరీక్షల్లో తమదైన ప్రతిభను చాటారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌ జిల్లాలో ఇంటర్‌ ఫస్టియర్‌ జనరల్‌ విభాగంలో మొత్తం 77,369 మంది పరీక్షకు హాజరుకాగా, 47,845 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలు 27,545 మంది, అబ్బాయిలు 20,300 మంది పాస్‌ అయ్యారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 52,867 మంది పరీక్షకు హాజరుకాగా, 40,703 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలు 19,689 మంది, 21,014 మంది అబ్బాయిలున్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 56,359 మంది హాజరుకాగా, 41,056 మంది పాసయ్యారు. ఇందులో 21,100 మంది అమ్మాయిలుండగా, 19,956 మంది అబ్బాయిలున్నారు. హైదరాబాద్‌ జిల్లాలో ఒకేషనల్‌ ఫస్టియర్‌లో 4,527 మంది పరీక్షకు హాజరుకాగా, 2,361 మంది పాసయ్యారు. మేడ్చల్‌లో 1,051 మంది హాజరుకాగా, 580 పాసయ్యారు. రంగారెడ్డిలో 3,327 మంది హాజరుకాగా, 1,590 మంది ఉత్తీర్ణత సాధించారు. 


సెకండియర్‌లో ..

హైదరాబాద్‌ జిల్లాలో సెకండియర్‌లో మొత్తం 65,868 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 42,170 మంది పాసయ్యారు. ఇందులో 23,897 మంది అమ్మాయిలుండగా 18,273 మంది అబ్బాయిలున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 48,821 మంది పరీక్షకు హాజరుకాగా, 38,450 మంది పాసయ్యారు. ఇందులో అబ్బాయిలు 19,213 మంది, అమ్మాయిలు 19,237 మంది పాసయ్యారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 52,265 మంది పరీక్షకు హాజరుకాగా, 39,410 మంది పాసయ్యారు. ఇందులో అబ్బాయిలు 19,703 మంది ఉండగా, అమ్మాయిలు 19,707 ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాలో సెకండియర్‌ ఒకేషనల్‌లో 3,490 హాజరుకాగా, 2,093 మంది పాసయ్యారు. మేడ్చల్‌లో 939 మందిలో 615 మంది, రంగారెడ్డిలో 2,749 మందిలో 1,621 మంది ఉత్తీర్ణత పొందారు.


సత్తా చాటిన మేడ్చల్‌ 

ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో గ్రేటర్‌ పరిధిలోని మేడ్చల్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. కాగా, హైదరాబాద్‌ జిల్లా రెండింటిలోనూ వెనకబడి రాష్ట్రంలో 10వ స్థానానికి పరిమితమైంది. కాగా, 2020-21 ఫలితాల్లో కూడా మేడ్చల్‌ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం. అయితే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో ప్రభుత్వ కళాశాలలకు చెందిన వారు పెద్ద మొత్తంలో ఫెయిల్‌ అయినట్లు తెలిసింది. సర్కారు కాలేజీల్లో అధ్యాపకుల కొరతతోపాటు తగిన సౌకర్యాలు లేకపోవడంతోనే ఏటా ఉత్తీర్ణత శాతం తగ్గుతోందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-29T16:09:22+05:30 IST