కీలక కేసుల దర్యాప్తులో.. వీడియో రికార్డింగ్‌ తప్పనిసరి

ABN , First Publish Date - 2022-05-21T08:21:28+05:30 IST

అసాధారణ, సంచలన కేసుల దర్యాప్తు విషయంలో పోలీసులు దర్యాప్తు తీరును మెరుపరుచుకోవాలని దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై నియమించిన సిర్పూర్కర్‌ కమిటీ స్పష్టం చేసింది.

కీలక కేసుల దర్యాప్తులో.. వీడియో రికార్డింగ్‌ తప్పనిసరి

పోలీసులు బాడీవోర్న్‌ కెమెరాలు వాడాలి

ఆధారాల విషయంలో తాత్సారం వద్దు

జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుటే రిమాండ్‌ 

సాక్ష్యుల వాంగ్మూలాన్ని వీడియో తీయాలి

నిందితులను అదుపులోకి తీసుకుంటే.. అరెస్టు చేసినట్లే

రిపోర్టులో సిర్పుర్కర్‌ కమిషన్‌ సూచనలు


న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): అసాధారణ, సంచలన కేసుల దర్యాప్తు విషయంలో పోలీసులు దర్యాప్తు తీరును మెరుపరుచుకోవాలని దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై నియమించిన సిర్పూర్కర్‌ కమిటీ స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టుకు సమర్పించిన 383 పేజీల నివేదికలో.. పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు సంబంధించిన నేరాల విషయంలో పరిధి పేరుతో పోలీసులు గిరిగీసుకుని కూర్చోకుండా.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాలని అభిప్రాయపడింది. ఆధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలం, సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ వంటి కీలక అంకాలను వీడియో రికార్డింగ్‌ చేయాలని సూచించింది. అసాధారణ కేసుల్లో నిందితులను ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట కాకుండా.. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాలని స్పష్టం చేసింది. కమిషన్‌ సూచనలు.. సిఫార్సులు ఇలా ఉన్నాయి..

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి.. బాధితులు ఏ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లినా(నేరం పరిధి వేరైనా) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు మాన్యువల్‌లోని ఆర్డర్‌ నంబర్‌ 409(3) చెబుతోంది. ఆ తర్వాత సంబంధిత పోలీ్‌సస్టేషన్‌కు కేసు నమోదు చేయాలి. కానీ, ఈ ఆర్డర్‌ ప్రకారం తొలుత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయడానికి వీల్లేదు. ఈ ఆర్డర్‌ను దిశ కేసులో అమలు చేయలేదు. అయితే.. తమ పరిధి కాకున్నా.. తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు కూడా ప్రారంభించేలా 409(3)లో మార్పులు జరగాలి. 


పోలీసు పరిభాషలో ఒక వ్యక్తిని అదుపులోకి(నిర్బంధంలోకి) తీసుకోవడానికి, అరెస్టుకు మధ్య వ్యత్యాసం లేదు. అరెస్టు, నిర్బంధం వేర్వేరు కాదు. అందుకే.. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా భావించాలి.

ఒక వ్యక్తికి అరెస్టు నోటీసు పంపడం మొదలు.. అరెస్టు, నేరస్థలం పరిశీలన, నేరస్థలిలో ఫోరెన్సిక్‌ ఆధారాలు, నేరానికి వినియోగించిన ఆయుధాలు/వస్తువులు/ఇతర ఆధారాల సేకరణ వంటి అన్ని అంశాలను వీడియో రికార్డింగ్‌ చేయాలి. ప్రతి అంశాన్ని డాక్యుమెంట్‌ చేయాలి.

నేర స్థలిలో దర్యాప్తు, సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో సిబ్బంది బాడీవోర్న్‌(చొక్కాకు తగిలించుకునే) కెమెరాలతో లైవ్‌ రికార్డ్‌ చేయాలి. నిందితులను నేరస్థలికి తరలించే పోలీసు వాహనాలకు కూడా ఇలాంటి కెమెరాలను అమర్చాలి.

అన్ని నేరాలకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని సేకరించడాన్ని తప్పనిసరి చేయాలి.

సీఆర్పీసీ సెక్షన్లు  161, 164, 176(1-ఎ) ప్రకారం సాక్ష్యులను విచారించే సమయంలో.. వారి వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డుల్లో పొందుపరచాలి.

ఆధారాలను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(ఎ్‌ఫఎ్‌సఎల్‌)కు తరలించడం.. అక్కడ జరిపే విశ్లేషణ.. ఆయా నివేదికలు, ఆధారాలను తిరిగి దర్యాప్తు అధికారులకు లేదా కోర్టుకు అప్పగించడం.. ఈ ప్రక్రియ మొత్తం రికార్డుగా నమోదు చేయాలి. ఇందుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు రావాలి.

రిమాండ్‌ విషయంలో.. నిందితులను కోర్టు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందు కాకుండా.. ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచే విధానాన్ని మానుకోవాలి. కనీసం సంచలన/అసాధారణ కేసుల విషయంలో ఒకవేళ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిస్తే.. సంబంధిత జడ్జి అనుభవం, చట్టం పట్ల పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు పిటిషన్‌ వేసే ప్రతీసారి.. న్యాయమూర్తి జైలులో ఉన్న నిందితులను కోర్టుకు పిలిపించాలి. ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలి.

జైళ్లలో ఉండే నిందితులకు పోలీసులు పంపే నోటీసులను పరిగణనలోకి తీసుకోకూడదు. విచారణ తదుపరి వాయిదాలోపు కొత్త నోటీసు పంపాలి. 

పోలీసు కస్టడీలో నిందితులు చనిపోతే(కస్టోడియల్‌ డెత్‌).. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ మాత్రమే విచారణ జరపాలి. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించాలి. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ వచ్చేదాకా మృతదేహాన్ని, నేరం జరిగిన ప్రదేశాన్ని ఎవరూ తాకకూడదు. జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌, సెషన్స్‌ జడ్జిల దృష్టికి తీసుకెళ్లాలి. కస్టోడియల్‌ డెత్‌ విచారణలో ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ను ఎన్నటికీ నియమించకూడదు.

ఒక కేసు దర్యాప్తు పూర్తయ్యేదాకా పోలీసులు ఎలాంటి ప్రెస్‌మీట్లు పెట్టకూడదు. అయితే.. దర్యాప్తులో పురోగతిపై ప్రెస్‌నోట్లు విడుదల చేయవచ్చు.

Updated Date - 2022-05-21T08:21:28+05:30 IST