ఆలోపు.. సర్దేయండి!

Published: Mon, 25 Jul 2022 23:28:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆలోపు.. సర్దేయండి! ఎస్‌.కోట పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాం

నెలాఖరు లోపు ఎక్కడి వస్తువులు అక్కడే ఉండాలి
అక్రమార్కులకు పౌరసరఫరాలశాఖ అధికారుల గడువు
ఎస్‌.కోట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో దొంగలు పడ్డారు
1500 బస్తాల బియ్యం, 2500 కిలోల కందిపప్పు మాయం
గోడౌన్‌లోని ఓ ఉద్యోగి సహకారంతో నడిచిన వ్యవహారం
వెలుగులోకి రావడంతో దిద్దుబాటు చేపట్టిన అధికారులు


పేదలకు అందాల్సిన రేషన్‌ పక్కదారి పట్టించారు. గోడౌన్‌ నుంచే అక్రమంగా తరలించారు. ఏకంగా 1500 బస్తాల బియ్యం, 2500 కిలోల కందిపుప్పు అమ్ముకున్నారు. దర్జాగా జేబులు నింపుకున్నారు. అయినా అక్రమార్కులపై చర్యల్లేవు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మాయమైన సరుకులు గోడౌన్‌లో తెచ్చిపెట్టాలని సూచించారు. నెలాఖరు వరకు గడువు విధించారు. ఎస్‌.కోట పౌరసరఫరాలశాఖ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో జరిగిన ఈ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శృంగవరపుకోట, జూలై 25:
ఎస్‌.కోటలోని విజయనగరం రోడ్డులో పౌరసరఫరాల శాఖ ఎం.ఎల్‌.ఎస్‌ పాయింట్‌ (గోదాం) ఉంది. ఇక్కడి నుంచి శృంగవరపుకోట, జామి మండలాల పరిధిలోని లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు సరఫరా చేస్తారు. ప్రతినెలా డీలర్లు ఇక్కడికి వచ్చి సరుకులు తీసుకుని వెళ్లి ఎండీఎం అపరేటర్లకు అందిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి కొందరు డీలర్లతో కుమ్మక్కయ్యారు. ప్రతినెలా డీలర్లు తీసుకుని వెళ్తున్న సరుకులకు అదనంగా రెండు, మూడు బియ్యం బస్తాలు, 50 నుంచి 100 కేజీల వరకు కందిపప్పు అందించడం ద్వారా బ్లాక్‌మార్కెట్‌ తరలింపునకు తెరదీశారు. రాత్రి సమయంలో కూడా ఎవరూ చూడకుండా గోడౌన్‌ నుంచి సరుకులు బయటకు పంపించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా ఈ తంతు జరగుతోంది. నెల క్రితం స్టాక్‌లో తేడా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 1500 బస్తాల బియ్యం, 2500 కేజీల కందిపప్పు తక్కువగా ఉన్నట్లు లెక్కించారు. ఈ విషయం పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది.

ఆ తర్వాత ఏమైందంటే..

అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దీన్ని కప్పిపుచ్చుందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నెలాఖరులోపు లోటులో ఉన్న బియ్యం, కందిపప్పును యథాతథంగా గోడౌన్‌లో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. దీంతో వేరేచోట నుంచి బియ్యం, కందిపప్పును సేకరించి పౌరసరఫరాలశాఖ గోనె సంచెలతో కొద్దికొద్దిగా చేర్చుతున్నారు. మూడు రోజుల క్రితం 750 బస్తాల బియ్యం, అదివారం 190 బస్తాల బియ్యం గోడౌన్‌కు తరలించినట్లు సమాచారం. మిగిలిన బియ్యం రాత్రికిరాత్రే తెచ్చేయాలని ప్రయత్నిస్తున్నారు. బియ్యం, కందిపప్పును బ్లాక్‌ మార్కెట్‌కు తరలించిన ఉద్యోగులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా వారిని కాపాడేందుకు చూస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. సరుకును తిరిగి తెస్తున్న గోనెసంచి లాట్‌ నెంబర్‌, ట్యాగ్‌ల వంటి వాటిని క్షణ్ణంగా పరిశీలిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.

తనిఖీ చేసే అధికారం లేదు
ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లోని సరుకు నిల్వలను తనిఖీ చేసే అధికారం లేదు. ఈ పాయింట్‌ నుంచి డీలర్లకు సరుకు సక్రమంగా అందించడం వరకే మా బాధ్యత.
                - ఎన్‌వీఎస్‌ఎస్‌ఎన్‌ మూర్తి, ఎస్‌.కోట సీఎస్‌డీటీ

నా దృష్టికి రాలేదు:
బియ్యం, కందిపప్పు మాయమైన విషయం నా దృష్టికి రాలేదు. ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తాను. వారి సూచనలు, సలహాల మేరకు తనిఖీ చేపడతాం.
                - శ్రీనివాసరావు, తహసీల్దార్‌, ఎస్‌.కోట

తనిఖీలో తేలాల్సి ఉంది:
తనిఖీ చేస్తేనే ఎంత సరుకు మాయమైందో తెలుస్తుంది. మంగళవారం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను సందర్శిస్తాను. సరుకుల వివరాలన్నిటిని పరిశీలిస్తాను. పొరబాటున డీలర్ల వద్దకు అదనంగా సరుకు వెళ్లిఉంటే తిరిగి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నాం.
            - మీనాకుమారి, జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల శాఖ

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ తనిఖీ
 శృంగవరపుకోట: శృంగవరపుకోట పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను సోమవారం రాత్రి ఆ శాఖ జిల్లా మేనేజర్‌ మీనాకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిల్వల్లో తేడాలు ఉన్నట్లు పేర్కొన్నారు. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల ప్రకారం సరుకు నిల్వలను తనిఖీ చేస్తున్నామన్నారు. తేడా ఉంటే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం, కందిపప్పు వంటి సరుకులు గతంలో కూడా మాయమైనట్లు డీఎం వద్ద పలువురు ప్రస్తావించారు. ఇక్కడి నుంచి నిబంధనలకు విరుద్దంగా సరుకు బయటకు రావడానికి సహకరిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు లోతుగా విచారిస్తామని చెప్పారు. పూర్తి తనిఖీల తర్వాతే బియ్యం, కందిపప్పు, ఇతర సరుకుల్లో ఉన్న వ్యత్యాసాన్ని వెల్లడిస్తామన్నారు.


 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.