మహిళల రక్షణలో దిశ యాప్‌ వజ్రాయుధం

ABN , First Publish Date - 2021-08-03T04:56:46+05:30 IST

మహిళలు, చిన్నారుల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్‌ వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పేర్కొన్నారు.

మహిళల రక్షణలో  దిశ యాప్‌ వజ్రాయుధం
దిశ యాప్‌పై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

యాప్‌పై అపోహలు వద్దు

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప క్రైం, ఆగస్టు 2 : మహిళలు, చిన్నారుల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్‌ వజ్రాయుధంలా పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా పేర్కొన్నారు. కడప నగరం కళాక్షేత్రంలో దిశ యాప్‌ నిర్వహణ, వినియోగంపై ఎస్పీ అన్బురాజన ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, హింస తదితర కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మహిళల రక్షణకోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ పేరుతో చట్టాన్ని తెచ్చిందని, ఇది దేశంలోనే ఆదర్శంగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 


దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తాం : కలెక్టర్‌

మరో ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు అరికట్టే దిశగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. దిశ యాప్‌పై జిల్లా మొత్తం అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాలయాలు, రక్షణ శాఖ, వైద్య, ఆరోగ్య, న్యాయ శాఖల కార్యాలయాలు, సినిమా థియేటర్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో దిశ యాప్‌ కల్పించే రక్షణపై పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ప్రచారం చేయాలన్నారు. దిశ చట్టం, దిశ యాప్‌పై విద్యావ్యవస్థలు, వసతి గృహాల్లో బాలికలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు.


రెండు లక్షల మందికిపైగా..

జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల మంది దిశ యాప్‌ డౌనలోడ్‌ చేసుకున్నారని, లక్షకుపైగా మహిళలు ఈ యాప్‌ను ఉపయోగించారని ఎస్పీ కేకేఎన అన్బురాజన పేర్కొన్నారు. దిశ యాప్‌పై మహిళలకు అవగాహన, నమ్మకం వ్యక్తమవుతోందన్నారు. దాదాపు 300 మంది మహిళలపై నేరాలకు పాల్పడేందుకు పన్నాగం పన్నిన వ్యక్తిని దిశ ఎస్‌వోఎస్‌ యాప్‌ ద్వారా ఓ మహిళ పోలీసులకు పట్టించిందని, ఇలాంటి సంఘటనలు ఎవరికి ఎదురైనా నిరభ్యంతరంగా దిశ యాప్‌ ద్వారా, కాల్‌ సెంటర్‌ ద్వారా తమకు తెలియజేయాలని కోరారు. ప్రతి సోమవారం స్పందన ఫిర్యాదుల స్వీకరణలో అన్ని సచివాలయాల్లో మహిళా పోలీసులు మహిళల సమస్యలపై అర్జీలు స్వీకరించి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయడం జరుగుతుందన్నారు. విద్యార్థినులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


సచివాలయంలో ‘స్పందన’ ఫిర్యాదులు

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి  సుదూర ప్రాంతం నుంచి రాలేని వారు సమీప గ్రామ, వార్డు సచివాలయంలో పిటీషన్లు ఇచ్చి, నేరుగా వీడియో కాన్ఫరెన్స ద్వారా ఎస్పీతో మాట్లాడే వినూత్న కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులు ఫిర్యాదుదారులు అర్జీ ఇస్తే దానిని వెంటనే ఎస్పీ కార్యాలయానికి పంపి ఎస్పీతో మాట్లాడించి సమస్యలు పరిష్కరించే చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కడప సబ్‌కలెక్టర్‌ పృథ్వీతేజ్‌, డిప్యూటీ మేయర్లు ముంతాజ్‌బేగం, బండి నిత్యానందరెడ్డి, కడప డీఎస్పీ సునీల్‌, దిశడీఎస్పీ రవికుమార్‌, సీఐలు, సచివాలయ మహిళా పోలీసులు, ఎన్జీవో ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2021-08-03T04:56:46+05:30 IST