స్వరాజ్య సాధనలో.. కోటిరెడ్డి దంపతులు

ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST

వ్యాపారరీత్యా దేశానికి వచ్చిన తెల్లదొరలు దేశ సంపదను కొల్లగొట్టారు. భారతీయులను బానిసలుగా చేసుకొని పాలన సాగించారు. బ్రిటీషర్ల నుంచి భరతమాతకు విముక్తి కలిగించేందుకు ఎందరో మహనీయులు నడుం బిగించారు. తెల్లదొరలను తరిమి కొట్టేందుకు

స్వరాజ్య సాధనలో.. కోటిరెడ్డి దంపతులు
కడప కోటిరెడ్డి

నిర్బంధాలు, జైలు శిక్షలు లెక్క చేయకుండా..

స్వతంత్ర సంగ్రామంలో ముందడుగు

(కడప - ఆంద్రజ్యోతి) : వ్యాపారరీత్యా దేశానికి వచ్చిన తెల్లదొరలు దేశ సంపదను కొల్లగొట్టారు. భారతీయులను బానిసలుగా చేసుకొని పాలన సాగించారు. బ్రిటీషర్ల నుంచి భరతమాతకు విముక్తి కలిగించేందుకు ఎందరో మహనీయులు నడుం బిగించారు. తెల్లదొరలను తరిమి కొట్టేందుకు సిద్ధమయ్యారు. మహనీయులు ఇచ్చిన పిలుపునకు జిల్లాలో ప్రముఖులు స్పందించారు. కడప కొదమ సింహాల్లా తెల్లవారిపై పోరాటాన్ని సాగించారు. జైలుకు వెళ్లినా సరే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తెల్లదొరలపై తిరుగుబాటు చేశారు. ఇలా పోరాటం చేసిన వారిలో కడప కోటిరెడ్డి, ఆయన సతీమణి రామసుబ్బమ్మ ఉన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆ దంపతుల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుందాం.


గాంధీ ప్రసంగానికి అనువాదకుడుగా కడప కోటిరెడ్డి

దేశభక్తిని అణువణువునా వంటపట్టించుకున్న కడప కోటిరెడ్డి స్వాతంత్ర  పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. 1921లో గాంధీజీ జిల్లాలో పర్యటించినప్పుడు బాపూజీ ప్రసంగానికి కోటిరెడ్డి ప్రభావితుడయ్యారు. విదేశీ వస్తువుల బహిష్కరణ జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించారు. గాంధీజీ ప్రసంగానికి అనువాదుడిగా పనిచేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని నారాయణచెరువు(కోటిరెడ్డిపల్లె)లో కోటిరెడ్డి 1889లో జన్మించారు. మదనపల్లెలోని థియోసాఫికల్‌ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. విద్యార్థి దశలోనే దేశభక్తిని పెంపొందించుకున్నారు. మద్రా్‌సలోని క్రైస్తవ కళాశాలలో డిగ్రీ, లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశారు. 1914వ సంవత్సరంలో మదరాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. దేశభక్తితో వృత్తికి రాజీనామా చేసి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు జిల్లాలో సారా వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు. సారా ఉద్యమం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందంటూ 1921లో బ్రిటీ్‌ష ప్రభుత్వం ఆయనకు జైలు శిక్ష విధించింది. మళ్లీ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నందుకు 1922లో జైలుకు పంపించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు సంవత్సరం జైలు శిక్ష వేశారు. శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తరువాత క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా పల్లె పల్లె తిరిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని మరోసారి జైలుకు పంపారు.


రాజకీయ రంగప్రవేశం

కడప కోటిరెడ్డి 1927లో స్వరాజ్యం పార్టీ, 1929లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. బ్రిటీష్‌ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. స్వాతంత్య్రం అనంతరం 1952లో కడప నియోజకవర్గం నుంచి, 1953లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వంలో కోటిరెడ్డి దేవదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో మధుర, శ్రీరంగం, తిరునల్వేలి దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించారు.  ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. భాషాప్రాతిపదికన తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరు ప్రకాశం పంతులు మంత్రివర్గంలో రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. రాయలసీమ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందించారు. 1930లో జరిగిన శ్రీబాగ్‌ వడంబడికలోనూ కీలకంగా వ్యవహరించారు. 1925లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనకు కృషి చేశారు. తిరుపతిలో ఎస్వీ యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి చేశారు. ఈయన 1981లో మృతిచెందారు.


కోటిరెడ్డి రామసుబ్బమ్మ సైతం

జమ్మలమడుగులోని సుద్దపల్లెలో 1902లో కోటిరెడ్డి రామసుబ్బమ్మ జన్మించారు. వీరిది సంపన్న కుటుంబం వీరి తండ్రి సంస్కృత పండితులు. 1911లో 5వ జార్జ్‌ చక్రవర్తి పట్టాభిషేకానికి రామసుబ్బమ్మ తండ్రికి ఆహ్వానం అందింది. రామసుబ్బమ్మ ప్రాథమిక విద్య పల్లెలోనే చదివారు. అపరిమితమైన జ్ఞానం సంపాదించుకున్నారు. కోటిరెడ్డితో ఆమెకు 1917లో వివాహం జరిగింది. వివాహం తరువాత దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. 1938 డిసెంబర్‌లో కడప జిల్లా బోర్డు అధ్యక్ష పీఠం అధిరోహించిన తొలి మహిళ ఈమె. స్త్రీల పరదా పద్ధతిని వ్యతిరేకించారు. పలువురు స్వాతంత్య్ర ఉద్యమ నాయకులతో దేశమంతా పర్యటించారు. ప్రజల్లో దేశభక్తిని పెంచేలా ఉపన్యాసాలు చేశారు. రాయలసీమ నుంచి కీలకమైన మహిళా నాయకురాలిగా ఖ్యాతిగాంచారు. మహిళా మండలి అధ్యక్షురాలిగా, అఖిల భారత సాంఘిక సంక్షేమ మండలి సభ్యురాలిగా, శాసన మండలి సభ్యురాలిగా, హరిజన శ్రేయోభిలాషిగా, కడప పట్టణ పరిపాలన మండల సభ్యురాలిగా, జిల్లా విద్యాసంఘ సభ్యురాలిగా పనిచేశారు. పలు పాఠశాలలు స్థాపించారు.


కోటిరెడ్డి సర్కిల్‌

స్వాతంత్య్రంకోసం పోరాటం చేసి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలు అందించిన కడప కోటిరెడ్డి విగ్రహాన్ని స్టేట్‌గెస్ట్‌హౌస్‌ ఎదుట బస్టాండుకు పోయే కూడలిలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు కడపలో ఇది కోటిరెడ్డి సర్కిల్‌గా గుర్తింపు పొందింది. ఆయన స్ఫూర్తిగా చాలామంది నిరసనలు తెలిపేందుకు ఈ కూడలిని ఎంచుకుంటూ ఉంటారు. కోటిరెడ్డి దంపతుల పేరుతో కడపలో  దశాబ్దాల క్రితమే ‘కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ మహిళా డిగ్రీ కళాశాల’ ఏర్పాటు చేశారు.



Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST