పది రోజులుగా నీళ్లలోనే.....

ABN , First Publish Date - 2021-11-28T07:06:44+05:30 IST

తిరుపతి, చిత్తూరు నగరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇళ్ల బయట వరద నీరు ప్రవహిస్తుండడంతో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. జిల్లాలో ఈనెల 18వ తేదీన భారీ వర్షాలు మొదలయ్యాయి. అప్పటినుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలు నిత్య నరకం చూస్తున్నారు.

పది రోజులుగా నీళ్లలోనే.....
నీవానది సమీపంలోని వీరభద్రకాలనీ వీధుల్లో ప్రవహిస్తున్న వరద నీరు

వరద గాయాలను మాన్పడంలో వైఫల్యం

పూర్తిస్థాయిలో అందని ప్రభుత్వ సాయం

బిక్కుబిక్కుమంటున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు


చిత్తూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతి, చిత్తూరు నగరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇళ్ల బయట వరద నీరు ప్రవహిస్తుండడంతో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. జిల్లాలో ఈనెల 18వ తేదీన భారీ వర్షాలు మొదలయ్యాయి. అప్పటినుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలు నిత్య నరకం చూస్తున్నారు. తిరుపతి నగరంలోని శ్రీకృష్ణనగర్‌, దుర్గానగర్‌, ఆటో నగర్‌, పోస్టల్‌ కాలనీ, ఎస్టీవీ నగర్‌ తదితర ప్రాంతాలు, చిత్తూరు నగరంలోని వీరభద్రకాలనీ, మసీదు మిట్ట, తేనబండ, రిక్షాకాలనీ, ఇందిరానగర్‌, శివాజీనగర్‌, ఓటిచెరువు, వళ్లియప్పనగర్‌ తదితర ప్రాంతాలు పది రోజులైనా వరద నీటిలోనే మగ్గుతున్నాయి.


అందని ప్రభుత్వ సాయం


కుటుంబానికి రూ.2వేల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేశామని అఽధికారులు చెబుతున్నా.. అందరికీ పూర్తిస్థాయిలో సాయం అందలేదు. తిరుపతి, చిత్తూరు నగరాల్లోని కొన్ని కాలనీల వైపు అధికారులు నేటికీ కన్నెత్తి చూడలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బియ్యం, కూరగాయల వంటి సరుకులు అందించినా.. చాలా ఇళ్లలో పొయ్యి వెలిగించే అవకాశం లేక బాధితులు దాతల సాయం కోసం రోజూ ఎదురుచూస్తూనే ఉన్నారు. జిల్లాలో పది రోజుల పాటు కురిసిన వర్షాలకు 489 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 1330 ఇళ్లు ధ్వంసం కాగా 62,865 మంది నిరాశ్రయులయ్యారు. 783 పశువులు మృత్యువాతపడ్డాయి. 15,600 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 321 కిలోమీటర్ల పంచాయతీరాజ్‌, 539 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు చిన్నాభిన్నమయ్యాయి. ఇలా ప్రతి శాఖలోనూ కోలుకోలేని నష్టం వాటిల్లింది. సుమారు రూ.వెయ్యి కోట్లపైనే నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు.




దాతలు రాకుంటే ఆ పూట పస్తులే


బిక్కుబిక్కుమంటూ వరద నీటిలో కూర్చొని ఉన్న ఈ ముసలవ్వల పేర్లు పాపమ్మ, చిన్నతాయి. వీరభద్రకాలనీలో ఇలా రోజంతా ఇంటి గుమ్మం వద్ద కూర్చుంటారు. దాతలెవరైనా వచ్చి ఆహార పొట్లాలు అందిస్తే ఇంట్లో కూర్చొని తింటారు. దాతలు రాకుంటే ఆ పూట పస్తులు ఉండాల్సిందే. ఇంటి ముందున్న నీటి ప్రవాహాన్ని దాటి బయటి ప్రపంచంలోకి మాత్రం రాలేరు.





అల్లా మీదే భారం



ఈయన పేరు ఖాజీర్‌ అహ్మద్‌. మసీదుమిట్టలోని మసీదులో ప్రార్థనలు చేయిస్తుంటారు. నగరంలోని ప్రభుత్వాస్పత్రి ప్రాంతం నుంచి వీరభద్రకాలనీ మీదుగా రోజు ఐదు పూటలా మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేయించాల్సి ఉంది. వరద కారణంగా నీటి ప్రవాహం అధికం కావడంతో మొదట్లో మూడు రోజులు మసీదులోనే ఉండిపోయారు. ఇప్పుడు కూడా రోజుకు ఐదు పూటలా ఎవరో ఒకరి సాయంతో వరద ప్రవాహాన్ని దాటి మసీదుకు వెళుతున్నారు. ఈ వయసులో ఇలా కష్టపడి వెళ్లాల్సిన అవసరం ఉందా అని అతన్ని స్థానికులు ప్రశ్నించగా.. అల్లా మీద భారం వేశా. ఆయనే మేలు చేస్తాడని బదులిస్తున్నారు. 

Updated Date - 2021-11-28T07:06:44+05:30 IST