నాడు ఆర్భాటం.. నేడు ఆందోళన... YSRCP కేడర్‌లో అంతర్మథనం..!

Sep 15 2021 @ 11:45AM

అధికారంలోకి వచ్చిన వెంటనే సంబురాలు చేసుకున్నారు. ప్రజలు తమను నమ్మి ఓట్లు వేసి దీవించారని భారీగా ప్రచారం చేశారు. ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తమ దూకుడు చూడండని బీరాలు పోయారు. అటువంటి నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యకర్తలే కాదు.. కొందరు ఎమ్మెల్యేలది అదే తీరు. రెండున్నర సంవత్సరాల్లోనే తమకు ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చపై.. ‘ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌ కథనం ఇప్పుడు చూద్దాం.. 

నాటి హడావుడి.. ఇప్పుడు ఏమైంది..

పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్ధానాలు ఉండగా.. 2019 ఎన్నికల్లో వాటన్నింటిలోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. ఇంకేముంది ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లు వేశారని, వారి కలలన్నీ నెరవేరుస్తామని అప్పటి నుంచి వైసీపీ శ్రేణులు ఆర్బాటపు ప్రచారం మొదలుపెట్టాయి. అంతేకాదు తర్వాత సంవత్సర కాలంలో నానా హడావుడి చేశారు. ఇప్పుడు సీన్ మారింది. అభివృద్ధి పనులు ఎప్పుడో అటకెక్కగా, సంక్షేమ పథకాలూ అదే తోవలో పయనిస్తున్నాయన్నది వాస్తవమని రాజకీయ విశ్లేషకులే చెబుతున్నారు. అధికార వైసీపీ నాయకులు, కార్యకర్తల బాధ అయితే చెప్పలేని విధంగా మారిందన్న చర్చ జరుగుతోంది. "ఎన్నో అనుకున్నాం.. ఏదేదో చేస్తామని చెప్పాం.. ఇప్పుడిలా అయ్యింది ఏంటబ్బా.." అంటూ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు తమ సహచరుల వద్దే వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

రోడ్ల పరిస్థితి దారుణం..

ఏపీలో ముఖ్యంగా రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్తో కూస్తో బాగున్నాయి అనుకున్న రహదారులు ఏమైనా ఉన్నాయంటే.. అవి కేవలం జాతీయ రహదారులే! మిగిలిన అన్ని రోడ్లన్నీ అత్యంత అధ్వాన్నంగా మారాయి. ఏ రోడ్డు చూసినా గోతులమయమే. నరకానికి నకళ్లు అన్నట్లు రోడ్ల పరిస్థితి తయారైంది. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా ఒప్పుకునే పరిస్థితి. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, రోడ్ల దుస్థితిపై తన ఆవేదన వెళ్లగక్కారు. మరో వైసీపీ ఎమ్మెల్యే సైతం తన కార్యకర్తల వద్ద ఇదే అంశంపై మాట్లాడినట్లు సోషల్ మీడియాలోనూ బాగానే వైరల్ అయింది. రోడ్లకు కనీసం మరమ్మతులు చేయించలేని స్థితిలో ఉన్నామని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

 సంక్షేమ పథకాల్లోనూ కోతలు..

ఇక సంక్షేమ పథకాల అమలులో వైసీపీ తాజాగా పిల్లిమొగ్గలు వేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా పింఛన్ల లబ్ధిదారుల్లో భారీగా కోతలు పెడుతోంది. కొత్త రూల్స్ తీసుకొచ్చి పెన్షనర్ల సంఖ్యను తగ్గిస్తుండటం వైసీపీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. అర్హులను సైతం అనర్హులుగా ప్రకటిస్తూ పెన్షన్లు నిలిపివేస్తుండటం అధికార పార్టీ కార్యకర్తలు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులకు మింగుడు పడటం లేదు. ఈ పరిణామాలన్నీ వైసీపీ వర్గాలను కలవరపెడుతున్నాయి.

 ఎమ్మెల్యేలలోనూ ఆందోళనే..

కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తిగానే ఉన్నారనే టాక్ లేకపోలేదు. అయితే వారెవరూ ప్రస్తుత పరిస్థితుల్లో బయటపడలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో వారు కూడా బహిరంగంగానే ఆవేదన వెళ్లగక్కినా ఆశ్చర్య పోనక్కర్లలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతల అంతర్గత ఆందోళన. ఈ పరిస్థితి మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.