వరసిద్ధుడి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట

ABN , First Publish Date - 2022-08-11T06:51:26+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

వరసిద్ధుడి బ్రహ్మోత్సవాల్లో   సామాన్య భక్తులకే పెద్దపీట
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

 21న మహాకుంభాభిషేకాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌ పిలుపు 

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 10: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయనున్నట్లు పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మె్‌సబాబు, కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. ఆలయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ నేతృత్వంలో బుధవారం జిల్లా స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రెండేళ్ల తర్వాత బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నందున భక్తుల సంఖ్య పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. భక్తులెవరూ ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు 14 గ్రామాలకు చెందిన ఉభయదారులు, పరిసర గ్రామస్తులు సహకరించాలని కోరారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు జరిగే 21 రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కాణిపాకం విచ్చేసే భక్తులకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలని సూచించారు. భక్తులకు బస, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులందరు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలు విజవంతం చేయాలన్నారు. ఆలయ అధికారులు అందరు కలసి వినాయక చవితి రోజున మూల విరాట్‌కు నిర్వహించే అభిషేకం, భక్తుకు స్వామి దర్శనం కల్పించడంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈనెల 21న నిర్వహించనున్న ఆలయ మహాకుంభాభిషేకాన్ని  విజయవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను వీరు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఈఈ వెంకటనారాయణ, ఎస్పీ రిషాంత్‌రెడ్డి, దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, బోర్డు సభ్యులు నరసింహులుశెట్టి, కొడయ్య, కాంతమ్మ, ఉభయదారుల సంఘ అధ్యక్షుడు ఈశ్వర్‌బాబు, అన్ని శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.  


===========================


Updated Date - 2022-08-11T06:51:26+05:30 IST