ltrScrptTheme3

ఐఎన్ఏ యోధుడు అనంతశర్మ

Oct 26 2021 @ 03:53AM

స్వాతంత్ర్య సమర యోధులందరూ, మన భారతమాత ముద్దుబిడ్డలే. బ్రిటిషువారి పాలన నుంచి విముక్తి పొందాలన్న మన నేతల పిలుపునకు ప్రతిస్పందించి మన తండ్రులు, తాతలు ఉప్పెనలా ముందుకు కదిలారు. కఠోర ఉద్యమాలు, సత్యాగ్రహా లలో కూడా యువత ధైర్యసాహసాలతో పాల్గొన్నారు. వారందరిదీ ఒకే ఒక లక్ష్యం- తెల్లవారిని తరిమికొట్టడం. బ్రిటిషువారి తూటాలకు బెదరలేదు, బెంబేలు పడలేదు. తమ గుండెలను చూపించి, ఎదురు నిలబడి, తరిమి తరిమి కొట్టిన ఘనత మన స్వాతంత్ర్య సమరయోధులది.


ఆ సమరయోధుల్లో మనం సగర్వంగా చెప్పుకోవలసిన ఒక ఉదాత్త వ్యక్తి గోపరాజు వెంకట అనంతశర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరు గ్రామంలో 1920 జనవరి 9న జన్మించారు. పదమూడవ ఏటనే ఎస్ఎస్ఎల్‌సిలో ఉత్తీర్ణులయిన అనంతశర్మ ద్వితీయ ప్రపంచ సంగ్రామం తొలినాళ్లలో ఆర్మీలో అకౌంటెంట్‌గా చేరారు. బెంగలూరులో ఆయన తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 


ఆ ఉద్యోగంలో ఆయన చూపిన చురుకుతనం, నైపుణ్యత అందరినీ ఆకట్టుకుంది. పలువురు పెద్దల సలహాతో సైన్యంలో చేరేందుకు అనంతశర్మ తనకు తనే క్రమశిక్షణతో కఠోరమైన శిక్షణ ఇచ్చుకుని ఆ ఉద్యోగానికి అర్హుడయ్యారు.


బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో రైఫిల్ షూటింగ్ శిక్షణ ముగించిన తర్వాత మలేసియాలోని కోటాబారు సైనిక స్థావరానికి ఆయన్ని పంపించారు. 


అది రెండో ప్రపంచయుధ్ధం జరుగుతున్న సమయం. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ బ్రటిష్ ఆర్మీతో కలసి శత్రుదేశమైన జపాన్ మీద యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో తొలుత జపాన్ గెలిచింది. అనంతశర్మ యుద్ధఖైదీగా బ్యాంకాక్ జైలులో, ఆరునెలలు గడిపారు. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుంచి బయటకు వచ్చి ఇండియన్ నేషనల్ ఆర్మీ (అజాద్ హింద్ ఫౌజ్)లో చేరవలసిందిగా సుభాష్‌ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు అనంతశర్మను ఎతగానో ఉత్తుజితుడిని చేసింది. బ్యాంకాక్‌కు వచ్చిన సుభాస్ బోస్‌ను ఆయన స్వయంగా కలిసి తన మనసులోని మాట చెప్పుకున్నారు. శర్మకు రైఫిల్ షూటింగ్‌లో నైపుణ్యం ఉందని తెలుసుకున్న సుభాష్‌ ఆయనను తన వ్యక్తిగత అంగరక్షకుడిగా నియమించుకున్నారు. అనంతశర్మ జీవితంలో అదొక అద్భుతమైన మలుపు. ఆయన చాలా సందర్భాల్లో పలువురితో పాలుపంచుకున్న విషయమది. 


జపాన్ ఓటమితో అనంతశర్మ మరోసారి యుద్ధఖైదీ అయ్యారు. 1943 సెప్టెంబర్ 6 నుంచి 1946 మే 23 వరకు ఆయన జైలు జీవితం గడిపారు. విడుదలయిన తరువాత స్వగ్రామానికి వచ్చిన శర్మకు తండ్రి పరలోక గతుడయ్యారన్న వాస్తవాన్న తట్టుకునేందుకు కొంత సమయం పట్టింది. దానితో పాటు ఆర్ధికంగా చితికిపోయి కట్టుబట్టలతో నిలబడవలసిన పరిస్ధితి ఎదురుపడింది. కుటుంబ పోషణార్ధం ఆయన చెన్నపురి (నేటి చెన్నై)కి చేరారు. తొలుత ఒక ప్రచురణ సంస్థలోను, ఆ తరువాత ఒక చార్టర్డ్ అకౌంట్ సంస్థలోను ఉద్యోగం చేశారు. ఆ తరువాత ఆంధ్రకేసరి ప్రకాశం సహాయంతో ఇండియన్ రైల్వేస్్‌లో టికెట్టు కలెక్టరుగా చేరారు. రైల్వేస్‌లో ఉద్యోగం రావటం దేశమాత తనకు పెట్టిన భిక్షగా ఆయన భావించారు. క్రమశిక్షణ, విధ్యుక్త ధర్మ భావనతో మూడు దశాబ్దాల పాటు అనంతశర్మ తన సేవలు అందించారు. ప్రధానంగా విజయవాడ, తెనాలి, గోదావరి, నిడదవోలు, రాజమండ్రి రైల్వే స్టేషన్స్‌లో ఆయన పని చేశారు. 1977లో విజయవాడలో స్టేషన్ మాస్టర్‌’గా రిటైరయ్యారు.


1961లో భారత ప్రభుత్వం అనంతశర్మకు స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పెన్షన్‌ను మంజూరు చేసింది. అయితే అప్పటికే రైల్వే ఉద్యోగిగా ఉన్నందున ఆ పెన్షన్‌ను స్వీకరించడం ధర్మం కాదని ఆయన భావించారు. రైల్వే సర్వీస్‌లో ఉన్నంత‌‌వరకు స్వాతంత్ర్య సమరయోధుని పెన్షన్‌ను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఉద్యోగ విరమణ తరువాత మాత్రమే ఆయన ఆ పెన్షన్‌ను తీసుకున్నారు. ఆనాడు భారత ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులకు సేద్య భూమిని కేటాయించేది. ఆ ప్రకారం అనంతశర్మకు తూర్పు గోదావరి జిల్లా జేగురుపాడులో ఐదెకరాల వ్యవసాయ భూమిని ఇచ్చారు. రైల్వే ఉద్యోగిగా తనకు లభించే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోతుందనే ఉదార భావంతో ఆ భూమిని సున్నితంగా తిరస్కరించారు. భూమి ఒక్కటే కాదు, పెట్రోల్ బంకు నిర్వహణ లైసెన్స్‌ను తీసుకోవడానికి కూడా నిరాకరించిన త్యాగశీలి అనంతశర్మ. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంలో ఆ విశాల హృదయుడిని స్మరించుకోవడం మన కర్తవ్యం.

గోపరాజు రఘురాం

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.