ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షం

ABN , First Publish Date - 2022-08-09T04:27:56+05:30 IST

జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా వర్షం తెరిపి ఇవ్వకుండా కురుస్తుండటంతో రాబోయే కొన్ని గంటల్లో జిల్లాలోని జలాశాయాలకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేశారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షం

-పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు 

-లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు

-స్తంభించిన రాకపోకలు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కూడా వర్షం తెరిపి ఇవ్వకుండా కురుస్తుండటంతో రాబోయే కొన్ని గంటల్లో జిల్లాలోని జలాశాయాలకు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా వర్షాలతో ఎలాంటి విపత్తులు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని ఇప్పటికే సంబంధిత మండలాల అధికారులకు సమాచారం ఇచ్చారు. ముఖ్యంగా పెన్‌గంగ, పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో మరోసారి సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు చేస్తున్నారు. ఇప్పటికే క్యాచ్‌మెంటు ఏరియాలో భారీ వర్షపాతం నమోదు అవుతున్నందున ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు కుమరంభీం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతిడంతో ఆసిఫాబాద్‌ ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ గుణవంతరావు తన సిబ్బందితో కలిసి ప్రాజెక్టు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు అన్నీ వరదనీటితో జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది.

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి నుంచి ముసురువాన కురుస్తోంది. వర్షాలకు వ్యవసాయ పనులకు తీవ్రఆటంకం ఏర్పడింది. కుమరం భీం, వట్టివాగు ప్రాజెక్టులలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. వట్టివాగు ప్రాజెక్టులోకి 2500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరగా మూడు గేట్లు ఎత్తి 2247 క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదులుతున్నారు. కుమరం భీం ప్రాజెక్టులోకి 16314 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ఐదు గేట్లు ఎత్తి 17680 క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదులుతున్నారు.

కాగజ్‌నగర్‌: పట్టణంలో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. లారీచౌరస్తా వరకు నీరు నిలిచిపోవటంతో అధికారులు నీరు నిల్వకుండా చేశారు. రోడ్డుపై గుంతలు వర్షం నీటితో నిండిపోవటంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు.

బెజ్జూరు: మండలంలో వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లడంతో జనజీవనం అతలాకుతలమైంది. కృష్ణపల్లి-సోమిని, సల్గుపల్లి-సులుగుపల్లి గ్రామాల మధ్య ఒర్రెలు పొంగటంతో పలు గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సుశ్మీర్‌, సోమిని, ఇప్పలగూడ, నాగేపల్లి, చింతలపల్లి, గిర్రగూడ, బండలగూడ తదితర గ్రామాలకు రాకపోకలకు నిలిచి పోయాయి. తీగెల ఒర్రె కారణంగా పెంచికలపేటమీదుగా వచ్చే బస్సులన్నీ రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చిన్నసిద్ధాపూర్‌ గ్రామానికి చెందిన కావిడి శ్రీనివాస్‌కు చెందిన ఎద్దు వాగు దాటుతూ మృతి చెందింది. ఎల్కపల్లి గ్రామానికి చెందిన శాంతాబాయి ఇల్లు వర్షం కారణంగా కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన ఎస్సై పరీక్ష రాసేందుకు మండలానికి చెందిన పలువురు నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో కురిసిన భారీ వర్షానికి సల్గుపల్లి, సులుగుపల్లి గ్రామాల మధ్య ఉన్న తీగెల ఒర్రె ఉప్పొంగి ప్రవహించడంతో అష్టకష్టాలు పడ్డారు. వాగు ప్రవాహం అధికంగా ఉండటంతో అతి కష్టంమీద సల్గుపల్లి గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌, కుమార్‌లు కలిసి వారందరిని వాగు దాటించారు.

వాంకిడి: మండలంలో వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. చెరువులు నిండి వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయి. ఖమాన, పిప్పర్‌గొంది ఒర్రెలు ఉప్పొంగి పారు తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాలకు వెళ్లే రహదారులు కంకర తేలి, గుంతలు ఏర్పడి ప్రజలకు ఇబ్బందికరంగా తయారయ్యాయి. పత్తి పంటలో కలుపు పెరిగి పంట ఎదుగుల నిలిచిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

చింతలమానేపల్లి: మండలవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. దీంతో కేతిని-దిందా గ్రామాల మధ్య ఉన్న వాగు వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దిందా గ్రామస్థులకు రాకపోకలు నిలిచాయి. ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. రుద్రాపూర్‌ గ్రామంలోని పలువురి ఇళ్లల్లో వరదనీరు చేరడంతో వారు ఇబ్బందులు పడ్డారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరి, పత్తి పంటలు నీటమునిగాయి. ఇప్పటికే భూముల్లో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో మొలకలు ఎదగలేకపోతున్నాయని, ఈ వర్షంతో ఇంకా నష్టమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జైనూరు: వర్షం కారణంగా సోమవారం ప్రజలు బయటికి రాలేకపోయారు. లొద్దిగూడ, చింతకర్ర, పానాపటార్‌, లేండిగూడ వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వరిపంటలు, పప్పు ధన్యాల పంటలు నీట ముని గాయి. పత్తి రాబోయే రోజుల్లో ఆశించినంత దిగుబడి ఇవ్వడం కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు.

దహెగాం: వర్షంతో బీబ్రా గ్రామం సమీపంలో తెగిపోయిన రోడ్డు వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే లగ్గాం-పెంచికలపేట మండలానికి వెళ్లే రోడ్డు బురదమయంగా మారడంతో తీవ్ర ప్రజలు అవస్థలు పడ్డారు.

Updated Date - 2022-08-09T04:27:56+05:30 IST