Heavy Rainfall: ఉత్తరాఖండ్‌ అతలాకుతలం

ABN , First Publish Date - 2021-10-19T20:11:17+05:30 IST

ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో మంగళవారం ఉత్తరాఖండ్‌లోని

Heavy Rainfall: ఉత్తరాఖండ్‌ అతలాకుతలం

డెహ్రాడూన్ : ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో మంగళవారం ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా కుమావూన్ రీజియన్‌లో ఇళ్లు నేల మట్టమయ్యాయి. అనేకమంది శిథిలాల క్రింద చిక్కుకున్నారు. నైనిటాల్‌‌కు వెళ్ళే దారులన్నీ దిగ్బంధనం కావడంతో మిగిలిన రాష్ట్రంతో సంబంధాలు తెగిపోయాయి. రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయపడేందుకు మూడు సైనిక హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. రెండు హెలికాప్టర్లను నైనిటాల్‌కు, ఒక హెలికాప్టర్‌ను గర్వాల్ రీజియన్‌కు పంపుతామన్నారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని ఈ హెలికాప్టర్ల సహాయంతో రక్షిస్తామని చెప్పారు.  


ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి కోరారు. చార్‌ధామ్ యాత్రకు వెళ్ళే భక్తులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని, వాతావరణ పరిస్థితి మెరుగుపడిన తర్వాత ప్రయాణాన్ని పునఃప్రారంభించవచ్చునని తెలిపారు. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని, రాష్ట్రంలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అన్ని విధాలుగా సహాయపడతామని హామీ ఇచ్చారన్నారు. 


నైనిటాల్‌లోని మాలి రోడ్డు, నైని సరస్సు తీరంలో ఉన్న నైనా దేవి దేవాలయం వరదల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడటం వల్ల ఓ హాస్టల్ భవనం దెబ్బతిందన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో పాటు రాష్ట్ర మంత్రి అజయ్ భట్‌తో టెలిఫోన్‌ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిని అడిగి తెలుసుకుని, సాధ్యమైన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. 








Updated Date - 2021-10-19T20:11:17+05:30 IST