ఆగని వర్షాలు

ABN , First Publish Date - 2022-08-10T06:03:31+05:30 IST

జిల్లాలో వారం రోజులుగా ప్రతి రోజూ వర్షం కురుస్తూనే ఉంది. ఏదో ఒక చోట జల్లులు పడుతూనే ఉన్నాయి.

ఆగని వర్షాలు
నాగారం మండల కేంద్రంలో కురుస్తున్న వర్షం

సూర్యాపేట టౌన్‌, ఆగస్టు 9 : జిల్లాలో వారం రోజులుగా ప్రతి రోజూ వర్షం కురుస్తూనే ఉంది. ఏదో ఒక చోట జల్లులు పడుతూనే ఉన్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 2.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాగారంలో 12.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మేళ్లచెర్వులో 0.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 348.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

మునిగిన పంట పొలాలు

నాగారం : తుపాన్‌ ప్రభావంతో మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ భారీగా వర్షం కురిసింది. దీంతో పంట పొలాలకు నీరు చేరి మునిగిపోయాయి. నాగారం చెరువు దిగువన కొత్తపల్లి చెరువుకు భారీగా నీరు చేరుతోంది. పొలాలకు గండ్లు పడి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.



రాకపోకలు బంద్‌

అర్వపల్లి : నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు కోడూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తుంగతుర్తి-సూర్యాపేటకు రాకపోకలు మంగళవారం బంద్‌ అయ్యాయి. కొమ్మాల, కాసర్లపాడు, తూర్పుతండ, పడమరతండ, బొల్లంపెల్లి, కోమటిపెల్లి, సీతారాంపురం చెరువులు, కుంటలు అలుగుబోస్తున్నాయి. దీంతో కోడూరు చెరువు వాగు అలుగు వరదకు నాలుగు గ్రామాలైన కొమ్మాల, లోయపెల్లి, సంగెం, అన్నారం   గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. మండలంలోని అన్ని చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి.  

జాజిరెడ్డిగూడెంలో కూలిన ఇల్లు

జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన గీస సైదమ్మ ఇల్లు వర్షానికి కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు సైదమ్మ కోరారు. 


ముమ్మరంగా వరినాట్లు 

అనంతగిరి: మండల వ్యాప్తంగా వరినాట్లు జోరు అందుకున్నాయి. ఈ ఏడాది ముందుగానే వరి నాట్లతో రైతులు బిజీగా ఉన్నారు. బావుల్లో, బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటంతో నార్లు పెంచి నాట్లలో నిమగ్నమైయ్యారు. సయానుకూలంగా నాట్లు వేస్తున్నామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా నాట్లు వేసే మహిళలతో పొలాలు కనిపిస్తున్నాయి. 



Updated Date - 2022-08-10T06:03:31+05:30 IST