ఇన్‌చార్జి తహసీల్దార్లు

ABN , First Publish Date - 2020-11-09T04:15:34+05:30 IST

జిల్లాలో ఒకటి.. రెండు కాదు ఎనిమిది మండలాల్లో పూర్తిస్థాయి తహసీల్దార్లు లేరు. ఇన్‌చార్జులే పాలన సాగిస్తున్నారు. సంవత్సరాల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిప్యూటీ తహసీల్దార్లకు పదన్నోతికి అవకాశం ఉన్నా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారికి చాన్స్‌ ఉండడం లేదు.

ఇన్‌చార్జి తహసీల్దార్లు
కలెక్టర్‌ కార్యాలయం

జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఈ పరిస్థితి

ప్రభుత్వం డీపీసీ ఆమోదించక అందని పదోన్నతలు 

ప్రమోషన్ల కోసం డీటీల ఎదురుచూపు

కలెక్టరేట్‌, నవంబరు 8: జిల్లాలో ఒకటి.. రెండు కాదు ఎనిమిది మండలాల్లో పూర్తిస్థాయి తహసీల్దార్లు లేరు. ఇన్‌చార్జులే పాలన సాగిస్తున్నారు. సంవత్సరాల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిప్యూటీ తహసీల్దార్లకు పదన్నోతికి అవకాశం ఉన్నా? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారికి చాన్స్‌ ఉండడం లేదు. దీంతో వారంతా నిరాశలో ఉన్నారు. 

మండలానికి తహసీల్దార్‌ కీలకం. ముఖ్యమైన పనులన్నీ ఈ అధికారితో ముడిపడి ఉంటాయి. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు.. రికార్డులు నవీనీకరణ.. మీసేవ కేంద్రాల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలన.. స్పందనలో వచ్చిన వినతుల పరిష్కారం.. వివిధ ప్రాజెక్టులు, రహదారుల భూసేకరణ వంటి కార్యకలాపాలతో పాటు అనేక ఇతర విధులు నిర్వర్తిస్తుంటారు. జిల్లాలో వేపాడ, జామి, జియ్యమ్మవలస, తెర్లాం, గంట్యాడ, పూసపాటిరేగ, విజయనగరం, సాలూరు మండలాల్లో పూర్తిస్థాయి తహసీల్దార్లు లేరు. చాలా కాలంగా ఎఫ్‌ఏసీ(ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌)లే ఉన్నారు. వేపాడ, జామి, జియ్యమ్మవలస, తెర్లాం మండలాల్లో  హడహక్‌ పదోన్నతిపై తహసీల్దార్లు పని చేస్తున్నారు. గంట్యాడ, పూసపాటిరేగ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లే ఇన్‌చార్జి తహసీల్దార్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాలూరు ఇన్‌చార్జి బాధ్యతలను రామభద్రపురం తహసీల్దార్‌ చూస్తున్నారు. జిల్లా కేంద్రంలోనూ ఇన్‌చార్జే ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్‌కు అనేక బాధ్యతలు ఉంటాయి. సాధారణ పనులతో పాటు వీఐపీల  ప్రొటోకాల్‌ చూడాలి. అయినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పూర్తిస్థాయిలో తహసీల్దార్లు నియమించాలంటే అర్హులను ప్రభుత్వం కేటాయించాలి. అన్ని విధాలా అర్హత ఉన్న డిప్యూటీ తహసీల్దార్లు ప్యానల్‌ లిస్టులో ఉంటారు. వారిని  డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) ఆమోదించాలి. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఈ కమిటీలో ప్రిన్సిపల్‌ కమిషనర్‌, సీసీఎల్‌ఏలో కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వరీ, సీసీఎల్‌ఏ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. వీరు ప్రతి ఏడాది సెప్టెంబరు నెలలో డీపీసీనీ ఆమోదించాల్సి ఉంది. ఇప్పటివరకూ డీపీసీ ఆమోదం తెలిపకపోవడంతో అర్హత ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు ప్రమోషన్‌ రావడం లేదు. ఇకనైనా డీపీసీని ఆమోదించి పదోన్నతలు ఇచ్చి మండలాలకు పూర్తిస్థాయి తహసీల్దార్లను నియమించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 


Updated Date - 2020-11-09T04:15:34+05:30 IST