రవాణావైపే మొగ్గు

Published: Sat, 26 Mar 2022 00:26:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రవాణావైపే మొగ్గు దళితబంధు అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌(ఫైల్‌)

- దళితబంధు లబ్ధిదారుల్లో అత్యధికుల ఎంపిక ఇదే

- జిల్లాలో మొదటి విడతలో 346 మంది లబ్ధిదారుల ఎంపిక

జగిత్యాల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): దళితులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవడానికి జగిత్యాల జిల్లాలో అధికారుల కసరత్తు కొనసాగుతోంది. జిల్లాలో మొదటి విడతలో 346 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ఇందులో 344 లబ్ధిదారుల వివరాలను అధికారుల సేకరించారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఇప్పటివరకు యూనిట్ల ఎంపిక వ్యవహారంలో ప్రధానంగా రవాణా రంగాన్నే లబ్ధిదారులు ఎంచుకుంటుండడం విశేషం.

జగిత్యాల జిల్లాలోని అయిదు నియోజకవర్గాలలో 346 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 100, కోరుట్ల సెగ్మెంట్‌లో 100, ధర్మపురి నియోజకవర్గంలో 82, చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల, కొడిమ్యాల మండలాల్లో 34, వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో 30 మంది చొప్పున దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌, కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, జగిత్యాల సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రవి శంకర్‌, వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ బాబులు లబ్ధిదారుల జాబితాలను సిద్దం చేసి అధికారులకు అందించారు.

- ఏ రంగంలో ఎన్ని యూనిట్లు..

జగిత్యాల జిల్లాలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను అధికారులు గుర్తించారు. ఇందులో వ్యవసాయాధారిత రంగంలో 138 యూనిట్లు (ట్రాక్టర్లు, వివిధ రకాల వాహనాలు) రవాణా రంగంలో 82 యూనిట్లు, మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో 29 యూనిట్లు, రిటైల్‌ అండ్‌ షాప్స్‌ రంగంలో 57 యూనిట్లు, సేవా రంగంలో 38 యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలను అధికారులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 82 మంది ట్రాన్స్‌పోర్టు రంగంలో భాగంగా కార్లు, ట్రాక్టర్లు, ప్రొక్లయిన్లు, వస్తు రవాణా వాహనాలుకొని జీవనోపాధి పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మిగిలిన వారు మినీ డెయిరీ, కోడి పిల్లల పెంపకం, టెంట్‌ హౌజ్‌, సూపర్‌మార్కెట్‌, హోల్‌సేల్‌, రిటైల్‌, వ్యాపారాలను ఎంచుకున్నారు. వస్తు సామగ్రి, హోల్‌సేల్‌, రిటైల్‌ సర్వీసు రంగాల్లో ఇతర దుకాణాలను తెరవడానికి కొద్ది మంది మాత్రమే ముందుకు వస్తున్నారు. కాగా పారిశ్రామిక రంగంలో వివిధ వస్తువుల తయారీకి కేవలం 29 మంది మాత్రమే పలు యూనిట్లను ఎంపిక చేసుకున్నారు.

-  నెలాఖరులోపు గ్రౌండింగ్‌కు ప్రయత్నాలు..

జిల్లాలో మొదటి విడత దళిత బందధు యూనిట్లను త్వరగా గ్రౌండింగ్‌ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో 346 మంది లబ్ధిదారులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆమోదంతో అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన దళిత బంధు బృందాలు 344 లబ్ధిదారుల ధ్రువీకరణ, వారి నుంచి వివరాల సేకరణ పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గాల వారీగా దళితబంధు యూనిట్ల ఏర్పాటుపై అవగాహన సదస్సులు నిర్వహించారు.  మండలాల వారీగా ప్రత్యేక అధికారులు సర్వీసెస్‌, రిటైలర్‌ షాప్స్‌, మాన్యుఫాక్చరింగ్‌, వ్యవసాయ అనుబంధ రంగాల లబ్ధిదారులకు ఫోన్‌ చేసి యూనిట్‌ గ్రౌండింగ్‌ చేయడానికి సంసిద్‌ధంగా ఉన్న వారిని గుర్తిస్తున్నారు. వ్యవసాయ, రవాణా సెక్టార్‌ కింద ట్రాక్టర్లు, కార్లు, వివిధ రకాల వాహనాలను ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల వారి అర్హతలు, పూర్వ అనుభవాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ధ్రువీకరించారు.

-  రూ. 16 కోట్లు నిధులు మంజూరు..

ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు రూ. 16 కోట్ల నిధులు దళిత బంధు పథకం కింద విడుదల చేసింది. ఈనెల 25వ తేదీ నుంచి ప్రాథమికంగా యూనిట్లను గ్రౌండింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మార్చి 31వ తేదీలోగా పూర్తి స్థాయిలో యూనిట్లు గ్రౌండింగ్‌ చేయాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. దళితబంధు లబ్ధిదారులకు అవసరమైన సలహాలు, సూచనలు, సహకారాలను వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు అందిస్తున్నారు. రిటైల్‌ షాప్‌ ఏర్పాటు చేయడానికి అవసరమైన ట్రేడ్‌ లైసెన్స్‌లను స్థానిక సంస్థలు, మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు సదరు లబ్ధిదారులకు అందించడానికి కసరత్తులు చేస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే దళితబంధు లబ్ధిదారులు నూతన బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. దళిత బంధు పథకం కింద నూతన మెడికల్‌ షాపులు ప్రారంభించే లబ్ధిదారులు ఫార్మసిస్ట్‌ లైసెన్స్‌, జీఎస్టీ, పాన్‌ నంబరు కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మ్యానుఫాక్చరింగ్‌ సెక్టార్‌కింద యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు నుంచి వాటి స్థాపనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రిటైల్‌ షాప్‌ వివిధ సర్వీసులు, మినీ డెయిరీలు, పశువుల పెంపకం కింద వ్యాపారం ప్రారంభించే వారికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందో లేదో పరిశీలించడంతో పాటు పలు సూచనలు ఇస్తున్నారు. జిల్లాలో రానున్న వారం రోజుల్లో దళిత బంధు ఆర్థిక సహాయం గ్రౌండింగ్‌ పూర్తి చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.