ఆదాయం జమ అభివృద్ధి మమ

ABN , First Publish Date - 2022-08-07T04:52:47+05:30 IST

పురపాలక సంఘానికి ఆదాయం అందించడంలో పట్టణంలోని మున్సిపల్‌ దుకాణాలది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు.

ఆదాయం జమ అభివృద్ధి మమ
ఎమ్మిగనూరు పట్ట్ణణంలోని బురదమయంగా మారిన ఎద్దుల మార్కెట్‌

  1.  మార్కెట్లలో కనీస సౌకర్యాలు కరువు
  2. ఇబ్బందుల్లో వినియోగదారులు, వ్యాపారులు

పట్టణంలోని మార్కెట్లలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఆదాయం తెచ్చి పెడుతున్నా వాటి అభివృద్ధి మాత్రం పాలకులకు పట్టడం లేదు. దీంతో ఆదాయం ఘనం..  సౌకర్యాలు శూన్యం అన్న చందంగా మార్కెట్ల పరిస్థితి తయారైంది. వర్షం వస్తే సంత మార్కెట్‌ చిత్తడి చిత్తడిగా మారుతోంది. గొర్రెల మార్కెట్‌ను సంత మార్కెట్లోకి మార్చినా రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. తారకరామ కూరగాయల సంత మార్కెట్‌ దుకాణాల వెనక వ్యర్థాలు పడేస్తుండడంతో కంపు కొడుతోంది. మున్సిపల్‌ అధికారులు ఆదాయాన్ని జమ చేసుకోవడం తప్ప మార్కెట్లలో మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎమ్మిగనూరు : పురపాలక సంఘానికి ఆదాయం అందించడంలో పట్టణంలోని మున్సిపల్‌ దుకాణాలది ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. అయితే ఆ మార్కెట్లు మాత్రం ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో పశువుల మార్కెట్‌, గొర్రెల మార్కెట్‌, వారపు సంత మార్కెట్‌, డైలీ మార్కెట్లతోపాటు మాంసం మార్కెట్టు, గొర్రె, పశువుల కమేళాలు ఉన్నాయి. ఈ మార్కెట్ల నుంచి ప్రతి ఏడాది దాదాపుగా రూ.65 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది పశువుల మార్కెట్‌ నుంచి రూ. 15.35 లక్షలు, గొర్రెల మార్కెట్‌ నుంచి రూ. 15.45 లక్షలు, వారపు మార్కెట్‌ నుంచి రూ.3.70 లక్షలు, డైలీ మార్కెట్‌ నుంచి రూ. 27.40 లక్షలు మిగతా మాంసం, కమేళాల నుంచి రూ.3 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. సాలీన రూ.65.50 లక్షలు ఆదాయం ఎమ్మిగనూరు పురపాలికకు సమకూరుతోంది. అయితే మున్సిపల్‌ అధికారులు ఆదాయాన్ని జమ చేసుకోవడం తప్ప మార్కెట్లలో మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

 వర్షం వస్తే బురద అంటించుకోవాల్సిందే..

పట్టణంలోని గోనెగండ్ల బైపాస్‌ రోడ్డును ఆనుకొని ఉన్న పశువుల సంత మార్కెట్‌లో ఎలాంటి సౌకర్యాలు కనిపించవు. ఏడాది పొడవునా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వ్యాపారాలు సాగించాల్సిందే. మార్కెట్‌లో గతంలో బోరు, తాగునీటి తొట్టి, కుళాయిలు ఏర్పాటు చేశారు. అవి ఎప్పుడో పాడైపోయాయి. చిన్న పాటి వర్షానికి మార్కెట్‌ మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో బురదలోనే పశువుల క్రయవిక్రయాలు చేయాల్సిన పరిస్థితి. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవటం పట్ల పశువుల యజమానులు, వ్యాపారులు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

గొర్రెల మార్కెట్‌లో సమస్యల గోల

పట్టణంలోని సంత మార్కెట్‌ సమీపంలో ఉన్న మేకల బజార్‌లో ప్రతి ఆదివారం గొర్రెల మార్కెట్‌ నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్య, ప్రాథమిక పాఠశాల ముందు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పది రోజుల క్రితం పక్కనే ఉన్న సంత మార్కెట్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. ఈ మార్కెట్‌లోకి రాకపోకలు సాగించాలంటే జీవాల యజమానులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కంపుకొడుతున్న సంత మార్కెట్‌

పట్టణ నడిబొడ్డున ఉన్న తారకరామ కూరగాయల సంత మార్కెట్‌ను అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవటంతో కంపు కొడుతోంది. దుకాణాల వెనుక వైపు ఖాళీ స్థలంలో వ్యర్థాలను పడేస్తున్నారు. దీంతో అవి కుళ్లి దర్గంధం వెదజల్లుతోంది. ఇక పట్టణంలోని కమేళాల్లో పరిశుభ్రత అంతంత మాత్రమే. మాంసం విక్రయదారులకు సరిపడా సౌకర్యాలు లేవు. వారికి మార్కెట్‌ లేకపోవటంతో పట్టణంలో రోడ్డు సైడు వ్యాపారాలు సాగిస్తున్నారు.

పశువుల మార్కెట్‌లో గరుసైనా వేయాలి

- గౌడ్‌, అలువాల, గోనెగండ్ల మండలం 

పశువుల మార్కెట్‌లో ఎలా తిరుగులాడాలి. వర్షం వస్తే బురదగా ఉంటోంది. పశువులను కొనేందుకు లోపలికి వెళితే బురద అంటించుకోవాల్సిందే. కనీసం మార్కెట్‌ అంతా గరుసైనా వేయిస్తే బాగుంటుంది. పశువులు అమ్ముకునేందుకు వచ్చే వారు ఎక్కడ నిలబడాలి.. ఎక్కడ కూర్చోవాలో తెలియడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవాలి. 

 వారం వారం శుభ్రం చేయిస్తున్నాం

-కృష్ణ మున్సిపల్‌ కమిషనర్‌, ఎమ్మిగనూరు 

మార్కెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. అంతేగాక వారం వారం సంత పూర్తి అయిన తరువా పారిశుధ్యం చర్యలు చేపడుతున్నాం. మార్కెట్లను పరిశీలించి వాటి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటాం. 







Updated Date - 2022-08-07T04:52:47+05:30 IST