ఆదాయం జాస్తి... సౌకర్యాలు నాస్తి!

ABN , First Publish Date - 2022-05-17T05:44:06+05:30 IST

పంచాయతీలకు ఆర్థికంగా ఆదాయం సమకూరుస్తున్న వారపు సంతలు కనీస సౌకర్యాలకు దూరంగా ఉన్నాయి. యేటా ఠంచనుగా వారపు సంత వేలం నిర్వహించే అధికార గణం కనీస సదుపాయాల కల్పనను పట్టించుకోవడం లేదు.

ఆదాయం జాస్తి... సౌకర్యాలు నాస్తి!
చింతచెట్టు నీడలోనే సోమల వారపు సంత

వారపు సంతల దుస్ధితి


సోమల, మే 16: పంచాయతీలకు ఆర్థికంగా ఆదాయం సమకూరుస్తున్న వారపు సంతలు కనీస సౌకర్యాలకు దూరంగా ఉన్నాయి. యేటా ఠంచనుగా వారపు సంత వేలం నిర్వహించే అధికార గణం కనీస సదుపాయాల  కల్పనను పట్టించుకోవడం లేదు. దీంతో ఆకాశమే హద్దుగా మండు టెండలో నిలువ నీడలేక ఆరుబయట ఎండలో వారపు సంతలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వారపు సంతలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.  వేలం  నిర్వహించే అధికారులు, ప్రజాప్రతినిధులు విక్రయదారులు పడే అవస్ధలు తమకు ఎరుగనట్టు ప్రవర్తించడం గమనార్హం. సోమల మండలంలో ఆదివారం కందూరు, బుధవారం ఆవులపల్లె, గురువారం నంజంపేట, శనివారం సోమల వారపు సంతలు నిర్వహిస్తున్నారు. సోమల, కందూరు  వారపు సంతలు వేలం పాటలతో ఏటా రూ.5 లక్షల మించి ఆదాయం వస్తోంది. నంజంపేట, పెద్దఉప్పరపల్లె సంతలతో ఏటా రూ.3లక్షల ఆదాయం సమకూరుతోంది. వీటితో బాటు బస్టాండ్‌ గేటు వేలంతో మరో రూ.50 వేలు వస్తోంది. సోమల వారపు సంతకు మాత్రమే సొంత స్థలం ఉంది. మిగిలిన పంచాయతీల్లో ప్రధానరోడ్డు పైనే సంతలు నిర్వహిస్తున్నారు. సోమలలో చింతచెట్టు నీడనే సంత నిర్వహిస్తున్నారు. వారపు సంతలో షెడ్లు కానీ, తాగునీటి సదుపాయాలు కానీ లేవు. ఏడాది కిత్రం మరుగుదొడ్లు నిర్మించినా నీటి వసతి లేదు. ఎండ, వానలోనే సంత నిర్వహిస్తున్నారు. వారపు సంత నుంచి వచ్చిన ఆదాయంతో కనీస సదుపాయాలు రూపకల్పనకైనా వ్యయం చేయాలని స్ధానికులు కోరుతున్నారు. సోమల, కందూరు వారపు సంతలకు అధిక సంఖ్యలో వ్యాపారస్తులు వస్తుంటారు. ప్రస్తుత వేసవిలో గ్లాసు నీరు కూడా సంతలో లభించవు. బస్టాండ్‌కు వెళ్లి టీ దుకాణాల్లో తెచ్చుకుంటున్నారు.  అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వారపు సంతల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.

Updated Date - 2022-05-17T05:44:06+05:30 IST