చారిత్రక వాస్తవాలపై అసమగ్ర అవగాహన

ABN , First Publish Date - 2021-08-03T06:21:02+05:30 IST

కొప్పర్తి వెంకటరమణమూర్తి తన వ్యాసం (‘హేము హీరో, అక్బర్‌ జీరో’–ఆగస్టు 1వతేదీ)లో చారిత్రకవాస్తవాలను తన కోణం నుంచే చూసి విశ్లేషించినట్టుగా స్పష్టమవుతోంది...

చారిత్రక వాస్తవాలపై అసమగ్ర అవగాహన

కొప్పర్తి వెంకటరమణమూర్తి తన వ్యాసం (‘హేము హీరో, అక్బర్‌ జీరో’–ఆగస్టు 1వతేదీ)లో చారిత్రకవాస్తవాలను తన కోణం నుంచే చూసి విశ్లేషించినట్టుగా స్పష్టమవుతోంది. ఆయన రాసిన అంశాల్లో వాస్తవం కంటే ఊహే డామినేట్ చేసింది. ఆర్య-ద్రావిడ చర్చ ఆంగ్లేయ చరిత్రకారుల కల్పన అని నిజమైన మేధావులకు తెలుసు కనుక వారు దానిని తమ చారిత్రక చర్చల్లో ప్రస్తావించరు. కుహనా మేధావులు మాత్రమే దానిని పట్టుకొని వేలాడుతుంటారు. యుజిసి విధానాలను కొప్పర్తి తప్పు పట్టేముందు, భారతచరిత్రలో వాస్తవాలు ఏమిటి, కల్పనలు ఏమిటి, ఊహలు ఏమిటి అనే విషయాల మీద సమగ్ర అవగాహన కలిగివుంటే బావుండేది. నాగరికత వికసించిన ప్రాంతాలన్నీ పాక్ లోనే ఉండిపోయాయి అని వేలెత్తి చూపే ముందు, అవిభాజ్య భారతదేశం అనే వాస్తవాన్ని విస్మరించడం శోచనీయం. కుతుబ్ మినార్ అనేది ముందు ఎవరు నిర్మించిన ఒంటి స్తంభపు మేడో, నిర్మాణ కర్తఎవరో తెలియకపోవడం విచిత్రం. ఎవరి నిర్మాణం మీద ఎవరు ఉర్దూ పదాలు చెక్కి కుతుబ్ మినార్‌గా మార్చారో కుహనా చరిత్రకారులు చెప్పరు. మెకాలే ఇటువంటి చారిత్రక వక్రీకరణలు చేసినందుకు బ్రిటిష్ వారు అతనిని చట్టపరంగా శిక్షించిన విషయం రచయితకు తెలుసునా? అక్బర్‌కి మతసహనం అన్నవాదనలో కూడా ఎటువంటి ఔచిత్యం లేదు. మతసహనం అంటే అందమైన స్త్రీ ఏ మతస్థురాలైనా అంతఃపురానికి తరలించడం కాదు. ముస్లిం పాలకులనీ, ముస్లిం మతమనీ తెలియకుండా, వారికి ఆ గుర్తింపు ఇవ్వకుండా ‘మొగల్స్’ అని మాత్రమే యూజీసీ పేర్కొన్నదని రచయిత వ్యాఖ్యానించారు. పార్సీ భాషలో మొగల్ అంటే ముష్కరులని అర్ధం. నౌరోజీ, తిలక్, రనడే, గోఖలే వంటి నాయకుల వాస్తవిక పాత్ర నిజానికి స్వల్పం అని రచయితకి తెలిసినా కథనానికి ఆసరాగా వారి పేర్లను వాడినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. చదువుకి నిర్దేశించిన సిలబస్‌ను ‘కేంద్రీత కోణం’లోనే యుజిసి చూసిందని అంటున్నారు రచయిత. విక్షేపణ కోణం నుంచి చూస్తే దానిని సిలబస్ అనరు–ఎన్సైక్లోపిడియా అంటారు. విక్షేపణ దృష్టిలో అందరికీ స్థానం ఉంటుంది. వారి పేర్లు లేవు-వీరిపేర్లు లేవంటూ కూర్చుంటే దానిని సిలబస్ అని ఎలా అంటారు? వివేకానందను, దయానందను ఈ సిలబస్‌లో దూరం పెట్టడంలో యుజిసి చదువుకీ, ధార్మికతకీ ముడి ఎందుకని అనుకొని ఉండవచ్చు. వాస్తవాన్ని నిర్థారించే క్రమంలో హేతువుతో పాటు విశ్వాసానికీ చోటు ఉందనే రచయిత భావనతోనే యుజిసి ఇలాంటి సిలబస్‌కి శ్రీకారం చుట్టిందని ఎందుకు అనుకోకూడదు?.

చల్లా జయదేవ్‌, చెన్నై

Updated Date - 2021-08-03T06:21:02+05:30 IST