
ఆంధ్రజ్యోతి(13-05-2021)
కరోనా లాంటి వైరస్‌ల దాడి నుంచి తప్పించుకోవాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. దీనికి నడక ఎంతో ఉపయోగపడుతుంది.
వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడంలో వ్యాయామం అద్భుతమైన మార్గం. దీనివల్ల శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉంటాం. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారులు ప్రజ్వరిల్లుతున్న వేళ జిమ్‌కు వెళ్లకపోయినా, కనీసం నడకను అలవాటుగా చేసుకొంటే ఎంతో ప్రయోజనం ఉంటుందనేది వైద్యుల మాట.
పెరుగుతున్న కొవిడ్ కేసులు, లాక్‌డౌన్లవల్ల సాధారణ జీవనానికి బ్రేక్‌పడింది. ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. దీని నుంచి ఉపశమనం కల్పించడంలో నడక బాగా ఉపయోగపడుతుంది.
వారానికి 150 నుంచి 300 నిమిషాల వ్యాయామం అవసరమని అమెరికా ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఆరోగ్యకర జీవనానికి రోజుకు 10వేల అడుగులు వేయాలని ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజాగా పేర్కొంది.
రోజూ అరగంట నడక వల్ల చలాకీగా ఉంటారు. ఎందుకంటే నడిచేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకొంటారు. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. నాడులు చైతన్యమవుతాయి.
వాకింగ్ అంటే నిదానంగా అడుగులో అడుగు వేసుకొంటూ చేయకూడదు. జాగింగ్‌లా ఉండాలి. అంతే వేగంగా చేతులు కూడా కదలాలి. దానివల్ల శరీరం వేడెక్కి, రక్తనాళాల్లోని కొవ్వు కరుగుతుంది. గుండెకు రక్త సరఫరా బాగుంటుంది. ఫలితంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
అధిక బరువు, శరీరంలో కొవ్వు ఉండే సరిగ్గా నిద్ర పట్టదు. అలాగే 55 సంవత్సరాలు పైబడిన వారిలో కూడా నిద్ర సమస్య తలెత్తుతుంది. క్రమం తప్పని నడకతో ఈ సమస్యను అధిగమించవచ్చు.
వారంలో కనీసం ఐదు రోజులైనా వాకింగ్ చేయాలనేది నిపుణుల సలహా. అదీ ఉదయం వేళల్లో పార్కుల వంటి పచ్చదనం నిండిన ఆహ్లార ప్రదేశాల్లో నడవడం వల్ల రోజంతా మనసు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది. చేసే పనిపై ఏకాగ్రత కుదురుతుంది.
కరోనా లాంటి వైరస్‌ల దాడి నుంచి తప్పించుకోవాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. దీనికి నడక ఎంతో ఉపయోగపడుతుంది. వాకింగ్‌తో శరీరంలోని కొవ్వు కరిగి, ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. కీళ్ల నొప్పులున్నవారికి నడక తప్పనిసరని నిపులు సూచిస్తున్నారు.
మంచి ఆహారం తీసుకొంటూ, రోజూ నడకను జీవనంలో భాగం చేసుకొంటే మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు. అరగంట నడిస్తే సుమారు 150 కేలరీలు కరుగుతాయి. బరువు తగ్గడానికి నడక అద్భుతంగా పనిచేస్తుంది.