ఎరువుల సబ్సిడీ పెంపు

ABN , First Publish Date - 2022-04-28T08:35:16+05:30 IST

రైతన్నలకు కేంద్రం తీపి కబురు వినిపించింది.

ఎరువుల సబ్సిడీ పెంపు

8 60,939 కోట్ల రాయితీకి క్యాబినెట్‌ ఆమోదం

అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతన్నలకు కేంద్రం తీపి కబురు వినిపించింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో డీఏపీతో సహా భాస్వరం, పొటాషియం ఎ రువులపై రూ.60,939.23 కోట్ల మేర పోషక ఆధారిత రాయితీని ఆమోదిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో.. డీఏపీ సహా పలు రకాల కాంప్లెక్స్‌ ఎరువులు బస్తాకు రూ. 100 నుంచి రూ.400 దాకా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిరుడు మొత్తం సంవత్సరానికీ కలిపి ఫాస్పేట్‌, పొటాష్‌ ఎరువులకు రూ.57,150 మేర సబ్సిడీని ప్రభుత్వం భరించింది. అయితే, అంతర్జాతీయ విపణిలో డీఏపీ ధరలు ఈసారి భారీగా పెరిగాయి. దీంతో.. భారం రైతులపై పడకుండా సబ్సిడీని కూడా ఆ మేరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుడు డీఏపీ బస్తాను రూ.1350 చొప్పు న అందించగా.. కేంద్రం రూ.1650 మేర భారాన్ని భరించింది. ఈ ఏడాది డీఎపీ బస్తా రూ.3851 అయ్యిందని.. కానీ, రైతుకు మాత్రం నిరుటిలాగానే బస్తా రూ.1350 చొప్పున ఇస్తామని, సబ్సిడీని రూ. 1650 నుంచి రూ.2501కు పెంచామని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకూ ఈ సబ్సిడీ వర్తిస్తుందన్నారు. క్యాబినెట్‌ తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు.. 


ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు(ఐపీపీబీ) దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో తన సేవలను విస్తరించడానికి ఉపయోగపడేలా రూ.820 కోట్ల మేర అదనపు నిధులను అందించే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం. 

పది రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఉ న్న ప్రాంతాల్లో 2జీ మొబైల్‌ సేవలను రూ.2,462 కోట్లతో 4జీకి అప్‌గ్రేడ్‌ చేస్తారు. ఇందులో భాగంగా 2,542 మొబైల్‌ టవర్లను 2జీ నుంచి 4జీకి పెంచుతా రు. ఈ టవర్లలో 346 ఏపీలో ఉండగా.. తెలంగాణ లో 53 టవర్లు ఉన్నాయి.  

జమ్ముకశ్మీర్‌లో రూ.4,526.16 కోట్లతో 540 మెగావాట్ల క్వార్‌ జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

వీధివ్యాపారులకు చేయూతనందించే పీఎం స్వనిధి (స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌ నిధి) పథకాన్ని 2024 డిసెంబరు దాకా కొనసాగించాలనే ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. వీధివ్యాపారులకు రూ.5 వేల కోట్ల మేర రుణాలు ఇచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజా పెంపుతో రుణ మొత్తం రూ.8100 కోట్లకు పెరిగింది. 

Updated Date - 2022-04-28T08:35:16+05:30 IST