పరిహారం పెంచి.. ఆదుకోండి

ABN , First Publish Date - 2022-08-12T09:14:40+05:30 IST

పరిహారం పెంచి.. ఆదుకోండి

పరిహారం పెంచి.. ఆదుకోండి

కేంద్ర బృందాన్ని కోరిన రైతులు

అమలాపురం, అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారీ సర్వం కోల్పోతున్నాం. లంక గ్రామాల్లో పంటలన్నీ పూర్తిగా కోల్పోతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న నష్ట పరిహారం ఏమూలకూ సరిపోవడం లేదు. పరిహారాన్ని పెంచి ఆదుకోండి. లేకుంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయడం కష్టం’ అని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో వరద నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం ఎదుట రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని మూడు గ్రామాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. వరదల వల్ల సంభవించిన పంట నష్టాలను పరిశీలించింది. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ రవినే్‌షకుమార్‌ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యులు గోపాలపురం, నాగుల్లంక, నున్నవారి బాడవల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రవినే్‌షకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ మూడు జిల్లాల్లో పర్యటించి.. వరద నష్టాలను పరిశీలించామని చెప్పారు. ‘అధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించాం. పంట, ఆస్తి నష్టాలను ప్రత్యక్షంగా చూశాం. వీటిని మదింపు చేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని చెప్పారు. తమ పర్యటన ముగిసిందని, సీఎం జగన్‌తో సమావేశమయ్యాక కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు నివేదిక ఇస్తామని తెలిపారు.


‘వరద’ సాయంపై ఉదారంగా స్పందించండి: స్పెషల్‌ సీఎస్‌ విజ్ఞప్తి

గోదావరి వరదలకు తీవ్రంగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ కేంద్ర బృందానికి  విజ్ఞప్తి చేశారు. వరద ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం గురువారం రాత్రి విజయవాడలో సాయిప్రసాద్‌ భేటీ అయ్యింది. రవినే్‌షకుమార్‌ స్పందిస్తూ తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి, వీలైనంత మేర ఆదుకోవటానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T09:14:40+05:30 IST