కమీషన్ల కోసం పోలవరం అంచనా విలువలు పెంపు

ABN , First Publish Date - 2021-04-24T05:24:08+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పోలవరం ప్రాజెక్టు అంచనా విలువలు రూ.3,222 కోట్లకు పెంచేసి, దొడ్డిదారిన కమీషన్లు దండుకుంటున్నారని మాజీ మంత్రి సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

కమీషన్ల కోసం పోలవరం అంచనా విలువలు పెంపు

 


 రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి అయ్యన్న ధ్వజం

నర్సీపట్నం, ఏప్రిల్‌ 23 : వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పోలవరం ప్రాజెక్టు అంచనా విలువలు రూ.3,222 కోట్లకు పెంచేసి, దొడ్డిదారిన కమీషన్లు దండుకుంటున్నారని మాజీ మంత్రి సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖరులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు పరుగులు పెట్టించారన్నారు. జగన్‌రెడ్డికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడంపై లేకపోవడం విచారకరమన్నారు. రివర్స్‌టెండరింగ్‌ పేరుతో రూ.780 కోట్లు ఆదా చేశామని గొప్పగా డబ్బాలు కొట్టుకున్నారని విమర్శించారు. ఇప్పుడు పోలవరం అంచనా విలువలు పెంచేసి దొడ్డిదారిన దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరుగుతుందని, ప్రజలు కళ్లు తెరిచి చూడాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శిం విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాల్లో  మీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని, అన్నంపెట్టే రైతులకు ఉపయోగపడే పోలవరంలో కూడా దోచుకోవాలా.. అని సీఎంను ఉద్దేశించి అన్నారు. 

Updated Date - 2021-04-24T05:24:08+05:30 IST