శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-28T05:23:36+05:30 IST

శ్రీశైలం మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీశైలం, నవ ంబరు 27: శ్రీశైలం మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయ ఉత్తర మాడ వీధిలో, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపారాధనలు చేశారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆకాశ దీప ప్రజ్వలనకు ముందుగా అర్చకులు సంకల్పాన్ని పఠించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీళ్లు, బిస్కెట్లు, అల్పాహారం ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న దర్శనం, ఆర్జితసేవ క్యూలైన్ల ఏర్పాట్లను, ఆలయ ప్రాంగణాన్ని పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

 కుటీర నిర్మాణ పథకానికి రూ.5 లక్షల విరాళం 

 శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన కుటీర నిర్మాణ పథకానికి శనివారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ శేర్లింగంపల్లికి చెందిన బి. సత్యనారాయణ రూ. 5 లక్షల విరాళాన్ని దేవస్థానం కార్య నిర్వహణాధికారి ఎస్‌. లవన్నకు అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు శేష వస్ర్తాలు,  ప్రసాదాలను అందజేసి సత్కరించారు. 

-  భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను శనివారం రాత్రి డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి దర్శించుకున్నారు. శ్రీశైలం చేరుకున్న డిప్యూటీ స్పీకర్‌కి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌. లవన్న  స్వాగతం పలికారు. అనంతరం  డిప్యూటీ స్పీకర్‌ స్వామిఅమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  

 కొత్తపల్లి: మండలంలోని సప్త నదుల సంగమేశ్వరంలో శనివారం భక్తులు కార్తీక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు  తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ స్వామి వారికి అభిషేకాలు, పుష్పార్చన, మహా మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. 


Updated Date - 2021-11-28T05:23:36+05:30 IST