డామిట్‌...కోవిడ్‌

ABN , First Publish Date - 2020-07-05T11:48:17+05:30 IST

ఒక మహిళ (47) కడుపునొప్పితో బాధపడుతూ తిరుపతిలో తాను ఎప్పుడూ వెళ్ళే ఆసుపత్రికి వెళ్ళారు. ఆమె రోగ లక్షణాల గురించి రిసెప్షన్‌లో

డామిట్‌...కోవిడ్‌

కరోనా వల్ల పెరిగిన వైద్య ఖర్చులు

విలవిల్లాడుతున్న సామాన్యులు

 

తిరుపతి- ఆంధ్రజ్యోతి: ఒక మహిళ (47) కడుపునొప్పితో బాధపడుతూ తిరుపతిలో తాను ఎప్పుడూ వెళ్ళే ఆసుపత్రికి వెళ్ళారు. ఆమె రోగ లక్షణాల గురించి రిసెప్షన్‌లో వివరంగా అడిగారు. ఆ తర్వాత డాక్టర్‌ను కలవచ్చు అని చెప్పారు. ఎప్పుడూ చెల్లించినట్లే కన్సల్టేషన్‌ ఫీజు రూ.300 ఆమె ఇచ్చారు. ఇంకో వంద ఇవ్వండి అని అడిగారు. ఎందుకు? అనడిగితే ‘కరోనా వల్ల మేడం చాలా తక్కువమందినే చూస్తున్నారు’ అని చెప్పారు. డాక్టర్‌ని కలిశాక టెస్టులు రాశారు. రెండు మూడు గంటల పాటూ పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకుని బయటపడేప్పటికి రూ. 8,600లు ఖర్చయింది. ఇంతా చేస్తే సాధారణమైన కడుపునొప్పే అని తేలింది. 

  

ఈ మాత్రం దానికి ఇంత ఖర్చా అని ఆమె బాధపడుతూ ఉంటే, ‘డబ్బులు పోతేపోయాయ్‌.. కరోనా కాలంలో నాడిపట్టి చూడడమే గొప్పకదా..’ అంటూ పక్కనోళ్ళు ఓదార్చారు.


ఇదీ.. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత జిల్లాలో ప్రయివేటు వైద్యం పరిస్థితి. కరోనా యుద్ధరంగంలో రెండున్నర నెలల పాటూ జాడ లేకుండా పోయిన ప్రయివేటు వైద్య రంగం లాక్‌లు ఎత్తేయడంతో సందడిగా మారింది. ప్రభుత్వ వైద్యులూ సిబ్బందీ ప్రాణాలకు తెగించి సేవలందించే వేళ, ప్రయివేటు వైద్యులు లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్ళకే పరిమితం అయ్యారు. చరిత్రలో ఎన్నడూ దొరకనంత విశ్రాంతిని అనుభవించారు. ఐదో లాక్‌డౌన్‌ వెసులుబాటుతో ప్రయివేటు వైద్యశాలలు మళ్ళీ తలుపులు తెరిచాయి. రెండున్నర నెలల పాటూ జబ్బులను అణచిపెట్టుకున్న ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. వైరస్‌ వ్యాప్తి భయంతో ప్రయివేటు వైద్యశాలలు మునుపటి తీరులో పెద్ద సంఖ్యలో రోగులను అనుమతించడం లేదు. ఫోన్‌లో అనారోగ్యం వివరాలు చెప్పిన తర్వాతే అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని వైద్య ఖర్చులు మాత్రం భారీగా పెరిగిపోయాయి. కన్సల్టేషన్‌ ఫీజుల మొదలు, వైద్య పరీక్షల రేట్లన్నీ పెంచేశారు. రెండున్నర నెలల మూత నష్టం, పెరిగిన నిర్వహణ వ్యయం వల్ల తప్పడం లేదని ప్రయివేటు వైద్యులు చెబుతున్నా అసలే బతుకు భారంగా మారిన 

రోజుల్లో ప్రజలు ఇంతంత ఖర్చులు మోయలేక గోడు మంటున్నారు. 


కరోనా ముందు, తర్వాత ధరలు (రూపాయల్లో)


విభాగం కరోనా ముందు తర్వాత 


సాధారణ ఓపీ 150-300 200-400


స్పెషాలిటీ ఓపీ 300-400 500


అల్ర్టాసౌండ్‌  

(కంప్లీట్‌ అబ్డామన్‌) 800    1000


వైరల్‌ లోడ్‌ (హెపటైటిస్‌ బీ, 

హెచ్‌సీవీ, హెచ్‌ఐవీ 

తదితరాలు) 4,000 6,000


బ్లడ్‌, యూరియా 

రొటీన్‌ పరీక్షలు 1,200 1,800


ఏఈసీ (ఊపిరితిత్తుల 

సామర్థ్య పరీక్ష) 800 1,000


చెస్ట్‌ పీఏ (ఎక్స్‌రే) 350 400


మాస్కు, గ్లౌజు 5 10


హెర్నియా ఆపరేషన్‌ 25,000 30,000 


(అన్ని ఆపరేషన్లలో సరాసరి గతంకంటే రూ.5వేలు పెరిగింది)


 పెరిగిన కన్సల్టేషన్‌లు

జిల్లాలో 2 నుంచి 20 పడకలు లోపు ఉన్న క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలు 120 ఉన్నాయి. 100 పడకల ఆస్పత్రులు 150 వరకు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్‌ ఫీజు కరోనాకు ముందు రూ100 నుంచి రూ300 వరకు ఉండేది. ఇప్పుడు రూ200 నుంచి రూ400 దాకా వసూలు చేస్తున్నారు. నిజానికి ప్రయి ప్రయివేటు ఆసుపత్రిలో ఫీజుల పట్టిక ఏర్పాటు చేయాలి. వీటిలో 70 శాతం ఆసుపత్రుల్లో వాటి ఆచూకీ ఉండదు. అనారోగ్యంతో ప్రయివేటు వైద్యుల దగ్గరకు వస్తున్నవాళ్ళు 

నోరు తెరవకుండా చెల్లించాల్సిందే. 


ల్యాబ్‌ల్లో భారీగా పెరిగిన ఫీజులు

లేబరేటరీల్లో అన్ని రకాల ఫీజులూ పెరిగిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా మూతబడిన ల్యాబ్‌ల్లో సడలింపుల తర్వాత 40 శాతం మాత్రమే తెరిచారు. ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే ల్యాబ్‌లు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. వీరు కూడా రేట్లు పెంచేశారు.  ముంబై, హైదరాబాద్‌ వంటిచోట్లకు పంపే ‘వైరల్‌ లోడ్‌’, థైరాయిడ్‌ వంటి హార్మోనల్‌ పరీక్షలకు రోగులనుంచి అదనంగా ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ4వేలు వరకు ఉండే వైరల్‌ లోడ్‌ పరీక్షకు ఇప్పుడు రూ6వేలకు పైగా వసూలు చేస్తున్నారు. అదేవిదంగా ‘ఏఈసీ’ ఊపిరితిత్తుల పనితీరు తెలిపే పరీక్షకూడా ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో లేదు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఈపరీక్షను ఎక్కువగా రెఫర్‌ చేస్తున్నారు. ఈపరీక్ష కోసం శాంపిల్స్‌ను బయట ప్రాంతాలకు పంపాల్సివుంది. దీని ధర సాదారాణరోజుల్లో రూ800లు ఉంటే ఇప్పుడే రూ1300లు వరకు వసూలు చేస్తున్నారు. 


స్విమ్స్‌లోనూ చేయని వైరల్‌ పరీక్షలు

స్విమ్స్‌ మైక్రోబయాలజీలో ఆర్టీపీసీఆర్‌ పరికరం పాడైపోయింది. దీంతో హెచ్‌బీఎస్‌ఏజీ, హెచ్‌సీవీ, హెచ్‌ఐవీ వంటి వైరల్‌ లోడ్‌ పరీక్షలు చేయడంలేదు. ఇవి ఎక్కడైనా బయట చేయించుకోమని రాసిపంపుతున్నారు.


ప్రైవేట్‌ ల్యాబ్‌లు 

ఈ శాంపిల్స్‌ను తీసుకుని హైదరాబాద్‌కు పంపుతున్నారు. సాధారణ రోజుల్లో రూ4వేలు ఉండే పరీక్షకు ప్రస్తుతం రూ6వేలు వరకు వసూలు చేస్తున్నారు. 


రక్తపరీక్షలకు రెండు వేలు

ఒకవైపు కరోనా విజృంబిస్తుంటే మరోవైపు వర్షాలు మొదలయ్యాయి. దీంతో వైరల్‌ జ్వరాలు పెరిగే అవకాశాలున్నాయి. వీటినిర్థారణ కోసం సీబీపీ బైలురూబిన్‌, డెంగ్యూ , ఎంపీ క్యూబీసీ(మలేరియా), వైడల్‌ (టైఫాయిడ్‌-) పరీక్షలకు ఇంతకుముందు దాదాపు రూ1750లు ల్యాబ్‌ వాళ్లకు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఇవే పరీక్షలకు రూ2వేలు పైనే వసూలు చేస్తున్నారు. 

         

ఆపరేషనంటే పరేషాన్‌ : లాక్‌డౌన్‌ కాలంలో అత్యవసరం కాని ఆపరేషన్లు దాదాపుగా వాయిదా వేసుకున్నారు. ఆసుపత్రులు తెరవడంతో వీరంతా సిద్ధమయ్యారు. తగిన పరీక్షలు చేసి న తర్వాతే డాక్టర్లు ఆపరేషన్లు చేస్తున్నారు. హెర్నియా, పైల్స్‌, అపెండిక్స్‌ వంటి సాధారణ ఆపరేషన్ల రేట్లన్నీ ఇప్పుడు పెరిగి పోయాయి. ఆపరేషన్‌ను బట్టీ ఐదు వేల నుంచీ పదిహేను వేల దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. తిరుపతిలోని ఓప్రైవేట్‌ ఆసుపత్రిలో హెర్నియా వంటి ఆపరేషన్‌ను  గతంలో రూ25వేలుతో చేసేవారు. ఇప్పుడు రూ30వేలు తీసుకుంటున్నారు. 

 

మందులూ భగ్గుమంటున్నాయి

కోవిడ్‌కు ముందు దాదాపు 90 శాతం మెడికల్‌ షాపుల్లో మందులపై 10 శాతం డిస్కౌంట్‌ ఇచ్చేవారు. ఇప్పుడు అన్ని షాపుల్లోనూ డిస్కౌంట్‌ ఎత్తేశారు. ఫర్మా కంపెనీలు కూడా కొన్ని రకాల మందుల ధరలను పెచేశాయి. కరోనా నియంత్రణకు అవసరమైన మాస్క్‌లు, గ్లౌజ్‌ల రేట్లు రెట్టింపు అయ్యాయి. గతంలో రూ.5కి దొరికే సర్జికల్‌ మాస్క్‌ ఇప్పుడు 10 రూపాయలకు అమ్ముతున్నారు. 


పెంచక తప్పడం లేదు: ప్రయివేటు యాజమాన్యాలు

ఫీజుల రేట్లు పెంచక తప్పడం లేదని ప్రయివేటు వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరోనా కారణంగా వైద్య సిబ్బంది భయపడుతున్నారని, వారికి వైరస్‌ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. చాలామంది సిబ్బంది సెలవులు పెట్టి వెళ్లిపోయారని, ఉన్నవారికే అధనపు వేతనం ఇచ్చి పని చేయించుకోవాల్సి వస్తోందంటున్నాయి.  మూడు నెలలుగా ఆసుపత్రులు మూత పడ్డా అద్దెలు, విద్యుత్‌ బిల్లులు, జీతాలు చెల్లించకతప్పలేదని ఈ భారం    రోగులపై వేయక తప్పడంలేదని అంటున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాము రిస్క్‌ అయినా కూడా వైద్యసేవలు అందిస్తున్నామని చెబుతున్నారు. 

Updated Date - 2020-07-05T11:48:17+05:30 IST