పెరిగిన వరి

ABN , First Publish Date - 2020-09-09T11:00:13+05:30 IST

జిల్లాలో ఈ యేడు అధికారులు నిర్ధేంచిన పంటల సాగుకు అధికంగానే సాగు విస్తీర్ణం పెరిగింది

పెరిగిన వరి

జిల్లాలో 2.37 లక్షల ఎకరాలలో సాగైన వరి

పెరిగిన సన్నరకం వరి సాగు

తగ్గని మొక్కజొన్న సాగు

సోయా, పత్తి, పప్పు దినుసుల సాగు అంతంత మాత్రమే..

జిల్లా వ్యాప్తంగా 4.72లక్షల ఎకరాలలో వివిధ పంటల సాగు


కామారెడ్డి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ యేడు అధికారులు నిర్ధేంచిన పంటల సాగుకు అధికంగానే సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.72లక్షల ఎకరాలలో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఈ వర్షాకాలంలో మొదటి నుంచి విస్తారంగా వర్షా లు కురువడంతో వరి పంట అంచనాకు మించి సాగైంది. 2.35 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేశారు. ఇందులో సన్నరకం వరిని ఎక్కువగా సాగు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న సాగు చేయవద్దని సూచించినా పంట సాగు విస్తీర్ణం మాత్రం తగ్గలేదు. రైతులు విస్తృతంగానే మొక్క జొన్న సాగు చేసినట్లు వ్యవసాయా ధికారుల లెక్కలు చెబుతున్నా యి. 50వేల ఎకరాలలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. కానీ సోయా, పత్తి, పప్పు దినుసుల పంటల సాగు మాత్రం అంతంత మాత్రం గానే సాగైంది.


జిల్లాలో 4.72 లక్షల ఎకరాలలో పంటల సాగు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ వర్షకాలం సీజన్‌లో 4,65,453 లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. ఇందులో వరి 2,12, 846 ఎకరాలలో సాగవవుతుందని అంచనా వేయగా.. 2,37, 095 ఎకరాలలో సాగు చేశారు. మొక్కజొన్న పంట సాగు చేయవద్దని అధి కారులు సూచించినా 50,945 ఎకరాలలో పంటను సాగు చేశారు. సోయాబిన్‌ 1,01,920 ఎకరాలకు గాను 81,218 ఎకరాలలో సాగు చేశారు. పత్తి 86,865 ఎకరాలకు గాను 54,357 ఎకరాలలో సాగు చేశారు. కంది 38,774 ఎకరాలకు గాను 36,004 ఎకరాలలో సాగయింది. పెసర 20,286 ఎకరాలకు గాను 15,034 ఎకరాలలో సాగు చేశారు. మినుములు 14,406 ఎకరాలకు గాను 9,823 ఎకరాలలో సాగు చేశారు. చెరుకు 9,328 ఎకరాలకు గాను 5,603 ఎకరాలలో సాగు చేశారు.


పెరిగిన వరి సాగు విస్తీర్ణం

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో వరి పంట జోరుగా సాగైంది. అధికారులు నిర్ధేశించిన అంచనాలకు మించి వరి పంట సాగు కావడం విశేషం. ఈ ఏడు వరి పంట 2.12లక్షల ఎకరాలలో సాగవుతుందని అధికారులు అంచనా వేయగా ఇప్ప టి వరకు 2.37లక్షల ఎకరాలలో వరి సాగైంది.  ఈ యేడు మొదటి నుంచి వర్షాలు విస్తృతంగా కురవడం, జూలైలో వర్షాలు లేకపోవడంతో వరి పంట సాగుపై రైతులు తర్జన భర్జన పడ్డారు. ఆగస్టులో విస్తృతంగా వర్షాలు కురవడంతో వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో జిల్లాలో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. అదే విధంగా పోచారం, కౌలాస్‌ప్రాజెక్ట్‌లతో పాటు సింగీ తం, కళ్యాణి రిజర్వాయర్‌లు నిండుకోవడంతో వాటి కింద విస్తృతంగానే రైతులు వరి పంటను సాగు చేశా రు. ఇక చెరువులు, కుంటలు నిండుకోవడంతో భూగర్భ జలాలు అమాంతంగా పెరగడంతో వరి సాగుకు డోకా లేదని రైతులు భావిస్తున్నారు.


తగ్గని మొక్కజొన్న సాగు

వానాకాలంలో మొక్కజొన్న పంట సాగు చేయ వద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వ్యవసాయ అధికారులు సైతం మొక్కజొన్న స్థానంలో ఇతర పంటలను వేసుకోవాలని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. అయినప్పటికీ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్నను వదులుకోలేదు. గాంధారి, సదాశివనగర్‌, తాడ్వా యి, మాచారెడ్డి, దోమ కొండ, భిక్కనూర్‌, లింగంపేట, బాన్సు వాడ తదితర మండలాల్లో మక్కపంటను ఎంతో కాలంగా సాగు చేస్తున్నారు. గుట్టల ప్రాంతాల్లోని భూముల్లో మిగతా పంటలతో పోలిస్తే మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా పశుసంపదకు గ్రాసం దొరుకుతోంది. దీంతో రైతులు జిల్లా వ్యాప్తంగా 50వేలఎకరాలకు పైగానే మొక్కజొన్న సాగు చేశారు.


సోయా, పత్తి, పప్పు దినుసుల సాగు అంతంత మాత్రమే

మొక్కజొన్న పంటకు బదులుగా సోయా, పత్తి, కందులు, మినుములు పెసర పంటలను రైతులు సాగు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో ఈ పంటల సాగుపై, లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. కానీ రైతులు మాత్రం సోయా, పత్తి, పప్పుదినుసు పంట లను అంతంతమాత్రంగానే సాగు చేశారు. ఈ వానా కాలం సీజన్‌లో అధికారులు ఈ పంటలకు నిర్ధేశించిన లక్ష్యానికి తక్కువగానే పంటలు సాగవడం గమనార్హం. పత్తిపంట సాగు అధికారుల అంచనా కన్నా 30వేల ఎకరాలు తగ్గింది. సోయా 25వేల ఎకరాలు తక్కువ సాగైంది. పెసర 5వేల ఎకరాలు, మినుములు 4వేల ఎకరాలు, కంది పంట అంచనా కన్నా 3వేల ఎకరాలు తక్కువ వేశారు.


పంటలు విస్తారంగానే సాగయ్యాయి : సింగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

జిల్లాలో వానాకాలం సీజన్‌లో విస్తారంగానే రైతులు పంటలను సాగు చేశారు. ఆశించిన మేర వర్షాలు సైతం కురవ డంతో వరి పంట అంచనాలకు మించి సాగైంది. ఇందులోనూ సన్నాల వరి సాగు ను రైతులు ఎక్కువగా సాగు చేయడం విశేషం. ఇప్పటి వరకు 2.37లక్షల ఎకరాలలో రైతులు వరిని సాగు చేశారు. పప్పు దినుసుల పంటల విస్తీర్ణం సైతం గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ పంటల సాగుకు తగ్గట్టుగా రైతులకు లాభదాయకంగానే దిగుబడు లు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2020-09-09T11:00:13+05:30 IST