పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2020-07-05T10:41:58+05:30 IST

జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇందులో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక సాప్ట్‌వేర్‌ ఉద్యోగి ఉన్నారు.

పెరుగుతున్న కేసులు

జగిత్యాల జిల్లాలో మరో నలుగురికి కరోనా 

ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి


జగిత్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇందులో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక సాప్ట్‌వేర్‌ ఉద్యోగి ఉన్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్సైకి ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాంటాక్ట్‌ల ఆధారంగా పలువురు శుక్రవారం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. శనివారం ఇందులో నలుగురికి పాజిటివ్‌ అని రిపోర్టులు వచ్చాయి. ఇందులో ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చిన ఓ ఎస్సైకి డ్రైవర్‌గా పనిచేస్తున్న 38 సంవత్సరాల కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ తేలింది. జీపు డ్రైవర్‌ ఇటీవల అప్పాలో శిక్షణ పొంది విధుల్లో చేరినప్పటినుంచి ఎస్సైకి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పాలో పలువురికి కరోనా పాజిటివ్‌ రాగా అదే కాంటాక్ట్‌తో ఎస్సైకి, కానిస్లేబుళ్లకు కూడా సోకినట్లు వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుంగా గొల్లపెల్లి పోలీస్‌ స్టేషన్లో పనిచేస్తున్న ఓ 50 సంవత్సరాల కానిస్టేబుల్‌, మరో 56 సంవత్సరాల కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది.


గొల్లపెల్లి పోలీసులను కరోనా కలవరపెడుతోంది. ఎస్సైతో పాటు ఆయన భార్యకు, ఇప్పుడు ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో జిల్లా పోలీస్‌శాఖలో కలకలం రేపుతోంది. అలాగే జగిత్యాల పట్టణంలోని బస్‌ డిపో ప్రాంతానికి చెందిన ఓ 35 సంవత్సరాల యువకుడు హైదరాబాద్‌లోని మేడ్చల్‌ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తూ ఇటీవల జగిత్యాలకు వచ్చాడు. రెండు, మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ శుక్రవారం పరీక్షలు చేయించుకోగా శనివారం పాజిటివ్‌ అని తేలింది. వైధ్యులు కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్‌లు సేకరిస్తూ వారి కుటుంబ సభ్యులను హోం క్వారైంటైన్‌కు తరలిస్తున్నారు.

Updated Date - 2020-07-05T10:41:58+05:30 IST