Advertisement

అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు.. రంగారెడ్డి జిల్లాలో పరిస్థితి ఇదీ..!

Jun 30 2020 @ 10:37AM

చంపేస్తున్న కరోనా

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మృతి

రంగారెడ్డిలో ఇద్దరు, వికారాబాద్‌లో ఒకరు

సోమవారం ఒక్క రోజే 176 కేసులు 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా చంపేస్తోంది. పెరుగు తున్న పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా బారిన పడి సోమవారం ఐదుగురు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, వికారాబాద్‌ జల్లా బొంరాస్‌పేట మండలం తుంకిమెట్లకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 53కు చేరింది. ఇందులో మేడ్చల్‌ జిల్లాలో 24, రంగారెడ్డిలో 23, వికారాబాద్‌లో ఆరుగురు ఉన్నారు. 


176 కేసులు నమోదు

ఉమ్మడిరంగారెడ్డి జల్లాలో సోమవారం 176 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 117, రంగారెడ్డి జిల్లాలో 59 నమోదయ్యాయి. వికారాబాద్‌లో ఒక్కటీ నమోదు కాలేదు. 


జీహెచ్‌ఎంసీలో పెరుగుతున్న పాజిటివ్‌లు

రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలోని కందుకూరు డివి జన్‌ సరూర్‌నగర్‌లో 13, శేరిలింగంపల్లిలో6, ఇబ్రహీంపట్నం డివిజన్‌ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 7 కేసులు నమోదయ్యాయి.


గ్రామాల్లోకి పాకిన కరోనా..

నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలోని కందుకూరు డివిజన్‌ బాలాపూర్‌లో 8, దుబ్బచర్లలో 2, రాజేంద్రనగర్‌ డివిజన్‌ పరిధి నార్సింగ్‌లో2, నర్కొడలో ఒకరు, చేవెళ్ల డివిజన్‌ పరిధి శంకర్‌పల్లిలో ఒకరు, మొయినాబాద్‌లో ఒకరు కరోనా బారినపడ్డారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 2, ఇబ్రహీంపట్నంలో 2, యాచారంలో 1, షాద్‌నగర్‌ డివిజన్‌లోని చించోడులో 1, కొత్తూరులో 1 తేలాయి. 


ఆమనగల్లులో...

ఆమనగల్లులో శ్రీనివాస కాలనీలో ఓ యువకుడికి కరోనా వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులను అధికారులు హోం క్వారెంటైన్‌ చేశారు.


ఘట్‌కేసర్‌లో...

ఘట్‌కేసర్‌లోని మేథాకాలనీలో  ఒక కేసు నమోదైంది. పరిశ్రమలో పనిచేసే మహిళకు పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 


శంషాబాద్‌లో మరో రెండు..

శంషాబాద్‌ బ్రాహ్మణవాడ బస్తీలోని మహిళకు పాజిటివ్‌ రాగా మధురానగర్‌లో బాలుడికి పాజిటివ్‌ వచ్చింది. వారం రోజుల క్రితం అతడితండ్రికి కరోనా సోకింది. 


షాద్‌నగర్‌లో ఇద్దరికి... మామిడిపల్లిలో ఒకరికి..

షాద్‌నగర్‌ అయ్యప్పకాలనీలో ఆర్టీసీ ఉద్యోగికి, రైతుకాలనీలోమరో వ్యక్తికి, నందిగామ మండలం మజీద్‌ మామిడిపల్లికి చెందిన మరో వ్యకి (48)కి  కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్లుతెలిపారు. కాగా షాద్‌నగర్‌ సబ్‌-రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కరోనా కలకలం సృష్టించింది. శానిటైజేషన్‌ పేరుతో మంగళవారం నుంచి మూడు రోజులు షాద్‌నగర్‌, ఫరూఖ్‌నగర్‌ కార్యాలయాలను బంద్‌ చేయబోతున్నారు. 


వికారాబాద్‌లో మరో మూడు కేసులు

వికారాబాద్‌ పట్టణంలోని శివాజీనగర్‌లో ఒకరికి,  ధారూరు మండలం నాగసాన్‌పల్లిలో ఒకరికి కరోనా సోకినట్టు గుర్తించారు.  మోమిన్‌పేట మండలం కోల్కుంద గ్రామంలో మరో వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. 


కరోనాతో తుంకిమెట్ల వాసి మృతి

తుంకిమెట్లకు అనంతయ్య (65) కరోనాతో  మృతి చెందాడు. ఆయన చింతచెట్టుపై నుంచి కిందపడగా వెన్నెముక విరిగింది. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించి ఆదివారం ఆయన మృతి చెందాడు.  

Follow Us on:
Advertisement
Advertisement