నేరాలపై కేసుల నమోదు పెరగడం మంచి పరిణామం : కైలాశ్ సత్యార్థి

ABN , First Publish Date - 2022-04-16T23:35:35+05:30 IST

నేరాలపై కేసుల నమోదు పెరగడం మంచి పరిణామమేనని, వ్యవస్థపై

నేరాలపై కేసుల నమోదు పెరగడం మంచి పరిణామం : కైలాశ్ సత్యార్థి

జైపూర్ : నేరాలపై కేసుల నమోదు పెరగడం మంచి పరిణామమేనని, వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగినట్లు దీనినిబట్టి అర్థమవుతోందని నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి శనివారం చెప్పారు. ప్రజలకు అవగాహన పెరుగుతుండటం మంచి సంకేతమని తెలిపారు. రాజస్థాన్ పోలీస్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా పోలీసు అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


‘ప్రతి బిడ్డకు న్యాయం, పోలీసులు, పౌర సమాజం పాత్ర’ అనే అంశంపై కైలాశ్ మాట్లాడుతూ, చాలా నేరాలపై కేసులు నమోదు కావడం లేదన్నారు. బాలలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ఎవరికైనా చెప్పడానికి భయపడతారన్నారు. దేశంలో బాలలకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచాలన్నారు. మతాలు కూడా బాలలకు సన్నిహితంగా ఉండాలని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ఓ హిందూ బాలిక ఓ మసీదులోకి వెళ్లి, అక్కడి మౌల్వీ నుంచి రక్షణ పొందగలగాలన్నారు. అదేవిధంగా ఓ ముస్లిం బాలిక ఇబ్బందుల్లో ఉంటే, ఓ దేవాలయంలో సహాయం పొందగలగాలన్నారు. పూజారి దుర్గా దేవిని అర్చించినట్లుగానే, ఇబ్బందుల్లో ఉన్న బాలికను కూడా గౌరవించాలన్నారు. 


పరిపాలన గురించి తెలుసుకోవాలంటే పోలీసుల పనితీరును బట్టి తెలుసుకోవచ్చునని చెప్పారు. పోలీసు మాన్యువల్‌లో  చెప్పినదాని కన్నా ఎక్కువ నైతిక బాధ్యత పోలీసులకు ఉంటుందన్నారు. 


Updated Date - 2022-04-16T23:35:35+05:30 IST