ICC Women's World Cup: బంగ్లాపై భారత్ బంపర్ విక్టరీ.. సెమీస్ ఆశలు సజీవం!

ABN , First Publish Date - 2022-03-22T19:09:37+05:30 IST

మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.

ICC Women's World Cup: బంగ్లాపై భారత్ బంపర్ విక్టరీ.. సెమీస్ ఆశలు సజీవం!

హామిల్టన్: మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో మిథాలీసేన అద్భుతంగా రాణించింది. టీమిండియా విధించిన 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేక చతికిలపడింది. భారత బౌలర్లు విజృంభించడంతో బంగ్లా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేన నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యంగ్ ప్లేయర్ యస్తీక భాటియా హాఫ్ సెంచరీ(50)తో రాణించగా.. షఫాలీ వర్మ(42), స్మృతి మంధాన(30), పూజా వస్త్రాకర్(30), స్నేహ రాణా(27) పరుగులతో పర్వాలేదనిపించారు. 


ఇక 230 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు ఏ దశలో టార్గెట్‌ను అందుకునే దిశగా పయనించలేదు. భారత బౌలర్ల ధాటికి 35 పరుగులకే తొలి ఐదు కీలక వికెట్లు పారేసుకుంది బంగ్లా. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు పడడంతో చివరకు 119 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో సల్మాన్ ఖతున్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిస్తే.. లత మొండల్(24), ముర్షిదా ఖతున్(19), రీతు మోని(16) రెండు అంకెల స్కోర్ నమోదు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో స్నేహ రాణా 4 వికెట్లు పడగొడితే.. ఝులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు.. రాజేశ్వరి గైక్వాడ్, పూనం యాదవ్ తలో వికెట్ తీశారు. అర్ధశతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యస్తీక భాటియా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. ఇక ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. తర్వాతి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిస్తే భారత్‌కు సెమీస్ వెళ్లే అవకాశం ఉంటుంది.   




Updated Date - 2022-03-22T19:09:37+05:30 IST