‘బలుపు’పై ఇండస్ర్టీ భగ్గు

ABN , First Publish Date - 2022-01-13T07:54:13+05:30 IST

‘సినిమావాళ్లకు బలుపు ఎక్కువ’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమ రగిలిపోయింది...

‘బలుపు’పై ఇండస్ర్టీ భగ్గు

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి వ్యాఖ్యలపై

రగిలిన సినీ పరిశ్రమ పెద్దలు

మీలా పైసా పెట్టి కోట్లు దోయడం లేదు

కోట్లు పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం

ఎవరెంత తింటున్నారో చర్చకు వస్తారా?

చీప్‌గా దొరికామని నోరుజారొద్దు: తమ్మారెడ్డి

అవాకులు పేలేవారికే బలుపు: ఎన్వీ ప్రసాద్‌

బలుపుంటే మాత్రం తప్పేంటి?: వీఎన్‌ ఆదిత్య


‘‘సినిమావాళ్లకు బలుపు ఎక్కువ’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమ రగిలిపోయింది. పరిశ్రమలోని పెద్దలంతా తీవ్రస్వరం వినిపించారు. ‘‘చీప్‌గా దొరికామని నోరు జారొద్దు’’ అంటూప్రసన్నకుమార్‌రెడ్డికి దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం ఫిల్మ్‌ చాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సినిమా వాళ్లకి సిగ్గులేదు...దమ్ములేదు...బలిసిందని నిందించారు. మాకూ దమ్ము, ధైర్యం ఉన్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నామే తప్ప మీలా రెచ్చగోట్టే ధోరణి కాదు మాది. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ ఆస్తులెంత.. ఇప్పుడెంత? మమ్మల్ని విమర్శించేముందు మీ గురించి కూడా ఆలోచించుకోవాలి. కోట్ల పెట్టుబడి పెట్టి పైసా పైసా ఏరుకుంటున్నాం.


మీలా రూపాయి ఖర్చు పెట్టి కోట్లు దోచుకోవడం లేదు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సినీ సమస్యలపై ఫిల్మ్‌ చాంబర్‌... ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. కొద్ది రోజుల్లో పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నానని చెప్పారు. సినిమావాళ్లకు బలుపు ఉండదనీ, సినీ పరిశ్రమపై అనవసరంగా అవాకులు, చవాకులు మాట్లాడేవారే బలిసికొట్టుకుంటున్నారని ఫిలిం చాంబర్‌ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ ఆగ్రహించారు. బుధవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘కొవ్వూరులో ఆయనంటే ఏమిటో అందరికీ తెలుసు. ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అంటే గౌరవం ఉంది. కానీ, సినిమా వాళ్లను అమర్యాదగా మాట్లాడటం మంచిదికాదు’’ అని మండిపడ్డారు. ‘‘మనగోడు వినిపించుకునే నాథుడు అక్కడ ఉండాలి కదా’ అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తమ ఇబ్బందులను సరైన విధంగా ప్రభుత్వం ముందుంచడంలో సినీ పరిశ్రమ విఫలమైందనే వాదనపై స్పందిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ‘‘కరోనా పరిస్థితుల్లో ప్రజలు థియేటర్లకు వస్తారో రారో అనే అనుమానాలు ప్రభుత్వానికి ఉండొచ్చు. అయితే ‘అఖండ’ విజయం ఆ అనుమానాలను పటాపంచలు చేసింది’’ అని అన్నారు. 


బలుపుంటే తప్పేమిట్రా.. 

బడాచోర్‌

దర్శకుడు విఎన్‌ ఆదిత్య 

‘‘ఈ మాట అన్న వ్యక్తి (ప్రసన్నకుమార్‌రెడ్డి) తన జీవితంలో ఓ ఐదువేల మంది వ్యక్తుల్ని పర్సనల్‌గా కలుస్తాడేమో. కానీ సినిమావాడు 2.5 లక్షల పై చిలుకు పాత్రల్ని కల్పిస్తాడు. కాబట్టి, ఆ మాత్రం  బలుపుండచ్చు.. ఓ  నాయకుడు ఓటేసిన వ్యక్తిని ‘ఓటరు మహాశయుడు’ అంటాడు. సినిమా వాడు మాత్రమే ప్రేక్షకుడిని దేవుడంటాడు. ఏ వ్యక్తయినా తన జీవితాన్ని మాత్రమే అనుభవిస్తాడు. కానీ సినిమా వాడు, వాడి జీవితంతో పాటు అందరి జీవితాలూ అనుభవిస్తాడు. అందుకే అందరి పట్లా, అన్ని సమస్యల పట్లా సున్నితంగా స్పందిస్తాడు. కాబట్టి బలుపుండవచ్చు. తప్పులేదు. నాయకుడు గెలిచి పదవిలో ఉన్నంత వరకే అతనికి మర్యాద, కొద్దిమందికి మాత్రమే మరణానంతరం కూడా ప్రజల గుండెల్లో స్థానం. కానీ సినిమా వాడు భూమ్మీద మనిషి మనుగడ ఉన్నంతకాలమూ చిరస్థాయిగా నిలిచిపోతాడు సినిమా రూపంలో. నాయకుడు గెలిచి, పదవిలో ఉన్నంతవరకే హీరో.. కానీ సినిమా వాడు ఒకసారి హిట్‌ కొడితే, లైఫ్‌ లాంగ్‌ అండ్‌ ఆఫ్టర్‌ లైఫ్‌ కూడా హీరోయే. నాయకుడి  ప్రచారానికి సినిమావాడు సాయపడతాడు. ఒక్క సినిమా టికెట్టు తెగడానికి ఏ ఒక్క నాయకుడూ, అతని ప్రచారమూ పనికి రావు...ప్రేక్షకుడి మౌత్‌ టాక్‌ తప్ప..  మరి బలుపు ఉండటంలో తప్పేముంది? సినిమా వాడు కావాలనుకుంటే రాజకీయ నాయకుడు కాగలడు. కానీ తలకిందులుగా తపస్సు చేసినా ఒక నాయకుడు ప్రేక్షకుడిని అలరించే కథానాయకుడు కాలేడు. ఒక ఎమ్మెల్యే గెలిస్తే, 7 మండలాల ప్రజల్లో  ఓట్లేసిన వారికే గొప్ప. అదే సినిమా వాడు హిట్‌ అయితే, ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ గొప్పే! సినిమా వాడు అందమైన మరో ప్రపంచాన్ని ఆరునెలలకొకటి సృష్టించగలడు.. ఒక నాయకుడు ఉన్న ప్రపంచాన్ని అందంగా ఆర్రోజులైనా ఉంచగలడా.. అందుకే బలుపు మా ఇంటి పేరు..వాపు నీ వంటి తీరు..నీ వాపుకి పదవీ కాలం పదవిలో ఉన్న అయిదేళ్లే..సినిమా వాడి బలుపుకి పదవీ కాలం భూమి మీద తెలుగు వాడు ఉన్నంత కాలం. అలసిపోయి ఇక్కడితో ఆపుతున్నా. బలుపుంటే తప్పేమిట్రా.. బడాచోర్‌’’ అంటూ దర్శకుడు వీఎన్‌ ఆదిత్య చాలా  ఆవేశంగా సోషల్‌ మీడియాలో  పోస్ట్‌ చేశారు.


ఏపీ మంత్రులతో మాట్లాడతా: తలసాని

తెలంగాణలో సినిమా థియేటర్లపై ఎటువంటి ఆంక్షలు లేవని ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడం కోసం ఇటీవల టికెట్‌  రేట్లు పెంచామనీ, చిన్న సినిమాలు, సందేశాత్మక చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదు ఆటలు ప్రదర్శించుకోవడానికి  అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఏపీలో థియేటర్‌ సమస్యల గురించి అక్కడి మంత్రులతో చర్చిస్తానని తలసాని హామీ ఇచ్చారు. ‘‘తెలుగు చిత్రపరిశ్రమ దేశంలోనే ఒక హబ్‌గా ఉండాలనేది మా ఆకాంక్ష. సినిమాకు కులం, మతం, ప్రాంతం అనేది ఉండదు. వినోదం అందిస్తుంది. సినిమా ప్రతి ఒక్కరికీ అవసరం’ అని తెలిపారు. 

Updated Date - 2022-01-13T07:54:13+05:30 IST