ఆగని అశ్లీలం

ABN , First Publish Date - 2021-10-24T05:49:55+05:30 IST

ఉన్నతాధికారుల హెచ్చరికలను కొందరు పోలీసు అధికారులు పెడచెవిన పెడుతున్నారు.

ఆగని అశ్లీలం

నిర్వాహకులపై కేసులు..

పోలీసులపై చర్యలు


ఏలూరు క్రైం/తాడేపల్లిగూడెం క్రైం/దేవరపల్లి, అక్టోబరు 23 : ఉన్నతాధికారుల హెచ్చరికలను కొందరు పోలీసు అధికారులు పెడచెవిన పెడుతున్నారు. తమదైన శైలిలో చెలరేగిపోతూ అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అశ్లీల నృత్య ప్రదర్శనలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మొన్న తాడేపల్లిగూడెం మండలం కొత్తూరు, నిన్న ఏలూరు రూరల్‌ పోణంగి, నేడు దేవరపల్లి మండలం త్యాజంపూడిలలో జరిగిన జాతరలు, ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. వీటిని అరికట్టాల్సిన పోలీసులే పలుచోట్ల ప్రోత్సహించారన్న ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు. బాధ్యులపై చర్యలకు దిగారు. ఏలూరు నగరానికి సమీపంలోని పోణంగిలో ఈ నెల 21 రాత్రి గొంతానమ్మ పండుగను పురస్కరించుకుని అశ్లీల నృత్యాలు జరిగాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన డీఎస్పీ గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీని సేకరించారు. ఊరేగింపుల నిర్వహణకు పోలీసులు ముందస్తు అనుమతి ఇచ్చారని విచారణలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఏలూరు రూరల్‌ సీఐ అనసూరి శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్‌ఐ చావా సురేష్‌లను బాధ్యులుగా గుర్తించి విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఏలూరు రేంజ్‌ డీ ఐజీ కేవీ మోహనరావు ఆదేశాలు జారీచేశారు. 


కొత్తూరు ఘటనపై విచారణ


తాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో దసరా ఉత్సవాలకు అశ్లీల నృత్యాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకున్నామని నరసాపురం డీఎస్పీ ఆంజనేయరెడ్డి  తెలిపారు. నృత్యాలపై దర్యాప్తు చేసేందుకు శనివారం ఆయన గ్రామంలో పర్యటించారు. ఈ అంశంలో ఆరుగురు నిర్వాహకులపై ఘటన జరిగిన రోజే కేసు నమోదు చేసి అరెస్టు చే సినట్టు ఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాస్‌ డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పాఠశాలను సందర్శించి మరో 18 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. సర్పంచ్‌ కూడవల్లి హనుమంతు, ఎంపీటీసీ నరసింహమూర్తి, కార్యదర్శి, వీఆర్‌వోలను విచారించారు. 


త్యాజంపూడిలో డ్యాన్సులు


దేవరపల్లి మండలం త్యాజంపూడిలో గొంతేలమ్మ అమ్మ వారి పండుగ సందర్భంగా శుక్రవారం రాత్రి రికార్డింగ్‌ డ్యాన్సులు వేయడానికి రాజమండ్రి నుంచి నలుగురు అమ్మాయిలను తీసుకువచ్చి అక్కడ డ్యాన్సులు వేస్తున్నారన్న వచ్చిన సమాచారంపై పోలీసులు దాడి చేశారు. అమ్మాయిలను తీసుకువచ్చిన గ్రామానికి చెందిన మధు, రామకృష్ణతో పాటు అమ్మయిలతోపాటు వచ్చిన ఆనంద్‌ అనే వ్యక్తిపైన, మరో ఎనిమిది మంది సహా మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. 


వీఆర్‌కు జంగారెడ్డిగూడెం సీఐ 


జంగారెడ్డిగూడెం టౌన్‌, అక్టోబరు 23 : విధుల్లో అలసత్వం వహిస్తున్న కారణంగా జంగారెడ్డిగూడెం సీఐ గౌరీశంకర్‌ను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో ఓ వ్యక్తిని స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించిన నేపథ్యంలో ఎస్‌ఐ వై.సత్యనారా యణ, హెడ్‌ కానిస్టేబుల్‌ పరుశురామ్‌ను సస్పెండ్‌ చేశారు. ఇదే కేసుకు సంబంధించి సీఐ గౌరీశంకర్‌ను శనివారం వీఆర్‌కు బదిలీ చేశారు. గతంలో సీఐగా విధులు నిర్వహించిన బీఎన్‌ నాయక్‌ వీఆర్‌కు బదిలీ అయిన తర్వాత గత నవంబర్‌లో ఈయన విధుల్లో చేరారు. పట్టుమని ఏడాది కూడా గడవకుండానే వీఆర్‌కు బదిలీ అయ్యారు. 







Updated Date - 2021-10-24T05:49:55+05:30 IST