జౌళి సంస్థల నిరవధిక సమ్మె

ABN , First Publish Date - 2022-05-23T15:51:49+05:30 IST

పత్తి, నూలు ధరల పెంపునకు నిరసనగా తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాల్లో బనియన్ల తయారీ కర్మాగారాలు, జౌళి సంస్థలు మూతపడ్డాయి. తిరుప్పూరు జిల్లాల్లో ఆదివారం

జౌళి సంస్థల నిరవధిక సమ్మె

 - తిరుప్పూరులో పవర్‌లూమ్‌ల మూత 

చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి) : పత్తి, నూలు ధరల పెంపునకు నిరసనగా తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాల్లో బనియన్ల తయారీ కర్మాగారాలు, జౌళి సంస్థలు మూతపడ్డాయి. తిరుప్పూరు జిల్లాల్లో ఆదివారం నుంచి రెండు లక్షల పవర్‌లూమ్‌ల (మరమగ్గాల)ను మూసివేశారు. దీంతో ఐదు లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. జూన్‌ ఐదు వరకు ఈ సమ్మె  కొనసాగించనున్నట్లు జౌళి సంస్థల యజమానులు ప్రకటించారు. ఈ సమ్మెకారణంగా తిరుప్పూరు, కోవై జిల్లాల్లో జౌళి రంగానికి రోజుకు రూ.100 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని వారు తెలిపారు. ధరలు పెరిగినప్పటికీ పత్తి, నూలు కొరత కూడా తీవ్రంగా ఉండటంతో జౌళి సంస్థలు, బనియన్ల కర్మాగారాల్లో గత పదిహేను రోజులుగా ఉత్పత్తులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తమ సమ్మె పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి, జౌళి శాఖ మంత్రికి  డీఎంకేకు చెందిన ఎంపీలు కలిసి పత్తి, నూలు ధరలను తగ్గించాలని వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదన్నారు. ప్రస్తుతం పత్తి నూలు కొనుగోలుకు అడ్వాన్స్‌ సొమ్ము కట్టినా పది రోజుల తర్వాతే వాటిని సరఫరా చేస్తున్నారని వాపోయారు. ఇదిలా ఉండగా తిరుప్పూరు జిల్లాలోని మంగళం, పల్లడం, తెక్కలూరు, శ్యామలాపురం, కోయంబత్తూరు జిల్లాలోని కరుత్తంబట్టి, సూలూరు, సోమానూరు తదితర ప్రాంతాలతో కోయంబత్తూరు, తిరుప్పూరు జిల్లాల్లో ఫవర్‌లూమ్‌లు, జౌళి సంస్థల మూతపడటంతో వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న సుమారు పదిలక్షల మందికి పైగా కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతున్నారు.

Updated Date - 2022-05-23T15:51:49+05:30 IST