త్వరలో పోలవరం పూర్తి

ABN , First Publish Date - 2022-08-16T06:05:49+05:30 IST

76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి విశ్వరూప్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.

త్వరలో పోలవరం పూర్తి
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి విశ్వరూప్‌

ఇప్పటికే చాలా భాగం పూర్తి చేశాం

వచ్చే నెలలో నిర్వాసితులకు పూర్తి ప్యాకేజీ అందిస్తాం..ఆ తరువాతే తరలిస్తాం

గోదావరి వరదల్లో యంత్రాంగం స్పందన అమోఘం

జిల్లాల విభజనతో నవశకం

పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం

చురుగ్గా ఏలూరు మెడికల్‌ కాలేజీ పనులు

స్వాతంత్య్ర వేడుకల్లో ఇన్‌చార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి విశ్వరూప్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా ముంపు మండలాల్లోని ప్రజలు ఇళ్ళు మునిగి ఎన్నో ఇబ్బం దులు పడ్డారు. జిల్లా యంత్రాంగం స్పందించి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా అప్రమత్తం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బాధిత కుటుంబాలను కలిసి బాసటగా ఉంటామని హామీ ఇచ్చారు. వరద సహాయక కార్యక్రమాల్లో బాధితులకు అండగా ఉండి వారందరిలోనూ ఆత్మస్థైర్యం నింపిన యంత్రాంగం కృషి అభినందనీయమన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ప్రతీ పేద కుటుంబంలో సంతోషాన్ని నింపి వారి జీవన ప్రమాణ స్థాయిని పెంచేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు. దేశ స్వాతంత్య్రం కోసం మేముసైతం అంటూ ఆ పోరాటంలో పాల్గొని మన జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసిన అల్లూరి సీతారా మరాజు, భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి ఎందరో మహాను భావులకు జోహార్లు అర్పించారు. ఇప్పటిదాకా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకా లను మంత్రి వివరించారు. పేదరికాన్ని రూపు మాపేందుకు నవరత్నాల కార్యక్రమం ద్వారా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్నామన్నారు.


జిల్లాల విభజన నవ శకానికి నాంది 

పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మరింత సత్వరంగా సేవలు అందించే దిశగానే నూతన జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పార్లమెంటు నియోజక వర్గ ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలుగా రూపుదిద్దుకున్నాయని, పరిపాలన సంస్కరణల్లో కొత్త జిల్లాల ఏర్పాటుతో సుస్థిర ప్రగతికి బాటలు పడ్డాయంటూ ప్రశంసించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు జిల్లా కేంద్రానికి దూరబారాన్ని తగ్గించి పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈ ప్రక్రియ నవశకానికి నాంది పలికిందన్నారు. 


సంక్షేమానికి ఊతమిచ్చాం

జిల్లా వ్యాప్తంగా ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అతిపెద్ద ప్రాధాన్యం ఇస్తుందని  విశ్వరూప్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిపాలన సంస్కరణల్లో భాగంగా గ్రామ సచివాలయాల ద్వారా పాలనా వ్యవస్థను నిరుపేదల గుమ్మం వద్దకు తీసుకువెళ్ళామని ప్రకటించారు. నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగు నింపామన్నారు. జిల్లాలో 758 లేఅవుట్లలో కాలనీలు నిర్మిస్తున్నామని, దాదాపు లక్షా 3 వేల కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరు చేశామన్నారు. మహిళల ఆర్ధిక స్వావ లంభనకు పెద్దపీట వేస్తూ గత ఆర్ధిక సంవత్సరంలో 28 వేల డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చి ఆదుకున్నామన్నారు.  ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ కింద 95 కోట్లు అందిం చామని, ఏలూరు, జంగారెడ్డిగూడెంలలో ఆక్వా హబ్‌లు ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. సంచార పశు ఆరోగ్య సేవాపథకం కింద ఏడు వాహనాలు సమకూర్చా మన్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా జూన్‌ మొదటి నాటికే గోదావరి జలాలను కాలువలకు విడుదల చేసి జిల్లాలో మూడో పంటకు అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వాసు పత్రులకు కార్పొరేట్‌ ఆసుపత్రు లుగా రూపుదిద్దుతున్నామన్నారు. ఏలూరులో 525 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి  ప్రకటిం చారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన వైద్య సేవలు అందిం చేందుకు అన్ని ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్‌ కారణంగా కుటుంబ పెద్దను కోల్పోయిన బీసీ కుటుంబాలను ఆదుకు నేందుకు 15 కోట్లు అందించామని చెప్పారు. స్పందన కార్యక్రమం ద్వారా 22 వేలకుపైగా దర ఖాస్తులు అందగా వాటిలో 21 వేలు పరిష్కరించామన్నారు. రహదారుల కోసం 307 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఏలూరు నగరానికి ప్రధాన తాగునీటి వనరైన కృష్ణకాలువ ప్రక్షాళనకు యంత్రాంగం చూపిన చొరవను ఆయన అభి నందించారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలను అందిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పతాకావిష్కరణలో జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జిల్లా జడ్జి పురుషోత్తమకుమార్‌, టీడీఎం కోర్టు జడ్జి దివాకర్‌, ఎక్సైజ్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ రమణారెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌, ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, డీఐజీ పాల్‌రాజ్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, మేయర్‌ నూర్జహాన్‌ పెదబాబు, ఏలూరు అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ చైర్‌పర్సన్‌ మధ్యాహ్నపు ఈశ్వరీ బలరాం, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ బి.వి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


అలరించిన ప్రదర్శనలు 

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సెయింట్‌ థెరిస్సా హైస్కూలుకు చెందిన జి.రఘునందిని గిటారు వాయిద్యంతో వందేమాతరం గీతం ఆలపించింది. అనంతరం పెదపాడు జడ్పీ హైస్కూల్‌, ఏలూరు శర్వాణి, కుక్కునూరు, వేలేరుపాడు కెజివీవీ పాఠశాలలకు చెందిన  విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన రంజింపచేసింది. తెల్లంవారిగూడెం విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. భోగాపురం విజ్ఞాన్‌, జంగారెడ్డి గూడెం విద్యావికాస్‌ స్కూలు విద్యార్థులు వందేమాతరం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.






Updated Date - 2022-08-16T06:05:49+05:30 IST