ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర ఫలాలు

ABN , First Publish Date - 2022-08-16T07:03:34+05:30 IST

మహాత్మాగాంధీ కలలుగన్న స్వరాజ్య స్థాపన, సంక్షేమ రాజ్య దిశగా ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర ఫలాలు అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని అన్నారు.

ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర ఫలాలు

సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పనకు పెద్దపీట

‘అమ్మఒడి’ కింద అర్హులైన 1.75 లక్షల మందికి రూ.262.5 కోట్లు 

314 పాఠశాలల్లో రూ.133 కోట్లతో నాడు-నేడు రెండో దశ పనులు

భీమిలిలో రూ.25 కోట్లతో జెట్టీ నిర్మాణం

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద విద్యార్థులకు రూ.22 కోట్లు

జీవీఎంసీలో 1.4 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు

నగరంలో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటుకు రూ.720 కోట్లు 

రూ.వెయ్యి కోట్లతో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు

నెలాఖరులోగా అందుబాటులోకి బీచ్‌రోడ్డులోని సీహారియర్‌ మ్యూజియం

ఎన్‌ఏడీ ఫ్లైవోవర్‌కు అనుసంధానంగా రూ.28 కోట్లుతో రైల్వే ట్రాక్‌పై పైవంతెన

సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ.7500 కోట్లు రుణాల పంపిణీకి ప్రణాళిక

 జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని


విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):

మహాత్మాగాంధీ కలలుగన్న స్వరాజ్య స్థాపన, సంక్షేమ రాజ్య దిశగా ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర ఫలాలు అందించేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజని అన్నారు. సోమవారం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక స్వావలంబన దిశగా పాలన సాగుతుందని పేర్కొన్నారు. వైద్య రంగాన్ని పటిష్ఠం చేయడానికి నగరం, గ్రామీణ ప్రాంతాల్లో రూ.41.8 కోట్లతో 39 ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదించగా...ఇప్పటివరకు 22 పూర్తయ్యాయన్నారు. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు 21,34,170 మందికి రెండు డోసులు, 7.07 లక్షల మందికి ప్రీకాషనరీ  టీకాలు వేశామన్నారు. కొవిడ్‌తో మృతిచెందిన 3,788 మందికి రూ.50 వేలు వంతున పరిహారం అందజేశామన్నారు. నాడు-నేడులో భాగంగా పీహెచ్‌సీల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని 1,406 పాఠశాలల్లో 3,21,381 మంది చదువుతున్నారని, వారిలో అర్హులైన 1.75 లక్షల మందికి అమ్మఒడి కింద రూ.262.5 కోట్లు జమ చేశామన్నారు. నాడు-నేడు తొలి దశ కింద ఉమ్మడి జిల్లాలో 1,131 పాఠశాలల్లో రూ.323 కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్నారు. రెండో దశలో విశాఖపట్నం జిల్లాలో 314 పాఠశాలల్లో రూ.133 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. రైతుభరోసా కింద 26,539 మంది రైతు కుటుంబాలకు రూ.14.59 కోట్లు, పీఎం కిసాన్‌ కింద 23,065 కుటుంబాలకు రూ.4.65 కోట్లు అందజేయడం జరిగందని ఆమె వివరించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద జిల్లాకు రూ.7.23 కోట్లు సబ్సిడీ కింద మంజూరైందన్నారు. భీమిలిలో రూ.25 కోట్లతో కొత్త జెట్టీ నిర్మాణం చేపడతామన్నారు. 

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో అల్పాదాయ వర్గాల కోసం పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. పింఛన్‌ కానుక కింద 1,69,810 మందికి ప్రతి నెలా రూ.44 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మొత్తం 3,998 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.254 కోట్ల రుణ సదుపాయం, ‘ఆసరా’ కింద గడచిన రెండేళ్లలో 26,500 సంఘాల ఖాతాలకు రూ.384 కోట్లను జమ చేశామన్నారు. వైఎస్సార్‌ బీమా పథకంలో అర్హులుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 4,09,270 కార్మికులను గుర్తించామన్నారు. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన కింద విద్యార్థులకు రూ.22 కోట్లు మంజూరు చేశామన్నారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ శాఖల ద్వారా 85 వేల మంది విద్యార్థులకు రూ.30 కోట్లు విడుదల చేశామన్నారు. జిల్లాలో 641 రేషన్‌ షాపుల పరిధిలో 5,07,321 బియ్యం కార్డులు ఉండగా, వాటిలో 12,004 అంత్యోదయ అన్నయోజన కార్డులు ఉన్నాయన్నారు. ఈ నెల నుంచి వారికి ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.38 కోట్లతో 212 పనులు ప్రతిపాదించామన్నారు. జాతీయ అభివృద్ధి బోర్డు నుంచి వచ్చిన రూ.25 కోట్లతో రెండు ప్రఽధాన రహదారుల పనులు చేపడుతున్నామన్నారు. జిల్లాలో 53 గ్రామ సచివాలయాలు, 54 రైతుభరోసా కేంద్రాల నిర్మాణాలకు ప్రతిపాదించగా 70 శాతం పనులు పూర్తిచేశామన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జీవీఎంసీ పరిధిలో 1.4 లక్షల మందికి 4,661 ఎకరాల్లో రూపొందించిన 72 లేఅవుట్‌లలో స్థలాలు పంపిణీ చేశామన్నారు. ఈ లేఅవుట్లలో తొలి దశ కింద లక్ష మందికి ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షల వంతున రూ.1800 కోట్లు గ్రాంటు జిల్లాకు వచ్చిందన్నారు. జగనన్న కాలనీల్లో 705 బోరుబావులకు విద్యుత్‌ సర్వీసులు ఇవ్వడానికి రూ.13 కోట్లు కేటాయించామన్నారు. ఇంకా లేఅవుట్‌లలో విద్యుత్‌ సదుపాయం కోసం రూ.108 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. మొత్తం 72 జగనన్న లేఅవుట్‌లలో 150 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. 

విశాఖ నగరంలో రూ.720 కోట్లతో భూగర్భ విద్యుత్‌ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించినట్టు మంత్రి రజని తెలిపారు. ఇప్పటివరకు రూ.484 కోట్ల ఖర్చు కాగా...80,529 కనెక్షన్‌లను భూగర్భ విద్యుత్‌ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుత సంవత్సరం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.7,500 కోట్లు రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక ఖరారు చేశామన్నారు. పచ్చదనం పెంపొందించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 8.89 లక్షల మొక్కలు నాటామన్నారు. జీవీఎంసీ పరిధిలో రూ.1000 కోట్లతో 61 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పనులు ప్రారంభించగా...ఇంతవరకు 49 ప్రాజెక్టులు పూర్తిచేశామన్నారు. రూ.19.75 కోట్లతో నాలుగు గార్బేజీ స్టేషన్లు ప్రతిపాదించగా భీమిలి, చీమలాపల్లి స్టేషన్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇండస్ర్టియల్‌ కారిడార్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.24 కోట్లతో 75 ఎలక్ర్టానిక్‌ వెహికల్స్‌ కొనుగోలు చేయడంతో పాటు నాలుగు బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. నగరంలో ఇంతవరకు 781 కి.మీ. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తిచేయగా, మరో 210 కిలోమీటర్ల పనులు త్వరలో పూర్తిచేస్తామన్నారు. 

పర్యాటకాభివృద్ధిలో భాగంగా బీచ్‌రోడ్డులో సీహారియర్‌ మ్యూజియం ఈ నెలాఖరుకు అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ వంతెనకు అనుసంధానంగా రూ.28 కోట్లతో రైల్వే ట్రాక్‌పై ఫ్లైఓవర్‌ పనులు త్వరలో చేపడతామన్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు, యంత్రాంగం, శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తున్న నగర సీపీ, పోలీసులకు రజని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం తదితరులను ఆమె గుర్తుచేసుకుంటూ వారి స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా జిల్లా సమగ్ర అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, సీపీ సీహెచ్‌, శ్రీకాంత్‌, జేసీ కేఎస్‌ విశ్వనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-16T07:03:34+05:30 IST